
టాలీవుడ్ యంగ్ హీరో ఆది కొత్త కథలతో తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. తనకంటూ గుర్తింపు కోసం తపన పడుతున్నాడు. ఫలితం ఎలాగున్నా సరే సినిమాలు తీయడం మాత్రం ఆపడం లేదు. వినూత్న కథలతో మనముందుకు వస్తున్నాడు.
తాజాగా మాస్ కమర్షియల్ యాంగిల్ లో పోలీస్ కథాంశంతో ‘బ్లాక్’ సినిమా రూపొందించాడు. తొలిసారి పోలీస్ డ్రెస్ లో హీరో ఆది కనిపించాడు. టైటిల్, ఫస్ట్ లుక్ తో ఇప్పటికే ఆసక్తి పెంచిన మేకర్స్ తాజాగా చిత్రం టీజర్ ను విడుదల చేశారు. యువహీరో సుధీర్ బాబు ఈ బ్లాక్ టీజర్ ను విడుదల చేసి చిత్రం యూనిట్ కు అభినందనలు తెలిపారు.
ఒక అంతుచిక్కని పోలీస్ కేసును చేధించే క్రమంలో నేరస్థుడిని పట్టుకునే క్రమంలో ఆది ఏం చేశాడన్నది చూపించారు. బ్లాక్ ట్రైలర్ చూస్తుంటే పోలీస్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ కథాంశం అని అనిపిస్తోంది. ఇక ఇందులో ‘బిగ్ బాస్’ విజేత కౌశల్ కూడా పోలీస్ గా కీలక పాత్ర పోషించాడు.
తన శత్రువు ఎవరో కనిపెట్టడానికి హీరో ఆది పోలీస్ గా సాగించే దర్యాప్తును ఆసక్తికరంగా ట్రైలర్ లో చూపించారు.ఈ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంది.
‘బ్లాక్’ చిత్రంలో ఆది సరసన దర్శన బానిక్ హీరోయిన్ గా నటిస్తోంది. జీబీ కృష్ణ దర్శకత్వంలో మహంకాళి మూవీస్ బ్యానర్ పై దివాకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ త్వరలోనే విడుదల కానుంది.