Actress pranitha: కన్నడ పవర్ స్టార్ పునిత్ రాజ్‌కుమార్ మృతి… కొట్లాది మందిని విషాదంలో ముంచింది. ఆయన ఈ లోకం నుంచి శాశ్వతంగా సెలవు తీసుకున్నారు. ఎంతో భవిష్యత్ ఉన్న ఈ హీరో చిన్నతనం లోనే గుండెపోటుతో మరణించడం భారతీయ సినిమా పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. పునీత్ కేవలం నటనతోనే కాదు… తన సేవా కార్యక్రమాలతోనూ అభిమానుల మనసుల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. అలాంటిది ఆయన అకాలమరణంతో తను నిర్వహిస్తోన్న సేవా కార్యక్రమాలపై కొంచెం సందిగ్ధత నెలకొంది. ఈ క్రమంలో పునీత్ స్ఫూర్తితో కొందరు సినిమా తారలు ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు రెడీ అవుతున్నారు. ఇటీవల పునీత్ చదివిస్తోన్న 1,800 మంది పిల్లల బాధ్యతలను విశాల్ తీసుకోగా… తాజాగా నటి ప్రణీతా సుభాష్ ఒకరోజు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయనుంది.
బెంగళూరు నగరంలోని అంబేడ్కర్ భవనంలో బుధవారం (నవంబర్3)న ఈ మెడికల్ క్యాంపు జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు సాగే ఈ వైద్య శిబిరంలో ఎవరైనా ఉచితంగా వైద్య పరీక్షలు చేయించుకోవచ్చనని ప్రణీత తెలిపింది. ‘ అప్పూ సర్…చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ అవసరమైన వారందరికీ సాయం చేశారు. వారి విద్య, వైద్య ఖర్చులన్నీ భరించారు. ఇవేకాక మీరు ఎన్నో మంచి పనులు చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి అడుగుజాడల్లో నడవడమే ఆయనకు మనమిచ్చే అసలైన నివాళి’ అని మెడికల్ క్యాంప్ వివరాలను సోషల్ మీడియాలో పంచుకుంది ప్రణీత. ఇప్పుడే కాదు..ప్రణీత గతంలోనూ ‘ప్రణీత ఫౌండేషన్’ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా కొవిడ్ కల్లోల సమయంలో ఎంతో మందికి ఎన్నో విధాలుగా సాయం చేసి అభిమానుల మనసు గెల్చుకుందీ అందాల తార ప్రణీత..