Work From Home: చైనాలో కరోనా మహమ్మారి ప్రళయం సృష్టిస్తోంది. చైనాలో మరణ మృదంగం మోగుతున్న క్రమంలో ప్రపంచ దేశాలన్నీ అప్రమత్తమవుతున్నాయి. మరోపక్క భారతదేశంలో కూడా కరోనా ఆందోళన కనిపిస్తుంది. కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ బీఎఫ్ 7 ఆందోళనల నేపథ్యంలో ప్రస్తుతం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. మళ్లీ లాక్‌డౌన్ పరిస్థితి రాకపోవచ్చని శాస్త్రవేత్తలు, వైద్య నిపుణులు చెబుతున్నా.. భరోసా మాత్రం ఇవ్వలేకపోతున్నారు. చైనా పాటిస్తున్న గోప్యత దృష్ట్యా, సబ్ వేరియంట్లు ఎన్ని పుట్టుకొస్తున్నాయో.. మన వ్యాక్సిన్ వాటిని సమర్థవంతంగా ఎందుక్కొంటుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ప్రపంచ దేశాల అప్రమత్తం..
చైనాలో కొనసాగుతున్న కరోనా కల్లోలం ఏమాత్రం కట్టడి చేయలేని స్థితికి చేరుకుంది. 20 రోజుల వ్యవధిలో 25 కోట్ల పాజిటివ్ కేసులు నమోదయ్యాయి అంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో చైనా చుట్టుపక్కల ఉన్న దేశాలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో అప్రమత్తం అవుతున్నాయి. ఆఫ్ఘనిస్తాన్, భూటాన్, పాకిస్తాన్, కజకిస్తాన్, రష్యా , తజకిస్తాన్, వియత్నాంతో పాటుగా భారతదేశం, అమెరికాలు సైతం అప్రమత్తం అవుతున్నాయి. మళ్లీ ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని, మాస్కులు ధరించాలని సూచనలు చేస్తున్నాయి. అదే విధంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ పైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తున్నాయి.
మళ్లీ వర్క్ ఫ్రమ్ హోం..
కొన్ని నెలలుగా వర్క్ ఫ్రమ్ ఆఫీస్.. అలవాటు చేస్తున్న కంపెనీలకు కరోనా షాక్ ఇస్తోంది. ప్రస్తుత కరోనా పరిస్థితులు మరోమారు వర్క్ ఫ్రం హోంపై అన్ని కంపెనీలు ఆలోచించేలా చేస్తున్నాయి. ఇక నిన్నటి వరకు కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టడంతో అందరూ ఆఫీసులకు రావాలని, ఆఫీసుల నుండే పనులు చేయాలని ఆయా సంస్థలు తమ ఉద్యోగులను ఆఫీసులకు రప్పిస్తున్న పరిస్థితి ఉంది. గత రెండేళ్ల కాలంగా వర్క్ ఫ్రం హోమ్ పని చేసిన ఉద్యోగులు ఇప్పుడు ఆఫీసులకు వెళ్లడాన్ని వ్యతిరేకిస్తున్నారు. బలవంతంగా ఉద్యోగులను ఆఫీసులకు రప్పించి, మళ్లీ ఆఫీస్ ల నుండి పనిని ట్రాక్ లో పెట్టే పనిలో పడిన సంస్థలకు మరోమారు కల్లోల కరోనా షాక్ ఇచ్చింది.
ఇళ్ల నుంచే పని చేసుకోండి
ఊహించని విధంగా మళ్లీ కరోనా ఆందోళన అనేక కంపెనీలపై, వ్యాపార సంస్థలపై బాంబు పేల్చింది. వర్క్ ఫ్రం హోమ్ నుంచిì∙ఉద్యోగులను ఆఫీసులకు రప్పించే క్రమంలో హైబ్రిడ్ మోడల్ అమలుచేస్తున్న సంస్థలు, తాజా కరోనా ఆందోళనల నేపథ్యంలో పూర్తిస్థాయిలో ఆఫీసుకు వచ్చి పని చేయడంపై ఆలోచనలో పడ్డాయి. మళ్లీ కరోనా కారణంగా పరిస్థితులు తారుమారు అయినట్టు భావిస్తున్న సంస్థలు ఉద్యోగులు ఆఫీసుకు రావాల్సిన అవసరం లేదని, వర్క్ ఫ్రం హోం పని చేసుకోమని చెబుతున్నాయి.
వర్క్ ఫ్రం హోంకు పలు సంస్థల నిర్ణయం
ఇక కరోనా ఆందోళనల నేపథ్యంలో భారతదేశంలో ఉన్న ఫ్లిప్కార్ట్, మారికో, ఎల్ అండ్ టీ మైండ్ ట్రీ, టాటా స్టీల్, బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్‌తో పాటు పలు దిగ్గజ కంపెనీలన్నీ 2023లో సైతం ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్, లేదా హైబ్రిడ్ మోడల్‌ను కొనసాగించడానికి సిద్ధమైనట్లుగా తెలుస్తోంది. ఇక తాము కల్పించే ఈ సౌకర్యాలతో ఉద్యోగులు ఆఫీస్ వర్క్‌తో పాటుగా పర్సనల్ లైఫ్ ని కూడా బ్యాలెనన్స్ చేసుకోవచ్చనే అభిప్రాయం వ్యక్తమౌతుంది.
ఏది ఏమైనా మళ్లీ కరోనా ఆందోళనల నేపథ్యంలో ఉద్యోగులు కూడా వర్క్ ఫ్రం హోం చేయడానికే ఆసక్తి చూపుతున్నారు. మరి 2023 దేశంలో కరోనా ప్రభావం ఎలా ఉంటుందో తెలియాల్సి ఉంది.