7/g Brundavan Colony Sequel: 2004లో విడుదలైన 7/జి బృందావనకాలని ఒక సంచలనం. తెలుగు, తమిళ భాషల్లో విడుదలైన ఈ మూవీ యువతను ఒక ఊపు ఊపింది. ఒకటికి పదిసార్లు కుర్రాళ్ళు ఈ సినిమా చూశారు. కామెడీ, రొమాన్స్, ఎమోషన్ కలగలిపి ట్రాజిక్ లవ్ స్టోరీగా దర్శకుడు సెల్వరాఘవన్ తెరకెక్కించారు. ఏ ఎం రత్నం కుమారుడు రవి కృష్ణ హీరోగా పరిచయం అయ్యాడు. సోనియా అగర్వాల్ హీరోయిన్. ఒక మార్వాడి అమ్మాయికి మధ్యతరగతి తమిళ అబ్బాయి మధ్య జరిగే ప్రేమ కథ.

ప్రేమకథా చిత్రాలకు చాలా భిన్నంగా, సహజంగా మూవీ ఉంటుంది. యువన్ శంకర్ రాజా అద్భుతమైన సంగీతం ఇచ్చారు. సాధారణంగా ట్రాజిక్ లవ్ స్టోరీలు తెలుగులో ఆడవు. 7/జి బృందావనకాలని చిత్రంలో హీరోయిన్ చనిపోతుంది. అయినప్పటికీ టాలీవుడ్ ఆడియన్స్ నెత్తిన పెట్టుకున్నారు. అప్పట్లో డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ కి భారీగా లాభాలు పంచింది. రవి కృష్ణ, సోనియా అగర్వాల్ ఓవర్ నైట్ స్టార్స్ అయ్యారు. కమెడియన్ సుమన్ శెట్టికి మంచి బ్రేక్ ఇచ్చింది. జయం తర్వాత అంత పెద్ద హిట్ ఈ చిత్రం అతడికి.
అయితే ఈ చిత్ర హీరో, హీరోయిన్ సక్సెస్ కాకపోవడం నిరాశపరిచే అంశం. రవికృష్ణకు మరో హిట్ పడలేదు. సోనియా అగర్వాల్ సైతం స్టార్ కాలేకపోయింది. కాగా 18 ఏళ్ల తర్వాత ఈ చిత్రానికి సీక్వెల్ చేయనున్నట్లు నిర్మాత ఏ ఎం రత్నం తెలిపారు. విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా 7/జి బృందవనకాలని సీక్వెల్ పై ఆయన స్పష్టత ఇచ్చారు. ఏ ఎం రత్నం అంటే భారీ చిత్రాల నిర్మాతగానే తెలుసు. మీకు చిన్న చిత్రాలు చేసే ఆలోచన ఉందా? అని అడగ్గా… ఆయన ఈ విధంగా స్పందించారు.

త్వరలో 7/జి బృందావనకాలని సీక్వెల్ చేస్తాము. హరి హర వీరమల్లు పూర్తి కాగానే ఈ ప్రాజెక్ట్ ఉంటుంది. హీరోగా మా అబ్బాయి రవి కృష్ణనే నటిస్తాడు. సెల్వరాఘవన్ దర్శకుడిగా వ్యవహరిస్తారని ఏ ఎం రత్నం వెల్లడించారు. 7/జి బృందావనకాలని చిత్ర ప్రేమికులకు ఇది గుడ్ న్యూస్ అని చెప్పాలి. అయితే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి ఇంకొంత సమయం ఉందని ఆయన మాటల ద్వారా తెలుస్తుంది. ప్రస్తుతం హరి హర వీరమల్లు షూట్ పూర్తి చేసే పనిలో ఏ ఎం రత్నం ఉన్నారు. పవన్ కళ్యాణ్ బందిపోటుగా నటిస్తుండగా దర్శకుడు క్రిష్ పీరియాడిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు.