Posani Vs Ashwini Dutt: నటుడు పోసాని కృష్ణమురళి నిర్మాత అశ్వినీ దత్ మీద ఫైర్ అయ్యారు. నీ బ్రతుకు నాకు తెలుసంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిర్మాత అశ్వినీ దత్ నిన్న ఏపీ ప్రభుత్వంపై పరోక్షంగా కామెంట్స్ చేశారు. ఏపీలో ప్రస్తుతం రౌడీ పాలన నడుస్తోంది అన్నట్లు సెటైర్లు వేశారు. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ‘మోసగాళ్లకు మోసగాడు’ మూవీ రీరీలీజ్ చేస్తున్నారు ఈ క్రమంలో కృష్ణ తమ్ముడు, నిర్మాత ఆదిశేషగిరిరావు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ప్రెస్ మీట్లో బి. గోపాల్, తమ్మారెడ్డి భరద్వాజ్, సి. అశ్వినీ దత్ కూడా పాల్గొన్నారు.
ఈ వేదికపై నంది అవార్డ్స్ తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు ఇవ్వడం లేదు, దీనిపై మీ స్పందన ఏంటని అడగ్గా… అశ్వినీ దత్ ఏపీ ప్రభుత్వం మీద తన అసహనం బయటపెట్టారు. ఇప్పుడు నడుస్తున్న సీజన్ వేరు. వాళ్ళు ఉత్తమ రౌడీ, ఉత్తమ గూండా అవార్డ్స్ మాత్రమే ఇస్తారు. నంది అవార్డ్స్ ఇవ్వాలంటే రెండు మూడేళ్లు ఆగాలి… అన్నారు. వైసీపీ ప్రభుత్వమే టార్గెట్ గా అశ్వినీ దత్ చేసిన ఈ కామెంట్స్ కాకరేపాయి.
దీంతో ఏపీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి స్పందించారు. సి. అశ్వినీ దత్ కామెంట్స్ కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సీఎం జగన్ మీకు ఏం అన్యాయం చేశాడని టార్గెట్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడులా వెన్నుపోటు పొడిచారా? కరోనా కారణంగా రాష్ట్రంలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడ్డాయి. ప్రాధాన్యత ఆధారంగా పాలన చేస్తున్నారు. ముందు ప్రజల అవసరాలు తీర్చడమే ప్రధాన లక్ష్యం. ఆయన వచ్చిన తర్వాత నంది అవార్డులు ఇవ్వలేదు. ఇస్తే ఎవరూ పేరు పెట్టని విధంగా ఇస్తారు.
ఉత్తమ వెన్నుపోటు, ఉత్తమ మోసగాడు అవార్డు మీకు ఇవ్వాలి. ఎన్టీఆర్ మీద చెప్పుల దాడి చేసినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు. రజనీకాంత్ రోజుకోసారి విజయవాడ వచ్చి చంద్రబాబును పొగిడినా మాకు వచ్చిన నష్టం లేదని పోసాని ఎద్దేవా చేశారు. నీ బ్రతుకు ఏంటో నాకు తెలుసు, నా బ్రతుకు ఏంటో నీకు తెలుసు. ఇప్పటికైనా కొంచెం నీతిగా బ్రతుకు అంటూ పోసాని ధ్వజమెత్తారు.