Lok Sabha Elections 2024: మూడో దశలోనూ ముందుకు రాని ఓటర్లు.. 63.53 శాతమే పోలింగ్‌!

మంగళవారం నిర్వహించిన పోలింగ్‌లో అసోంలో అత్యధికంగా 79.79 శాతం నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 57.34 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కాస్త మెరుగ్గా 57.62 శాతం పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం.

Written By: Raj Shekar, Updated On : May 8, 2024 10:00 am

Lok Sabha Elections 2024

Follow us on

Lok Sabha Elections 2024: సార్వత్రిక ఎన్నికల మూడో దశ ప్రక్రియ ముగిసింది. మే 7న దేశవ్యాప్తంగా 93 లోక్‌సభ స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరిగింది. రాత్రి 10 గంటల వరకు 63.53 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఈసీ ప్రకటించింది. బెంగాల్‌లో స్వల్ప ఘర్షణలు, చెదురుముదురు ఘటనలు మినహా అన్ని నియోజకవర్గాల్లో పోలింగ్‌ ప్రశాతంగా జరిగిందని పేర్కొంది. తొలి దశలో 66.14 శాతం, రెండో దశలో 66.71 శాతం పోలింగ్‌ నమోదైంది. రెండు దశలతో పోలిస్తే మూడో విడతలో పోలింగ్‌ శాతం తగ్గింది.

అసోంలో అత్యధికంగా..
ఇక మంగళవారం నిర్వహించిన పోలింగ్‌లో అసోంలో అత్యధికంగా 79.79 శాతం నమోదైంది. ఉత్తరప్రదేశ్‌లో అత్యల్పంగా 57.34 శాతం మాత్రమే పోలింగ్‌ నమోదైంది. ప్రధాని మోదీ సొంత రాష్ట్రం గుజరాత్‌లో కాస్త మెరుగ్గా 57.62 శాతం పోలింగ్‌ నమోదు కావడం గమనార్హం. పశ్చిమబెంగాల్‌ పోలింగ్‌బూత్‌ వద్ద ఘర్షణలు, ఓటర్లను మభ్యపెట్టడం, బూత్‌ ఏజెంట్లపై దాడులు, టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్‌–సీపీఐ(ఎం)లు విడివిడిగా పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ముర్షీదాబాద్, జాంగీర్‌పూర్‌ స్థానాల నుంచి ఈసీకి ఉదయం 9 గంటల లోపే 180 ఫిర్యాదులు రావడం గమనార్హం. కొన్న చోట్ల టీఎంసీ, సీపీఎం కార్యకర్తలు ఘర్షణకు దిగారు. గుజరాత్‌లోని బనస్కాంతా నియోజకవర్గంలో బీజేపీ కార్యకర్తలు, సీఆర్పీఎఫ్‌ జవాన్లలా వచ్చి పోలింగ్‌ బూత్‌ వద్ద ఓటర్లను మభ్యపెట్టారని ఫిర్యాదు అందడంతో కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.

ఓటేసిన ప్రధాని మోదీ..
ఇక ప్రధాని నరేంద్రమోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్‌లో ఓటేశారు. గాంధీనగర్‌ నియోజకవర్గంలోని అహ్మదాబాద్‌లో ఉన్న నిషాన్‌ పబ్లిక్‌ స్కూల్‌లో ప్రధాని ఓటేశారు. గాంధీనగర్‌ బీజేపీ అభ్యర్థిథ, కేంద్ర మంత్రి అమిత్‌షా పోలింగ్‌బూత్‌లో ఓటే ఉండడంతో మోదీ అన్నయ్య సోమభాయ్‌ మోదీ సైతం అక్కడికి వచ్చారు. దీంతో ఆయన ఆశీర్వాదం తీసుకుని మోదీ ఓటేశారు. ఉదయాన్నే ఓటేసేందుకు వచ్చిన ప్రధానిని కలిసేందుకు ఓటర్లు ఎగబడ్డారు. అమిత్‌షా సైతం అహ్మదాబాద్‌లో ఓటేశారు.

282 స్థానాలకు పోలింగ్‌ పూర్తి..
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు మూడు దశల్లో జరిగిన పోలింగ్‌తో 282 స్థానాలకు ఎన్నికలు ముగిశాయి. మొత్త 543 స్థానాలు ఉన్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో 14, మహారాష్ట్రలో 11, ఉత్తరప్రదేశ్‌లో 10, ఛత్తీస్‌గఢ్‌లో 7, బిహార్‌లో 5, అసోం, పశ్చిమబెంగాల్‌లో 4, గోవాలో 2, దాద్రానగర్‌ హవేలీ, డయ్యూ డామన్‌లో 2 చొప్పున స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరిగింది. గుజరాత్, కర్ణాటక, మధ్యప్రదేశ్‌లో మెజారిటీ స్థానాలకు మంగళవారం పోలింగ్‌ జరిగింది.

రాష్ట్రాల వారీగా పోలింగ్‌ ఇలా…
గుజరాత్‌ 57.62
కర్ణాటక 70.03
మహారాష్ట్ర 61.44
ఉత్తరప్రదేశ్‌ 75.43
మధ్యప్రదేశ్‌ 66.05
ఛత్తీస్‌గఢ్‌ 70.05
బిహార్‌ 58.16
అసోం 79.79
బెంగాల్‌ 73.96
గోవా 75.13
దాద్రానర్, హవేలీ, డాయ్యూడామన్‌ 68.89