Actor Dhanush: సినిమా సినిమాకు తనలోని నటనకు మెరుగుపరుచుకుంటూ వెళుతున్నాడు తమిళ హీరో ధనుష్. వైవిధ్య భరితమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడీ యంగ్ హీరో. కేవలం ఇండియన్ సినిమాలకే పరిమితం కాకుండా హాలీవుడ్ లోనూ నటిస్తూ దూసుకుపోతున్నాడు. ఇక ధనుష్‌కు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న విషయం తెలిసిందే. ధనుష్ తెలుగు డబ్బింగ్ సినిమాలు టాలీవుడ్‌లోనూ మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. ఐతే ఇప్పుడు ధనుష్ ను మరో అవార్డ్ వరించింది.
గోవాలోని పనాజీలో జరుగుతున్న 52 వ ఇంటర్నేషనల్ ఫిలిం పెస్టివల్ లో ఈ అవార్డును ప్రకటించారు. బ్రిక్స్ ఫిలిం ఇంటర్నేషనల్ లో ఉత్తమ నటుడిగా ధనుష్ కు ఈ అవార్డు వరించింది. తమిళంలో వెట్రిమారన్ దర్శకత్వంతో రూపొందించిన ’అసురన్‘ సినిమాలో చేసిన ఫర్ఫామెన్స్ కు గానూ ధనుష్ కు ఎంపికయ్యాడు. ఇదే చిత్రానికి ధనుష్ జాతీయ అవార్డును కూడా గెలుచుకున్నాడు. బ్రెజిలియన్ చిత్రం ‘ఆన్ వీల్స్’లో తన నటనకు లారా బోల్డోరిని ఫెస్టివల్‌లో ఉత్తమ నటి (మహిళ) అవార్డును అందుకుంది. ఉత్తమ చిత్రం అవార్డును దక్షిణాఫ్రికా చిత్రం ‘బరకత్’, రష్యన్ చిత్రం ‘ది సన్ అబౌ మీ నెవర్ సెట్స్’ అనే రెండు చిత్రాలు పంచుకున్నాయి. ఇఫ్ఫీ తో పాటు బ్రిక్స్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించడం ఇదే తొలిసారి. బ్రిక్స్ ఫెస్టివల్‌లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా మరియు దక్షిణాఫ్రికా సినిమాలు పాల్గొన్నాయి.