Akhanda 2 Release: రాజకీయ పలుకుబడి ఉన్న ఏ స్టార్ హీరో కి అయినా కొన్ని పనులు చాలా తేలికగా సాగిపోతాయి. ఉదాహరణకు ఆంధ్ర ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) నటించిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం విడుదలకు ముందు అనేక ఆర్ధిక ఇబ్బందులను ఎదురుకుంది. స్క్రీన్ మీద సినిమా పడేవరకు ఈ చిత్రం విడుదల అవుతుందనే నమ్మకం అభిమానులకు కూడా లేదు. ఏకంగా 11 సార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు విడుదలకు దగ్గరకు వచ్చిన ఈ సినిమాకు ఫైనాన్షియర్స్ నుండి తలనొప్పి ఎదురైంది. ఆ చిత్ర నిర్మాత AM రత్నం పాత సినిమాలకు సంబంధించి చేసిన అప్పులు మొత్తం ఈ సినిమాకు అడ్డు పడ్డాయి. కానీ పవన్ కళ్యాణ్ ఈ విషయం లో చొరవ తీసుకొని, తన తదుపరి చిత్రాల నిర్మాతలతో మాట్లాడి, అప్పటికప్పుడు 30 కోట్ల రూపాయిలు ఏర్పాటు చేసి, AM రత్నం అప్పులు తీర్చి ఆ సినిమాని విడుదల చేయించాడు.
‘అఖండ 2′(Akhanda 2 Movie) చిత్రానికి కూడా ఇదే సమస్య ఎదురైంది. కానీ ఇక్కడ బాలయ్య(Nandamuri Balakrishna) తనకు ఎలాంటి సంబంధం లేదు అన్నట్టుగా వ్యవహరించాడు. ఆయన ఈ విషయం లో చొరవ తీసుకొని, తన వియ్యంకుడు సీఎం చంద్రబాబు నాయుడు తో ఒక్క మాట చెప్పిస్తే కచ్చితంగా ఈ సినిమా విడుదల అయ్యుండేది. కానీ ఆయన అలాంటివేమీ చెయ్యలేదు. నా బాధ్యత ఈ సినిమాలో నటించడం వరకే, ఆ తర్వాత పరిణామాలకు నేను బాద్యుడిని కాదు అన్నట్టుగా వ్యవహరించాడు. అందుకే ఈ చిత్రం విడుదలకు నోచుకోలేదు. లక్షలాది మంది అభిమానుల ఆశల పై నీళ్లు చల్లింది. గతం లో కూడా బాలయ్య ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు పట్టించుకోలేదు అనే వాదన ఉంది. అందుకు ఉదాహరణ ‘మహారథి’ అనే చిత్రం. అప్పట్లో ఈ సినిమా విడుదలకు ముందు కూడా ఎన్నో ఆర్ధిక ఇబ్బందులు ఉండేవి. థియేటర్స్ లో సినిమాని చూసేందుకు సిద్ధం గా అభిమానులు ఉన్న సమయం లో విడుదల వాయిదా అంటూ ప్రకటన వచ్చింది.
అప్పుడు కూడా బాలయ్య చొరవ తీసుకొని ఉండుంటే సినిమా విడుదల అయ్యేదని, ఆయన నాకు ఎందుకు లే అని పట్టించుకోకపోవడం వల్లే ఆ చిత్రం చివరి నిమిషం లో వాయిదా పడిందని అంటున్నారు. ఈ ఆరోపణలు ఎంత వరకు నిజమో తెలియదు కానీ, ఉన్న పరిస్థితులను చూస్తుంటే నిజమే కదా అని అనిపించక తప్పదు. చూడాలి మరి కనీసం ఇప్పుడైనా బాలయ్య చొరవ తీసుకొని ఈ చిత్రం విడుదల అవ్వడానికి కృషి చేస్తాడో లేదో అనేది. అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఈ సినిమా విడుదల ఆగిపోయినట్టే, కొత్త విడుదల తేదీ కోసం ఎదురు చూడాలి అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.