ఇప్పుడీ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడినా.. వారి విధానాలను విమర్శించినా వారిని ‘దేశ ద్రోహులుగా’ ముద్రవేస్తున్న పరిస్థితులు ఉన్నాయని పలువురు సోషల్ మీడియాలో పోస్టులతో హోరెత్తిస్తూనే ఉన్నారు. తమిళనాట బీజేపీని వ్యతిరేకించే ప్రజలు, నటులు, ప్రజాప్రతినిధులు ఎక్కువగా ఉన్నారు.
ఇదివరకే స్టార్ హీరో విజయ్ తన ‘మెర్సల్’ సినిమాలో బీజేపీ విధానాలను ఎండగట్టినందుకు ఆ తర్వాత ఆయన ఇల్లు, ఆస్తులపై ఐటీ దాడులు కలకలం రేపాయి. విజయ్ కు వ్యతిరేకంగా పెద్ద ఉద్యమమే బీజేపీ చేసింది. ఆ తర్వాత మరో హీరో అజిత్ కూడా తాను బీజేపీలో చేరనని చేసిన ప్రకటనపై తమిళ బీజేపీ భగ్గుమంది.
ఇప్పుడు మరో హీరో సూర్యపై తమిళ బీజేపీ పడింది. అప్పుడెప్పుడో కేంద్రం తీసుకొచ్చిన ‘నీట్’ ప్రవేశ పరీక్ష వల్ల తమిళనాడులోని పేద విద్యార్థులు నష్టపోతారని..వారికి డాక్టర్ సీట్లు రావని ఆయన గళమెత్తారు.
తాజాగా నీట్ విషయంలో కేంద్రాన్ని తప్పుపట్టిన హీరో సూర్యకు తమిళనాడు బీజేపీ వార్నింగ్ ఇచ్చింది. సూర్య తన సినిమాల మీదనే ఫోకస్ చేయాలని.. అనవసరంగా బీజేపీని విమర్శిస్తూ చూస్తూ ఊరుకోం అంటూ బీజేపీ నేతలు వార్నింగ్ ఇచ్చారు. దీంతో మరోసారి బీజేపీ తమిళనాట అగ్గిరాజేసింది. దీనిపై హీరో సూర్య ఎలా స్పందిస్తారన్నది వేచిచూడాలి.