RRRvsPrabhas: కరోనా తర్వాత ఈ ఏడాది సంక్రాంతికి బాక్సాఫీసు వద్ద అతిపెద్ద వార్ జరగనుంది. ఓ వైపు ఆర్ఆర్ఆర్ సినిమాతో రాజమౌళి రెడీగా ఉండగా.. మరోవైపు రాధేశ్యామ్‌తో ప్రభాస్ సై అంటున్నారు. ఈ క్రమంలోనే రెండు పాన్ ఇండియా చిత్రాలు ప్రస్తుతం వెండితెరపై పోటీ పడేందుకు షురూ చేస్తున్నాయి. హీందీలో ఆర్ఆర్ఆర్ విడుదల కోసం రాజమౌళి పక్కా ప్రణాళికతో దూసుకెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే అలియా భట్ నటించిన గంగూభాయ్ కూడా వాయిదా పడింది. అప్పటి వరకు గంగూభాయ్ సినిమాతో ఆర్ఆర్ఆర్కు బాలీవుడ్లో గట్టిపోటీ ఉందని అనుకోగా.. ఇప్పుడు ఆ రూట్ కాస్త క్లియర్ అయినట్లు తెలుస్తోంది. కానీ, ఇప్పుడు ప్రభాస్ రూపంలో ఆర్ఆర్ఆర్కు మరో కొత్త సమస్య ఎదురైనట్లు తెలుస్తోంది.
బాలీవుడ్లో ప్రభాస్‌కు ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సాహోను అక్కడ ప్రేక్షకులు విపరీతంగా అభిమానించారు. ఈ క్రమంలోనే బాలీవుడ్లో రాధేశ్యామ్‌ను రికార్డు స్థాయిలో స్క్రీన్స్ బుక్ చేయాలని చూస్తున్నట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. నార్త్‌లో ఇప్పటి వరకు రాధేశ్యామ్ కోసం 3700 స్క్రీన్లు బుక్ అయినట్లు తెలుస్తోంది. కరోనా నేపథ్యంలో ఇన్ని స్క్రీన్లు ఒక్క సినిమా కోసం కేటాయించడం విశేషంగా మారింది.
అయితే, ప్రపంచవ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ సినిమా 10వేల థియేటర్లలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. అయితే, ఈ రెండు సినిమాలకు మధ్య వారం రోజులు గ్యాప్ ఉన్న సంగతి తెలిసిందే. ఆర్ఆర్ఆర్కు ప్రేక్షకుల నుంచి మంచి టాక్ వస్తే సరి.. కాస్త అటూ, ఇటూ టాక్ వచ్చినా.. రాధేశ్యామ్ అమాంతం థియేటర్లను లాగేసుకోవడం ఖాయం అని అంటున్నారు విశ్లేషకులు. అలాగని రాజమౌళిని అసలు తక్కువ అంచనా వేసేందుకు ఆస్కారం లేదు. ఆయనకు ఉన్న మార్కెట్ స్ట్రాటజీ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వ్యూహాలేంటో బాహుబలితోనే అర్ధమైపోయాయి. ఇటువంటి పరిస్థితుల్లో నార్త్ స్క్రీన్స్‌లో ఈ రెండు సినిమాల మధ్య గట్టి పోటీ నెలకొంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.