Navdeep
Navdeep: హైదరాబాద్ లో ఎక్కడైనా డ్రగ్స్ పట్టుబడితే దాని మూలాలు టాలీవుడ్ లో బయటపడుతున్నాయి. డ్రగ్స్ అనే వర్డ్ వినిపిస్తే చాలు తెలుగు సినీ పరిశ్రమ భుజాలు తడుముకునే పరిస్థితి వస్తుంది. గతంలో టాలీవుడ్ నటి నటులు మీద చాలానే సీరియస్ ఆరోపణలు వచ్చాయి. కానీ అవన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి . తాజాగా మాదాపూర్ లో చిక్కిన డ్రగ్స్ రాకెట్ లో మరోసారి టాలీవుడ్ నటీనటుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.
మాదాపూర్ లోని విఠల్ నగర్ లో ఉన్న ఫ్రెష్ లివింగ్ అపార్టుమెంట్ లో దొరికిన తీగను లాగితే అది అటు ఇటు తిరిగి చివరికి టాలీవుడ్ నటీనటుల దగ్గరకు చేరుకుంది. ఇప్పటికే డ్రగ్స్ వ్యవహారం మీద చాలా సీరియస్ గా పనిచేస్తున్న హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని గట్టిగా పట్టుకున్నారు. ఇందులో భాగమైన ఫిల్మ్ ఫైనాన్షియర్ వెంకటరమణ రెడ్డి తో పటు ‘డియర్ మేఘ ‘ చిత్ర దర్శకుడు అనుగు సుశాంత్ రెడ్డిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.
వారిద్దరిని విచారించిన పోలీసులు మరికొందరు టాలీవుడ్ జనాలకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రముఖ నటుడు నవదీప్ కి కూడా నోటీసులు జారీ చేశామని , అతడు పరారీలో ఉన్నాడంటూ నగర పోలీసు కమిషనర్ సీపీ ఆనంద్ చెప్పారు. అదే విధంగా షాడో సినిమా నిర్మాత ఉప్పలపాటి రవి తో పాటుగా మోడల్ శ్వేతా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా పరారీలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో 10 లక్షలు విలువైన డ్రగ్స్ ను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
దీనిపై నవదీప్ మాట్లాడుతూ నేను ఎక్కడికి పారిపోలేదు, ఇందులో ఉన్న పేరు నాది కాదు, ఈ కేసుకు నాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పుకొచ్చాడు. గచ్చిబౌలి లోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్ లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రో లో డ్రగ్స్ అమ్మకాలు జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బాలాజీ అనే డ్రగ్స్ డీలర్ నుంచి కొనుగోలు చేసి వినియోగిస్తున్న వారిలో ప్రముఖులు, సినీ ప్రముఖులు ఉన్నట్లు పోలీసులు గుర్తించి వారికి నోటీసులు జారీ చేస్తున్నారు. అయితే నవదీప్ ని అరెస్ట్ చేయవద్దని హైకోర్ట్ ఆదేశించినట్లు సమాచారం.