Guntur Karam: త్రివిక్రమ్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరు. సినిమాకు పాతిక కోట్ల రూపాయలకు పైగా తీసుకుంటారు. ఆయన డైలాగ్స్ కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. కామెడీ కింగ్, ఎమోషనల్ ఎక్స్పర్ట్. ఇదంతా ఒక సైడ్. కాపీ క్యాట్ అనేది మరొక సైడ్. తెలుగు పాత సినిమాలు, ఫారిన్ సినిమాల నుండి కథలు, సన్నివేశాలు కొట్టేస్తాడు. అలాగే నవలల నుండి కూడాను. దొరికే వరకూ అందరూ దొరలే అన్నట్లు… అజ్ఞాతవాసి సినిమా వరకు త్రివిక్రమ్ కి క్లీన్ ఇమేజ్ ఉండేది.
2018లో పవన్ కళ్యాణ్ హీరోగా విడుదలైన అజ్ఞాతవాసి చిత్ర కథను ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ నుండి కొట్టేశాడు. మూవీ విడుదలయ్యాక జనాలకు ఈ విషయం అర్థమయ్యింది. అది లార్గో వించ్ డైరెక్టర్ వరకు చేరడంతో ఆయన నానా రభస చేశాడు. ఎలాగో ఆ వివాదం సెటిల్ చేసుకున్నాడు. ఇక నితిన్ హీరోగా తెరకెక్కించిన ‘అ ఆ’ చిత్ర కథ, యద్దనపూడి సులోచనారాణి రచించిన ,మీనా, నవల ఆధారంగా తీసుకున్నాడు.
అది కూడా వివాదాస్పదమైంది. ఇక త్రివిక్రమ్ కెరీర్లో అతిపెద్ద హిట్ గా ఉన్న అల వైకుంఠపురంలో మూవీ ‘ఇంటి గుట్టు’ చిత్ర కథ కాపీ. ఈ జనరేషన్ కి తగ్గట్లు ఇంటి గుట్టు తీసి విజయం సాధించాడు. ఆయన తాజా చిత్రం గుంటూరు కారం కథ కూడా కాపీనే అంటూ ఓ వాదన తెరపైకి వచ్చింది. మరోసారి ఆయన యద్దనపూడి సులోచనా రాణి నవలను నమ్ముకున్నారట. ఆమె రాసిన కీర్తి కిరీటాలు నవల నుండి కాపీ చేసిందే గుంటూరు కారం స్టోరీ అంటున్నారు.
దాని ప్రకారం హీరోయిన్ సెంట్రిక్ గా కథ ఉంటుంది. హీరోయిన్ కి జీవితంలో అన్నీ ఉంటాయి. ఒక్క లైఫ్ తప్ప. ఐశ్వర్యం, అందం ఉన్న హీరోయిన్ అతిపెద్ద జీవన్మరణ సమస్యతో బాధపడుతుందట. గుంటూరు కారం కథ ఇదే అంటూ ఓ న్యూస్ చక్కర్లు కొడుతుంది. మరి దీనిపై స్పష్టత రావాలంటే జనవరి 12 వరకు వేచి చూడాల్సిందే. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జంటగా శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు.