Acharya Atreya Jayanthi 2022: ఈ రోజు ‘ఆచార్య ఆత్రేయ’ జయంతి. ఈ సందర్భంగా ఆయన జీవితంలో జరిగిన ఒక సరదా సంఘటన గురించి తెలుసుకుందాం. ఆత్రేయ గారు పాట రాసే విధానం చాలా వింతగా ఉంటుంది. అసిస్టెంట్ డైరెక్టరు ఆయన చేత పాట రాయించుకోడం కోసం,పెన్ పేపర్లూ పాడ్ తో ఉదయమే ఆత్రేయ దగ్గరకు వస్తాడు. ఆ పెన్ అలాగే ఉంటుంది. అతను తెచ్చిన ఫ్రూట్స్ మాత్రం అయిపోతూ ఉంటాయి. ఈ లోపు సిగరెట్ పెట్లు మొత్తం ఖాళీ అవుతాయి. అంతలో ‘ఆత్రేయ’ నిద్రలోకి జారుకుంటారు. అంతే! మళ్లీ సాయంత్రం అవుతుంది. ఆత్రేయ తీరిగ్గా లేస్తారు.
తిండీ తిప్పలు మానేసి పాట కోసం పడిగాపులు కాస్తున్న ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ను చూసి ‘ఏమయ్యా.. ఫ్రెష్ష్ గా స్నానం చేయాలయ్యా. నువ్వెళ్ళి ఏర్పాట్లు చూడు. కట్ చేస్తే… స్నానం ముగుస్తోంది. ధవళ వస్త్రాలు ధరించి ఆత్రేయ గారు మళ్ళీ సిగరెట్ వెలిగిస్తారు. ‘ఏరా ఎందాకా వచ్చాం ?, ‘ఎక్కడికి రాలేదు గురువు గారు’ అని వాడు దీనంగా మొహం పెడతాడు. ‘‘ఊరుకోరా.. మనం మొదలుపెడితే పాట పూర్తయినట్లే కదరా!’ అని పెన్ను అందుకుంటారు ఆత్రేయ.
Also Read: RockStar Actresses: వెండితెరను ఏలారు, రోడ్డున పడ్డారు
ఒకపక్క మళ్లీ సిగరెట్లు మీద సిగిరెట్లు కాలిపోతూ ఉంటాయి. ఓ గంట తర్వాత.. పైకి లేచి, ‘ఒరేయ్ ఈ రోజు ఆ మొదలు దొరకడం లేదులే గానీ, ఒక వేడి వేడి కాఫీ చెప్పు’ ఇలా సాగుతుంది ఆత్రేయ పాటలు రాసే ధోరణి. వారాలు గడుస్తున్నా, ఆ పాట మాత్రం పూర్తి కాదు. కొన్ని సినిమాలకు అయితే.. నెలలు కూడా గడుస్తుంటాయి. ఆ ‘పాట’ మాత్రం పుట్టదు. మరోపక్క హోటల్ అద్దె పెరిగి పోతూ ఉంటుంది. నిర్మాత లబోదిబోమంటాడు.
పద్మశ్రీ పి పుల్లయ్య గారి మురళీకృష్ణ సినిమాకి సరిగ్గా ఇలాగే జరిగింది. పుల్లయ్య గారికి – ఆత్రేయ గారికి మధ్య మంచి చనువుంది. ఇక వీరి మధ్య తిట్లూ- పొగడ్తలూ అతి సర్వసాధారణం. కానీ, అప్పటికే పాట రాయమని రూమ్ ను ఏర్పాటు చేసి రెండు నెలలు అవుతుంది. ‘ఈ బూత్రేయ గాడి అంతు తెలుస్తా ఈ రోజు’ అంటూ ఆ రోజు అమీతుమీ తేల్చుకోడానికి పుల్లయ్య గారు ఆవేశంగా వచ్చారు.
Also Read:Namitha : ఆ ఫొటోలు షేర్ చేసిన నమిత .. చూసి అంతా షాక్.. వైరల్
ఆత్రేయ రూమ్ డోర్ తోసుకుంటూ వస్తూనే ‘ఏరా.. పాట వచ్చిందా ?’. పుల్లయ్య గారు కోపం చూసి..‘రాక చస్తదా, నిదానమే ప్రధానం’ అని ఆత్రేయ సిగిరెట్ తీసి వెలిగిస్తూ అన్నాడు. పుల్లయ్య ఊగిపోతూ ‘మమ్మల్ని చంపకు. ఇక రూమ్ వెకేట్ చేసి బయలుదేరు’ అని ఆత్రేయ చేతిలో సిగిరెట్ తీసి బయటకు విసిరేశారు పుల్లయ్య. ‘నేను దీని కోసమే ఎదురుచూస్తున్నానులే’ అంటూ ఆత్రేయ పుల్లయ్య జేబులో నుంచి ఇంకో సిగిరెట్ తీశారు. ‘నీకు అసలు సిగ్గులేదురా ఛీ వెధవ జన్మ’ అని ఈసడించుకున్నారు.
ఆత్రేయ మాత్రం కూల్ గా కూర్చుని కాళ్ళు అటు ఇటు ఊపుతూ.. ‘సిగ్గు ఉంటే సినిమాల్లోకి ఎందుకు వస్తానయ్యా’ అని చిన్న చిరు నవ్వు నవ్వాడు. మొత్తానికి పుల్లయ్య గారి ముఖంలో కోపం, ఆత్రేయ ముఖంలో చిరునవ్వు చూసి పక్కన ఉన్న అసిస్టెంట్ కి తల తిరిగింది. ఇక్కడితో ఇక వీరిద్దరూ విడిపోతారు అని అనుకున్నారు. కానీ, ఆ అసిస్టెంట్ రాత్రి అఫీస్ కి వెళ్లి చూస్తే.. పుల్లయ్య – ఆత్రేయ మందు తాగుతూ ఇద్దరు నవ్వుకుంటూ కనిపించారు. ఇలా ఉంటుంది ఆత్రేయగారితో స్నేహం. ఆయన ప్రతిదీ సరదాగానే తీసుకునే వారు.