Aadikeshava: ఖలేజా సినిమా థియేటర్లలో ఫ్లాప్. బుల్లితెరకు వచ్చేసరికి సూపర్ హిట్. ఇప్పటికీ జెమినీ టీవీలో టెలికాస్ట్ అయితే తక్కువలో తక్కువ 6 వరకు రేటింగ్ వస్తుంది. ఇలానే చాలా సినిమాలు ఉన్నాయి. అంటే ప్రేక్షకుల అభిరుచిని అర్థం చేసుకోవడం ఎవరి వల్లా కాదు. అప్పట్లో అంటే ఇంత స్థాయిలో టెక్నాలజీ లేదు కాబట్టి దర్శకులు సమర్ధించుకోవచ్చు. కానీ ప్రస్తుత కాలంలోనూ గతం నాటి పరిస్థితులే పునరావృతమవుతున్నాయి.
ఇటీవల ఆదికేశవ అనే పేరుతో ఒక సినిమా విడుదలైంది. దీనిని సితార ఎంటర్టైన్మెంట్స్, త్రివిక్రమ్ శ్రీనివాస్ సతీమణి కలిసి నిర్మించారు. వైష్ణవ్ తేజ్, శ్రీ లీల జంటగా నటించారు. ఈ సినిమా విడుదలైన మరుసటి రోజే థియేటర్ల నుంచి తీసేశారు. కానీ అదే సినిమాను టీవీల్లో టెలికాస్ట్ చేస్తే బ్రహ్మాండమైన రేటింగ్స్ సంపాదించింది. రామ్, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన స్కంధ సినిమా పరిస్థితి కూడా ఇంతే. ఈ సినిమాలో రామ్, శ్రీలీల జంటగా నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని చవిచూసింది. అదే స్టార్ మా లో టెలికాస్ట్ అయితే బంపర్ రికార్డ్స్ అందుకుంది.
నితిన్ హీరోగా, శ్రీ లీల హీరోయిన్ గా రూపొందిన ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ అయింది. ఈ సినిమా ఈ ఆదివారం బుల్లి తెరపై ప్రసారం కానుంది. అయితే ఇది కూడా ఆదికేశవ, స్కంధ లాంటి ఫలితాన్నే ఇస్తుందని నితిన్ ఆశతో ఉన్నాడు. అయితే ఈ సినిమా బుల్లితెరపై హిట్ అవుతుందని పలువురు బెట్టింగ్ కాస్తుండడం విశేషం.
ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాపై నితిన్ చాలా ఆశలు పెట్టుకున్నాడు. వరుస పరాజయాలతో ఉన్న నితిన్ ఈ సినిమా తనను సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని భావించాడు. వక్కంతం వంశీ కూడా అత్యంత ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించడంతో ఈ సినిమా హిట్ అవుతుందని నితిన్ అభిమానులు భావించారు. పైగా ఈ సినిమాలో సీనియర్ నటుడు రాజశేఖర్ కీలక పాత్ర పోషించారు. శ్రీ లీల అందం, రావు రమేష్ లాంటి సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇంతమంది ఉన్నప్పటికీ సినిమా ఆకట్టుకోలేకపోయింది. ఆది కేశవ, స్కంధ లాగా బుల్లితెరపై హిట్ అయితే నితిన్ కు కాస్త ఉపశమనం.