School Admission: నూతన విద్యా విధానం ద్వారా విద్యారంగంలో సంస్కరణలు చేస్తున్న కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఒకటో తరగతి అడ్మిషన్ వయసును మార్చింది. 6 ఏళ్లు నిండిన పిల్లలకే ఒకటో తరగతిలో అడ్మిషన్ ఇవ్వాలని సూచించింది. ఈమేరకు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది.
ఇష్టానుసారంగా అడ్మిషన్లకు చెక్..
పాఠశాలల్లో ప్రస్తుతం రెండేళ్లు నిండగానే అడ్మిషన్లు తీసుకుంటున్నారు. ప్లే స్కూల్, నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ పేరుతో మూడేళ్లు 1వ తరగతిలోపే గడుపుతూ లక్షల రూపాయలు వసూలు చేస్తున్నాయి విద్యా సంస్థల యాజమాన్యాలు. కేంద్రం తెచ్చిన నూతన విద్యావిధానం ప్రకారం ఒకటో తరగతిలో ప్రవేశం పొందాలంటే ఇకపై ఆరేళ్లు నిండి ఉండాలి. గతంలోనే దీనిపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖలు రాసింది. తాజాగా మరోమారు లేఖలు పంపింది.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి..
వచ్చే విద్యా సంవత్సరం(2024–25) నుంచి కొత్త విధానం అమలు చేయాలని కేంద్రం భావిస్తోంది. ఈమేరకు లేఖల్లో స్పష్టం చేసింది. దీనిపై అభిప్రాయం తెలపాలని కోరింది. పిల్లల్లో పునాది దశ విద్యాభ్యాసాన్ని బలోపేతం చేయడానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని నూతన జాతీయ విద్యావిధానం–2020 సిఫార్సు చేసింది. విద్యాహక్కు చట్టం పరిధిలోని నిబంధనలకు అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేసింది. కేంద్రం తీసుకున్న నిర్ణయాలతో ఆరేళ్లు నిండిన తర్వాతనే ఒకటో తరగతిలో ప్రవేశాలు లభించనున్నాయి.
నూతన విద్యావిధానం ఇలా..
జాతీయ నూతన విద్యావిధానం ప్రకారం పునాది దశలోనే పిల్లలందరికీ(3 నుంచి 8 ఏళ్లు) ఐదు ఏళ్లపాటు అభ్యాస అవకాశాలను కలిగి ఉంటుంది. ఇందులో మూడు సంవత్సరాలు ప్రీస్కూల్(నర్సరీ, ఎల్‌కేజీ, యూకేజీ) తర్వాత 1, 2 తరగతులు ఉంటాయి. పిల్లల శారీరక, మానసిక ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.
మూడేళ్లకే బడికి..
పిల్లలను మూడేళ్ల వయసులోనే పాఠశాలకు పంపించాల్సి ఉంటుంది. దీంతో ప్రీ స్కూల్ నుంచి రెండో తరగతి వరకు చిన్నారుల్లో లెర్నింగ్ ప్రక్రియ మెరుగు పడుతుంది. అలాగే.. అంగన్వాడీలు, ప్రభుత్వ/ప్రభుత్వ ఎయిడెడ్, ప్రయివేటు, ఎన్జీవో సంస్థల ఆధ్వర్యంలో నడిచే ప్రీస్కూళ్లలో అభ్యసిస్తున్న చిన్నారులందరికీ ఒకటో తరగతిలో ప్రవేశానికి ముందే నాణ్యమైన విద్య మూడేళ్లు అందుతుంది. నూతన విద్యా విధానానికి అనుగుణంగానే రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు నిబంధనలు మార్చాల్సి ఉంటుంది.