Prabhas Adipurush: ఆదిపురుష్ వివాదాలలో మగ్గిపోతుంది. ఆదిపురుష్ టీజర్ విడుదల నాటి నుండి పలు విమర్శలు తెరపైకి వచ్చాయి. దర్శకుడు ఓం రౌత్ ఈ చిత్రాన్ని భిన్నంగా రూపొందించారు. సాంప్రదాయ రామాయణాన్ని ఫాలో కాలేదు. రాముని గెటప్ నుండి అనేక విషయాల్లో వాల్మీకి రామాయణానికి పొంతనలేదు. రావణాసురుడు గెటప్ అయితే దారుణం అంటున్నారు. ఏ కోశాన కూడా సైఫ్ అలీ ఖాన్ లో రావణుడు కనిపించలేదు. టీజర్ తీవ్ర విమర్శలపాలు కావడంతో ఆరు నెలలు వాయిదా వేశారు. నిజానికి ఈ చిత్రం సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సింది.
ఇక జూన్ 16న ఆదిపురుష్ వరల్డ్ వైడ్ విడుదల చేశారు. చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. అదే సమయంలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. హిందూ సంస్థలు ఆదిపురుష్ మూవీని తప్పుబడుతున్నారు. తమ మనోభావాలు దెబ్బతిన్నాయంటూ పలు అంశాలు తెరపైకి తెచ్చారు. రాముడు, రావణాసురుడు, హనుమంతుడు పాత్రలను తప్పుగా తీర్చిద్దారని అంటున్నారు. అలాగే సీతను గ్లామరస్ గా చూపించారని అంటున్నారు.
రావణాసురుడు శివ భక్తుడు కాగా ఆయన పాత్ర కూడా రామాయణాన్ని కించపరిచే విధంగా ఉందని అంటున్నారు. మతపరమైన విశ్వాసాలకు సంబంధించిన పాత్రలను ఇష్టం వచ్చినట్లు చూపిస్తారా అని మండిపడుతున్నారు. ఢిల్లీకి చెందిన హిందూ సేన అనే సంస్థ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆదిపురుష్ మూవీ నుండి అభ్యంతరకర సన్నివేశాలు తొలగించాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ జరుగుతుంది. ఈ క్రమంలో ఆదిపురుష్ ప్రదర్శనకు అడ్డంకులు ఏర్పడే అవకాశం కలదు.
అదే జరిగితే బిగ్ షాక్ అవుతుంది. నేపాల్ లో కూడా ఆదిపురుష్ మూవీ మీద వ్యతిరేకత వ్యక్తమైంది. సీత భారతదేశంలో పుట్టారని ఉన్న ఓ డైలాగ్ ని వారు తప్పుబట్టారు. దీంతో ఫస్ట్ డే మార్నింగ్ షోలకు బ్రేక్ పడింది. ఆ డైలాగ్ తొలగించడంతో మధ్యాహ్నం నుండి షోలు మొదలయ్యాయి. ఇక ఫస్ట్ డే ఆదిపురుష్ తెలుగు రాష్ట్రాల్లో ముప్పు కోట్లకు పైగా షేర్ రాబట్టింది. అయితే ఆర్ ఆర్ ఆర్, బాహుబలి 2, సాహో చిత్రాల వసూళ్లతో పోల్చితే ఎక్కడో ఉంది.