Actress Sudha: అమ్మ పాత్రలకు నిర్మలమ్మ, అన్నపూర్ణ బ్రాండ్ అంబాసర్స్ గా ఉన్నారు. ఒక్కో జెనరేషన్ లో ఒక్కో క్యారెక్టర్ ఆర్టిస్ట్ అమ్మ పాత్రలకు ప్రాచుర్యం కల్పించారు. 90వ దశకం వరకు నిర్మలమ్మ హవా సాగింది. ఆమెకు వయసు పెరిగాక అన్నపూర్ణ ఫార్మ్ లోకి వచ్చారు. అన్నపూర్ణ కూడా దశాబ్దాల పాటు అమ్మ పాత్రలు చేశారు. ఈ జనరేషన్ లో అమ్మ పాత్రలకు సుధ ఫేమస్ అయ్యారు. అన్నపూర్ణకు ఏ మాత్రం తీసిపోకుండా సుధ వందల చిత్రాల్లో నటించారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుధ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.

దర్శకుడు బాలచందర్ కారణంగానే ఇన్నేళ్లు పరిశ్రమలో ఉండగలిగాను అన్నారామె. మీ ఫేస్ లో హీరోయిన్ గ్లామర్ లేదు. మీరు అమ్మ పాత్రలకు బాగా సెట్ అవుతారని ఆయన నాకు సూచించారు. కెరీర్ బిగినింగ్ లో నేను మదర్ రోల్స్ చేస్తుంటే కొందరు వద్దని సలహా ఇచ్చారు. ఇకపై నువ్వు అలాంటి పాత్రలే చేయాల్సి వస్తుంది, చేయకు అన్నారు. కానీ అమ్మ పాత్రలు చేయడం వలెనే నేను పరిశ్రమలో ఉండగలిగాను. ఈ పాత్ర చేయడం నేను ఆస్వాదిస్తున్నాను. ఏనాడూ అమ్మ పాత్రలు చేస్తున్నానని బాధపడలేదు అన్నారు.
నాలుగు తరాల హీరోలతో పని చేశానన్న సుధ… జూనియర్ ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం అన్నారు. ఎన్టీఆర్ నా కొడుకు లాంటి వాడు. అందుకే మీరు, ఆయన అనకుండా వాడు అంటానని సుధా తెలిపారు. తారక్ మంచి యాక్టర్, డాన్సర్. అతను సెట్స్ లోకి వస్తే వాతావరణం ఆహ్లాదంగా మారిపోతుంది. స్టార్ అనే భావన తారక్ లో కనిపించదు. అందరితో కలిసిపోతాడు. ఎంత అల్లరి చేస్తాడో అంత హుందాగా కూడా ఉంటాడు.

బాద్ షా మూవీ షూట్ అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది. నేను తారక్ స్టేజ్ మీద డాన్స్ చేసే సీన్ అది. ఒక టేక్ అయ్యాక… నేను మరో టేక్ చేద్దాం అన్నాను. ఎందుకు బాగానే వచ్చిందిగా అని ఎన్టీఆర్ అన్నాడు. లేదు ఇంకో టేక్ చేద్దాం అన్నాను. రెండో టేక్ చేసేటప్పుడు నాకు కాలు బెణికింది. ఎన్టీఆర్ పరుగున వచ్చి నాకాళ్ళు పట్టుకొని ఫస్ట్ ఎయిడ్ గా గాయమైన చోట స్ప్రే కొట్టారు. నన్ను జాగ్రత్తగా పట్టుకొని పక్కన కూర్చోబెట్టాడు. అంత పెద్ద స్టార్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ విషయంలో అలా స్పందించాల్సిన అవసరం లేదు. పక్కనోళ్ళకు చెబితే సరిపోతుంది. తారక్ అలా కాకుండా స్వయంగా సపర్యలు చేశాడని సుధ ఎన్టీఆర్ వ్యక్తిత్వం గురించి గొప్పగా చెప్పారు.