SBI Asha Scholarship 2025: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విద్యార్థుల చదువుకు ఆర్థిక సహాయం చేసేందుకు సంకల్పించింది. 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఉన్నత చదువులు చదివే వారి వరకు ప్రత్యేకంగా స్కాలర్షిప్ ఇవ్వాలని నిర్ణయించింది. 2022లో ప్రారంభించిన ఆశ స్కాలర్షిప్ ద్వారా విశేష ప్రతిభ కలిగిన విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ. 20 లక్షల వరకు ఆర్థిక సహాయం చేస్తూ వస్తోంది. అయితే ఇందుకోసం కొన్ని అర్హతలను ఏర్పాటు చేసింది. ఈ అర్హత సాధిస్తే ఉన్నత చదువులు చదివే వరకు ప్రతి ఏడాది స్కాలర్షిప్ ద్వారా ఆదాయం పొందవచ్చు. మరి ఈ స్కాలర్షిప్ పొందడానికి ఎవరు అర్హులు?
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది కూడా ఆశ స్కాలర్షిప్ పై ప్రకటన చేసింది. ఈ స్కాలర్షిప్ కోసం రూ. 90 కోట్లు కేటాయించినట్లు తెలిపింది. ఈ ఏడాది ఎస్బిఐ ప్లాటినం జూబ్లీ వేడుకలు జరుపుకోనుంది. ఈ నేపథ్యంలో ఈసారి 90 కోట్లు కేటాయించినట్లు పేర్కొంది. విద్యార్థుల చదువుకు బాసటగా నిలిచేందుకు ఈ స్కాలర్షిప్ ను అందిస్తున్నట్లు బ్యాంకు ప్రతినిధులు తెలుపుతున్నారు. 9వ తరగతి చదివిన ప్రతి విద్యార్థి ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకోవడానికి అర్హులే. అయితే 9వ తరగతి నుంచి పదవ తరగతి వరకు వారి కుటుంబ సభ్యుల ఆదాయం ఏడాదికి రూ.3 లక్షలు ఉండాలి. పదవ తరగతి నుంచి పై చదువులు చదివే వారికి మార్కుల్లో 75%తో ఉత్తీర్ణత సాధించాలి. ఇలా కొన్ని అర్హతలను బట్టి విద్యార్థులను ఎంపిక చేస్తారు.
ఎంపికైన విద్యార్థులకు వారి కోర్సు, స్థాయి ప్రకారం రూ. 15వేల నుంచి రూ. 20 లక్షల వరకు చెల్లిస్తారు. ఈ ఏడాది సెప్టెంబర్ 19న దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. నవంబర్ 15 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. sbiasha scholarship.co.in అనే వెబ్సైట్లోకి వెళ్లి అవసరమైన వివరాలు అందించి దరఖాస్తు చేసుకోవాలి. మొబైల్ నెంబర్ తో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ స్కాలర్షిప్ కోసం దరఖాస్తు చేసుకునేవారు భారతీయ పౌరుడై ఉండాలి. గత సంవత్సరం మార్కులు 75% లేదా 7 జీపీఏ కలిగి ఉండాలి. ఎస్సీ ఎస్టీ వారికి మార్కులలో 10% మినహాయింపు ఉంటుంది. దేశవ్యాప్తంగా మొత్తం 23, 230 మందిని ఈ స్కాలర్షిప్ కోసం ఎంపిక చేసి వారికి ఆర్థిక సహాయం చేస్తుంటారు. పాఠశాల స్థాయి వారికి.15,000.. కళాశాల స్థాయి వారికి. రూ.75,000.. పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివే వారికి రూ. రెండు లక్షల 50 వేల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. ప్రతి సంవత్సరం విద్యార్థులు రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది.