Actor Jogi Naidu: అప్పట్లో జోగి బ్రదర్స్ చాలా ఫేమస్. బుల్లితెర మీద ఈ ఇద్దరు అన్నదమ్ములు అలరించారు. ఇద్దరూ నటులుగా కూడా రాణించారు. వీరిలో జోగి నాయుడు ఎక్కువ సినిమాల్లో నటించారు. జోగి నాయుడు స్టార్ యాంకర్ ఝాన్సీ మాజీ భర్త. వీరిది ప్రేమ వివాహం. ఒక అమ్మాయి పుట్టాక మనస్పర్ధలతో విడిపోయారు. అప్పుడప్పుడు ఇంటర్వ్యూలలో ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటూ ఉంటారు. విడాకుల అనంతరం కొన్నాళ్ళకు జోగినాయుడు మరో వివాహం చేసుకున్నారు. జోగినాయుడుది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నర్సీపట్నం.
జోగి నాయుడుకి స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కజిన్ అవుతాడట. చుట్టరికం ఉన్నప్పటికీ పూరి మాత్రం ఆయనకు అవకాశాలు ఇవ్వలేదట. గతంలో ఓ ఇంటర్వ్యూలో జోగి నాయుడు ఈ విషయం వెల్లడించారు. పూరి నాకు కజిన్ అవుతారు. బంధుత్వం ఉన్నా కూడా నాకు ఆయన సినిమాల్లో వేషాలు ఇవ్వలేదు. నేను ప్రత్యేకంగా వెళ్లి అన్నయ్య మీ సినిమాలో ఓ రోల్ ఇవ్వండని అడిగేవాడిని. అలాగే అనేవారు కానీ ఇచ్చేవారు కాదు. కారణం ఏమిటో నాకు తెలియదని జోగినాయుడు అన్నారు.
అలాగే మరో స్టార్ డైరెక్టర్ పరుశురామ్ కూడా జోగినాయుడుకి బంధువు అట. వీరిద్దరి అమ్మలు సొంత అక్కా చెల్లెళ్ళు అట. ఇంకొందరు మా ఫ్యామిలీ నుండి పరిశ్రమలో ఉన్నారని జోగినాయుడు వెల్లడించారు. నర్సీపట్నం నుండి మొదట గుణశేఖర్ చిత్ర పరిశ్రమకు రాగా… అనంతరం పూరి, తాను, పరుశురామ్ వచ్చామని జోగినాయుడు చెప్పుకొచ్చారు. జోగి నాయుడుకి పరిశ్రమలో ఇంత మంది బంధువులు ఉన్నారని ఈ ఇంటర్వ్యూతో బయటపడింది. అలాగే పరుశరామ్-పూరి కూడా బంధవులని వెల్లడైంది.
ఇక ఆఫర్స్ కోసం ఎప్పుడు పోరాటమే. ప్రయత్నం చేస్తూనే ఉండాలని ఆయన గతంలో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇక జోగినాయుడు వై ఎస్ జగన్ సానుభూతిపరుడిగా ఉన్నారు. ఆయన వైసీపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆయనకు కీలక పదవి అప్పగించింది. ఆంధ్రప్రదేశ్ క్రియేటివిటీ అండ్ కల్చరల్ కమిషన్ హెడ్ గా నియమించింది.