
Tollywood Drugs Case 2021: టాలీవుడ్ లో సినీ ప్రముఖులంతా ఈడీ విచారణకు హాజరువుతున్నారు. టాలీవుడ్ డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా వరుసగా వచ్చేస్తున్నారు. ఇప్పటికే డ్రగ్స్ విక్రేత కెల్విన్ తోపాటు సినీ ప్రముఖులు పూరి జగన్నాథ్, చార్మి, రకుల్, నందులను ఈడీ అధికారులు విచారించారు. వారి నుంచి కీలకవిషయాలు రాబట్టినట్లు సమాచారం.
విచారణలో భాగంగా బుధవారం ఉదయం హీరో రానా దగ్గుబాటి (Rana Daggubati) ఈడీ విచారణకు హాజరయ్యారు. తన వ్యక్తిగత సిబ్బందితో కలిసి ఆయన ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు.
మనీలాండరింగ్ కోణంలో ఈ డ్రగ్స్ కేసును విచారిస్తున్నారు. రానా బ్యాంకు ఖాతాలను అధికారులు పరిశీలిస్తున్నారు. అనమానాస్పద లావాదేవీలపై ఆరాతీస్తున్నట్టు సమాచారం. కెల్విన్ తో ఉన్న పరిచయాలు, ఎఫ్ క్లబ్ గురించి ఈడీ అధికారులు సుధీర్ఘంగా ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
డ్రగ్స్ కేసులో మనీ లాండరింగ్ చట్టం కింద సినీ రంగానికి చెందిన 12 మందికి ఈడీ ఇటీవల నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నేడు రానాతోపాటు నటి ముమైత్ ఖాన్ ను సైతం అధికారులు విచారిస్తున్నారు.