
Prabhas and Rajamouli: సినిమా గురించి ఎన్ని చెప్పినా.. ఫైనల్ గా అదొక బిజినెస్. కోట్లాది రూపాయల లావాదేవీలతో సాగే భారీ వ్యాపారం. ఏ మాత్రం తేడా వచ్చినా కోట్లలో నష్టం వాటిల్లుతుంది. కాబట్టి.. దాదాపుగా ఇక్కడ మొహమాటాలకు అవకాశం ఉండదు. ప్రతి ఒక్కరూ పక్కాగా ఉంటారు. రిలేషన్స్ కూడా వీటిని బ్రేక్ చేయలేవు. అయితే.. మరీ దగ్గరగా ఉన్నవారు మాత్రం అడ్జెస్ట్ మెంట్లు చేసుకుంటారు. అయితే.. అలాంటి అడ్జస్ట్ మెంట్ కోసం ప్రభాస్ ను రిక్వెస్ట్ చేశాడట రాజమౌళి. కానీ.. అవకాశం లేదని చెప్పాడట ప్రభాస్(Prabhas)! ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో ఇదే విషయమై జోరుగా చర్చ సాగుతోంది.
కరోనా మహమ్మారి సినీ రంగంపై ఎలాంటి ప్రభావం చూపిందో అందరికీ తెలిసిందే. సెకండ్ వేవ్ కారణంగా షూటింగులు, రిలీజులు అన్నీ నిలిచిపోయాయి. రెండో దశ తర్వాత థియేటర్లు తెరుచుకొని సరిగ్గా నెలరోజులు అవుతోంది. కానీ.. ఇప్పటి వరకూ పేరున్న సినిమాలేవీ విడుదల కాలేదు. అన్నీ చిన్న సినిమాలే వచ్చాయి. థర్డ్ వేవ్ ఉధృతి ఎలా ఉంటుందన్నదానిపై ఇంకా క్లారిటీ లేదు. అయితే.. అవకాశం ఉన్నప్పుడే సినిమాను వదిలేయాలని చూస్తున్నారు మేకర్స్. సినిమాల కోసం తెచ్చిన కోట్లాది రూపాయలకు వడ్డీలు పెరిగి పోతుండడంతో.. త్వరగా రిలీజ్ చేయాలని చూస్తున్నారు.
పెద్ద పెద్ద సినిమాలన్నీ ఇప్పుడు వరుసగా రిలీజ్ డేట్లు ప్రకటిస్తున్నాయి. అయితే.. సంక్రాంతి సీజన్ టాలీవుడ్ కు ఎలాంటి కలెక్షన్లు అందిస్తుందో తెలిసిందే. అందుకే.. బడా హీరోల చిత్రాలన్నీ పొంగల్ ను టార్గెట్ చేశాయి. ఇప్పటికే.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ – రానా దగ్గుబాటి హీరోలుగా వస్తున్న క్రేజీ మల్టీ స్టారర్ ‘భీమ్లా నాయక్’ సంక్రాంతికి రాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. జనవరి 12న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు ‘సర్కారువారి పాట’ కూడా పొంగల్ బరిలో నిలుస్తోంది. జనవరి 13న ఈ చిత్రం విడుదల కానుంది. రెబల్ స్టార్ ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సైతం సంక్రాంతికే బాక్సాఫీస్ బరిలో దిగుతోంది. జనవరి 14న ఈ చిత్రం థియేటర్ లోకి రాబోతోంది.
ఈ విధంగా పెద్ద చిత్రాలన్నీ సంక్రాంతి టార్గెట్ గా రిలీజ్ డేట్ ప్రకటించడంతో.. రాజమౌళి (Rajamouli) ఆర్ ఆర్ ఆర్ (RRR) చిత్రానికి సమస్య వచ్చి పడింది. నిజానికి ఈ చిత్రం దసరాకు రావాల్సింది. డేట్ కూడా ఎప్పుడో అనౌన్స్ చేశారు. కానీ.. కరోనా కారణంగా షూటింగు వాయిదాలు పడుతూ మరింత జాప్యమైంది. దీంతో.. దసరాకు ఈ చిత్రం రిలీజ్ కావడం దాదాపుగా అసాధ్యం. కాబట్టి.. జక్కన్న సంక్రాంతిని టార్గెట్ చేశాడని చెబుతున్నారు.
అయితే.. పండగ మూడు రోజులూ స్లాట్లు బుక్కయ్యాయి. దీంతో.. రాధేశ్యామ్ విడుదల వాయిదా వేయాలని జక్కన్న ప్రభాస్ ను కోరినట్టుగా చెబుతున్నారు. అయితే.. దీనికి కాస్త ఇబ్బంది పడిన ప్రభాస్.. అవకాశం లేదని చెప్పినట్టుగా తెలుస్తోంది. ఈ చిత్రాన్ని నిర్మించిన యూవీ క్రియేషన్స్.. ఒకరంగా ప్రభాస్ సొంత బ్యానర్ గానే చెబుతుంటారు. ఈ బ్యానర్ ఓనర్లు ప్రభాస్ కు బాగా కావాల్సిన వారు. కాబట్టి.. ప్రభాస్ చెబితే పని అవుతుందని జక్కన్న భావించాడని అంటున్నారు. కానీ.. కోట్లాది రూపాయల వ్యవహారం. కరోనా కారణంగా రాధే శ్యామ్ కూడా వాయిదా పడుతూ వచ్చింది. పైగా.. ప్రభాస్ మూవీ విడుదలై రెండేళ్లు దాటిపోయింది. ఇన్ని కారణాలతో రాజమౌళి విజ్ఞప్తిని ప్రభాస్ సున్నితంగానే తిరస్కరించాడని ప్రచారం సాగుతోంది. మరి, ఆర్ ఆర్ ఆర్ ను జక్కన్న ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి.