NEET Paper Leak : ఎక్కడిదీ సాల్వర్ గ్యాంగ్? నీట్ పేపర్ లీ కేజీలో ఎందుకు ఈ పేరు వినిపిస్తోంది?

NEET Paper Leak జూన్ 19, 20 తేదీలలో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించేందుకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ పిలుపునివ్వడం విశేషం.

Written By: NARESH, Updated On : June 16, 2024 10:03 pm

Solver gang name heard in NEET paper leakage

Follow us on

NEET Paper Leak : నీట్ ప్రశ్నపత్రం లీకేజీ కావడం.. దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. బీహార్ రాజధాని పాట్నా కేంద్రంగా ఈ పేపర్ లీకేజీ జరిగిందని వార్తలు వినిపిస్తున్నాయి. కొన్ని జాతీయ మీడియా సంస్థలు పరిశోధనాత్మక కథనాలను ప్రసారం చేస్తున్నాయి. అయితే ఈ వ్యవహారంలో సాల్వర్ గ్యాంగ్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. ఇంతకీ ఈ గ్యాంగ్ ఎక్కడిది? ఎందుకు ఇలా పేపర్ లీకేజీకి పాల్పడుతోంది? దీని వెనుక ఎవరు ఉన్నారు?

తెర వెనుక పని చేస్తుంటాయ్

సాల్వర్ గ్యాంగ్ ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్ అంటే రాష్ట్రాలలో పోటీ పరీక్షల సమయంలో పేపర్ లీ కేజీలకు యత్నిస్తుంటాయి. అభ్యర్థుల వద్ద డబ్బులు వసూలు చేసి.. వారికి ఈ పేపర్లను అమ్ముతుంటాయి. రహస్య ప్రాంతాలలో ప్రశ్నలకు సమాధానాలు ఎప్పటికప్పుడు వల్లె వేయిస్తూ ఉంటాయి. తీరా పరీక్ష సమయానికి పరీక్ష కేంద్రానికి తీసుకెళ్తుంటాయి. ఈ వ్యవహారాన్ని రెండవ కంటికి తెలియకుండా జరుపుతుంటాయి. ఈ గ్యాంగ్ కు జాతీయస్థాయిలో నెట్వర్క్ ఉంది.. ఉదాహరణకు నీట్ పరీక్షనే తీసుకుంటే.. పాట్నా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల వద్ద సూపరింటెండెంట్ లకు భారీగా డబ్బు ఆశ చూపించారు. వారిని తమ వలలో వేసుకున్నారు. సూపరింటెండెంట్ లకు ప్రశ్న పత్రాలు చేతికి రాగానే వారు సాల్వర్ గ్యాంగ్ కు చేరవేశారు. ఆ ప్రశ్న పత్రాలను వివిధ సబ్జెక్టుల్లో నిపుణులైన వారితో పరిష్కరించి.. ఆ సమాధానాలను విద్యార్థులతో బట్టి కొట్టించారు. ఆ తర్వాత ఆ విద్యార్థులను నేరుగా పరీక్షా కేంద్రాల వద్దకు తీసుకెళ్లి, పరీక్ష రాయించారు. హర్యానా లో ఒకే పరీక్ష కేంద్రంలో ఏడుగురు విద్యార్థులకు జాతీయస్థాయి ర్యాంకులు రావడం విశేషం. ఇందులో కొంతమంది విద్యార్థులకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ 717, 719 మార్కులు వేయడం అనుమానాలకు తావిస్తున్నది.

ఈ సాల్వర్ గ్యాంగ్ ఇప్పుడు మాత్రమే కాదు, గతంలో బిహార్ టీచర్ రిక్రూట్ మెంట్ లోనూ ఇదే తీరుగా పని చేసింది. ఈ గ్యాంగ్ లో నితీష్ కుమార్ అనే వ్యక్తిని బీహార్ పోలీసులు పట్టుకున్నారు. అయితే అతడిని విచారిస్తే.. నీట్ వ్యవహారం బయటపడింది. అయితే ఇందులో ఇంకా ఎన్ని పెద్ద తలకాయలు ఉన్నాయో అంతు పట్టడం లేదని బీహార్ పోలీసులు అంటున్నారు. మరోవైపు నీట్ పరీక్ష రద్దుచేసి, కొత్తగా నిర్వహించాలని, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కి ఆదేశాలు ఇవ్వాలని.. 20 మంది విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.. అంతేకాదు ఈ పరీక్షలో 620 కి మించి మార్కులు సాధించిన విద్యార్థుల నేపథ్యాన్ని పరిశీలించేందుకు ఒక స్వతంత్ర సంస్థతో పోస్ట్ ఎగ్జామ్ అనాలసిస్ నిర్వహించాలని వారు సుప్రీంకోర్టుకు విన్నవించారు..నీట్ పరీక్షలో అక్రమాల నేపథ్యంలో జూన్ 19, 20 తేదీలలో దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహించేందుకు ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ పిలుపునివ్వడం విశేషం.