తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరేలా శుభవార్త వెలువడింది. రాష్ట్రపతి జోనల్ వ్యవస్థకు ఆమోదం తెలపడటంతో ఉద్యోగ నియామకాలకు సంబంధించిన అడ్డంకులు తొలగిపోయాయి. రాష్ట్రపతి జోనల్ వ్యవస్థకు ఆమోద్ర ముద్ర వేయడంతో ఇకపై స్థానికులచే 95 శాతం భర్తీ చేసే విధానం రాష్ట్రంలో అమలులోకి రానుందని తెలుస్తోంది. రాష్ట్రంలో ఇప్పటివరకు జోనల్ అంశంతో ముడిపడి ఉద్యోగ నియామకాలకు సంబంధించిన ప్రకటన వెలువడలేదు.
రాష్ట్రంలో ఇప్పటివరకు కేవలం గ్రూప్- 4, గ్రూప్- 2 నోటిఫికేషన్లు మాత్రమే విడుదలయ్యాయనే సంగతి తెలిసిందే. నూతన విధానం వల్ల ఏయే పోస్టులు ఏయే జోన్లలోకి వస్తాయనే వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది. మల్టీ జోన్ పరిధిలోకి వస్తాయన్న వివరాలు, సర్వీసు నిబంధనల మేరకు రోస్టర్, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌లను ఆయా ప్రభుత్వ శాఖలు ఖరారు చేసిన తరువాత వరుసగా నోటిఫికేషన్లు వెలువడుతాయని సమాచారం.
జోన్ల సమస్యల వల్లే రాష్ట్రంలో ఇప్పటివరకు గ్రూప్-1 పోస్టుల భర్తీ జరగలేదు. 2014లో తెలంగాణ ఏర్పాటైన తరువాత జోన్ల సమస్య వల్ల గ్రూప్-2, 3 వంటి పోస్టుల భర్తీకి ఇబ్బందులు ఏర్పడ్డాయి. 2018 సంవత్సరంలో కొత్త జోన్ల విధానానికి రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కానీ కేసీఆర్ సర్కార్ కొత్తగా ములుగు, నారాయణ్‌పేట్ జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ జిల్లాల ఏర్పాటు వల్ల కొత్త జోన్ల విధానంలో ఉద్యోగాల భర్తీ చేపట్టడం కష్టమైంది.
ఇదే సమయంలో చార్మినార్ జోన్ పరిధిలోకి వికారాబాద్ జిల్లాను తీసుకురావాలని ప్రజలు విజ్ఞప్తి చేయడంతో కొత్త అంశాలన్నీ చేరుస్తూ ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదానికి పంపగా రాష్ట్రపతి ఆమోదం ఎట్టకేలకు లభించింది.