దేశంలో కరోనా ప్రభావంతో ఇప్పటికే షూటింగ్ వాయిదా పడ్డాయి. థియేటర్ల మూతపడటంతో చిత్రపరిశ్రమ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. రోజువారీ షూటింగ్లో పాల్గొనే సినీ కార్మికులకు ఉపాధి దొరకక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో సినీ కార్మికులనే ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో ‘సీసీసీ(కరోనా క్రైసిస్ చారిటీ) మనకోసం ఏర్పాటైంది. ఇందులో సీని పెద్దలు సభ్యులుగా ఉంటారు. ఈ ఛారిటీ ఆధ్వర్యంలో సినీ కార్మికుల సంక్షేమానికి పలు సంక్షేమ కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పలువురు సెలబ్రెటీలు విరాళాలు ప్రకటించి దాతృత్వాన్ని చాటుకుంటున్నారు.
సినీ కార్మికులను ఆదుకునేందుకు మాస్ మహారాజ్ రవితేజ రూ.20లక్షల విరాళం ప్రకటించారు. తన వంతుగా సాయంగా ఈ విరాళాన్ని కరోనా క్రైసిస్ చారిటీకి అందజేస్తున్నట్లు తన ట్విట్టర్లో రవితేజ ట్వీట్ చేశారు. ‘ఇవ్వడమనే విషయం వచ్చేదాకా తీసుకోవడమనే ప్రయోజనం ఎప్పటికీ పూర్తికాదనీ రవితేజ ట్వీట్ చేశారు. ఇది బాధను కొలవడం కాదని.. సినీ కార్మికుల అవసరాలను తీర్చడంలో తోడ్పాటు మాత్రమేనని ఆయన పేర్కొన్నారు.
కరోనా కట్టడికి ప్రతీఒక్కరు ఇళ్లలోనే ఉండాలని రవితేజ సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్న నిబంధనలు ప్రతీఒక్కరు తప్పనిసరిగా పాటించాలన్నారు. కరోనా కట్టడికి స్వీయనియంత్రణే ముఖ్యమన్నారు. వైద్యుల సలహాలు, సూచనలు పాటిస్తూ ఇళ్లలోనే సురక్షితంగా ఉండాలని రవితేజ కోరారు.