
RGV Certificate : దర్శకుడు రామ్ గోపాల్ వర్మను ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ప్రొఫెసర్స్ ఓ కార్యక్రమానికి అతిథిగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన స్టూడెంట్స్ ని తన ప్రసంగంతో అలరించారు. వారికి విలువైన జీవిత సలహాలు ఇచ్చారు. కాగా రామ్ గోపాల్ వర్మ తన ఒరిజినల్ డిగ్రీ ఇంతవరకు తీసుకోలేదట. ఆయనకు ఉద్యోగం చేసే ఆలోచన లేదు. ఈ క్రమంలో ఆయన తన డిగ్రీ సర్టిఫికెట్ యూనివర్సిటీకి వెళ్లి తెచ్చుకోలేదు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీకి వర్మ విచ్చేసిన నేపథ్యంలో… సర్ప్రైజ్ గా ఆయన ఇంజనీరింగ్ ఒరిజినల్ డిగ్రీ యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చారు.
ఈ విషయాన్ని వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. 1985లో నేను సివిల్ ఇంజనీరింగ్ పూర్తి చేశాను. నాకు ఉద్యోగం చేసే ఆలోచన లేకపోవడంతో డిగ్రీ సర్టిఫికెట్ తీసుకోలేదు. 37 ఏళ్ల తర్వాత నా డిగ్రీ చేతికి వచ్చింది. నాగార్జున యూనివర్సిటీకి ధన్యవాదాలు అంటూ… ట్వీట్ చేశారు. అలాగే తన ఓ డీ ఫోటో తీసి పోస్ట్ చేశారు. దాన్ని పరిశీలించగా ఆయనకు సెకండ్ క్లాస్ వచ్చినట్లు తెలుస్తుంది. సివిల్ ఇంజనీరింగ్ ని వర్మ సెకండ్ క్లాస్ లో పాస్ అయ్యారు.
వర్మ ఇంజనీరింగ్ విజయవాడ సిద్ధార్థ కాలేజ్ లో పూర్తి చేశారు. చదువుకునే రోజుల్లో ఆయన విజయవాడ నగరంలో చోటు చేసుకున్న రాజకీయ, సామాజిక వర్గ విభేదాలు చూశారు. పాలిటిక్స్ లో స్టూడెంట్స్ ఇన్వాల్వ్మెంట్. విద్యార్థులను పొలిటీషియన్స్ ఎలా వాడుకుంటారనేవి అధ్యయనం చేశారు. అప్పటి వాస్తవ పరిస్థితుల ఆధారంగా… శివ మూవీ కథ రాసుకున్నారు. నాగార్జున హీరోగా తెరకెక్కించి వర్మ చరిత్ర సృష్టించారు. అలా మొదలైన వర్మ సినిమా ప్రస్థానం ఇండియాలోనే టాప్ డైరెక్టర్ గా ఎదిగే స్థాయికి వెళ్ళింది.
గొప్ప దర్శకుడైన వర్మ లైఫ్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశారు. క్రియేటివిటీ పక్కన పెట్టి కాంట్రవర్సీని నమ్ముకున్నాడు. ప్రముఖులను బద్నామ్ చేస్తూ సినిమాలు చేసి క్యాష్ చేసుకోవాలనే చీప్ ట్రిక్స్ కి అలవాటు పడ్డారు. ఒకప్పటి వర్మ సినిమాలను తలచుకుంటే ఎక్కడ ఉండాల్సిన వాడు ఎక్కడకు దిగజారిపోయారనిపిస్తుంది. అయితే వర్మ ఫిలాసఫీ వేరు. ఉన్నన్నాళ్ళు జీవితాన్ని ఆస్వాదించడమే అని నమ్ముతారు. వర్మ జీవన శైలిని ఇష్టపడేవాళ్లు కూడా ఉన్నారు.