NEET UG Results 2023: నీట్ లో 99.99 పర్సంటైల్.. ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు

నీట్ ఫలితాల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన జే. ప్రభంజన్ 99.99 పర్సంటైల్ సాధించాడు. సాంకేతికంగా (సబ్జెక్టు వారీ మార్కులతో చూస్తే) ప్రభంజన్ మొదటి ర్యాంకు, తెలుగు కుర్రాడు వరుణ్ చక్రవర్తి రెండో ర్యాంక్ సాధించినట్టు ఎన్టిఏ వెల్లడించింది.

Written By: K.R, Updated On : June 14, 2023 12:59 pm

NEET UG Results 2023

Follow us on

NEET UG Results 2023: నీట్.. అది ఒక కొరకరాని కొయ్య. లాంగ్ టర్మ్ కోచింగ్ తీసుకుంటే తప్ప ర్యాంకు వచ్చే పరిస్థితి లేదు. జువాలజీ, బాటని, ఫిజిక్స్ , కెమిస్ట్రీ లో అడిగే ప్రశ్నలు బుర్రను బద్దలు చేస్తాయి. ఇంటర్లో స్టేట్ ర్యాంకులు సాధించిన వారు సైతం నీట్ విషయానికి వచ్చేసరికి తెల్ల మొహం వేస్తారు. కానీ మంగళవారం ప్రకటించిన నీట్ ఫలితాల్లో విద్యార్థులు సత్తా చాటారు. నీట్ కు వ్యతిరేకంగా ఉద్యమం జరుగుతున్న తమిళనాడు రాష్ట్రంలో ఏకంగా నలుగురు విద్యార్థులు టాప్ టెన్ ర్యాంకులు సాధించడం విశేషం. తమిళనాడు తర్వాత మహారాష్ట్ర, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు నీట్ ర్యాంకులను కొల్లగొట్టారు. వీరిలో ఇద్దరు విద్యార్థులు ఏకంగా 99.99% పర్సంటైల్ సాధించడం విశేషం. అంతేకాదు నీట్ ఫలితాల్లో కూడా కొత్త రికార్డు సృష్టించడం గమనార్హం. ఈ విద్యార్థులు సాధించిన పర్సంటైల్ పట్ల సోషల్ మీడియాలో మీమ్స్ హోరెత్తిపోతున్నాయి. ” ఎవర్రా మీరు ఇంత టాలెంటెడ్ గా ఉన్నారు” అనే సినిమా డైలాగ్ ను వీరు సాధించిన ర్యాంకులకు ఆపాదిస్తున్నారు.

ఇద్దరు విద్యార్థులకు 99.99 పర్సంటైల్

నీట్ ఫలితాల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన జే. ప్రభంజన్ 99.99 పర్సంటైల్ సాధించాడు. సాంకేతికంగా (సబ్జెక్టు వారీ మార్కులతో చూస్తే) ప్రభంజన్ మొదటి ర్యాంకు, తెలుగు కుర్రాడు వరుణ్ చక్రవర్తి రెండో ర్యాంక్ సాధించినట్టు ఎన్టిఏ వెల్లడించింది. ఈడబ్ల్యూఎస్ విభాగంలో ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ప్రవర్ధన్ రెడ్డి మొదటి స్థానంలో నిలిచాడు. ఓవరాల్ ర్యాంకింగ్ లో ఇతడు 25వ స్థానంలో ఉన్నాడు. ఇక తెలంగాణకు చెందిన కంచానిగేయంత్ రఘురాంరెడ్డి 99.999068 పర్సం టైల్ తో 15వ ర్యాంకు సాధించాడు. ఇక అమ్మాయిల విభాగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన కాణి యశశ్రీ ఆరవ ర్యాంకు (ఓవర్ ఆల్ గా 49) సాధించింది.

గత నెల 7న

గత నెల 7వ తేదీన దేశవ్యాప్తంగా 499 నగరాల్లోని 4,097 కేంద్రాలు, విదేశాల్లోని 14 నగరాల్లో నీట్ యూజీ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 20.38 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు. తాజాగా వెల్లడించిన ఫలితాల్లో 11.45 లక్షల మంది వైద్య విద్యలైన ఎంబిబిఎస్, బిడిఎస్ లో చేరేందుకు అర్హత సాధించారు.. వీరిలో 521 మంది విదేశీయులు ఉన్నారు. 533 మంది ఎన్నారైలు ఉన్నారు. అత్యధికంగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 1.39 లక్షల మంది ఈ పరీక్షలో అర్హత సాధించారు. ఆ తర్వాత 1.31 లక్షలతో మహారాష్ట్ర, లక్షతో రాజస్థాన్ రాష్ట్రాలు నిలిచాయి. తమిళనాడు విద్యార్థులు టాప్ ర్యాంకులు సాధించడం విశేషం. పైగా నీట్ పరీక్షకు వ్యతిరేకంగా ఈ రాష్ట్రంలో ఆందోళనలు జరుగుతున్నాయి. అయినప్పటికీ మొదటి టాప్ 10 ర్యాంకుల్లో తమిళనాడు రాష్ట్రానికి చెందిన విద్యార్థులు ఉండటం విశేషం. ఇక టాప్ 50 లో తెలంగాణ విద్యార్థులు రెండు ర్యాంకులే కైవసం చేసుకోవడం విశేషం. ర్యాంకుల చుట్టాలు తొలి రెండు స్థానాల్లోని వారికి 720కి 720 మార్కులు రాగా.. మూడవ ర్యాంకులో ఉన్న కౌస్తవ్ బౌరి కి 716 మార్కులు వచ్చాయి. ఆ తర్వాత వరుసగా 16 మంది 715 మార్కులు సాధించడం విశేషం.

శభాష్ వరుణ్ చక్రవర్తి

శ్రీకాకుళం జిల్లా తోటాడ గ్రామానికి చెందిన బోర వరుణ్ చక్రవర్తి 720కి 720 మార్కులు సాధించాడు. చిన్నతనం నుంచే డాక్టర్ కావాలని ఆశతో ఇతడు చదువుతున్నాడు. ఢిల్లీ ఎయిమ్స్ లో పీజీ చేయడమే తన లక్ష్యమని చెబుతున్నాడు. వరుణ్ చక్రవర్తి తండ్రి రాజేంద్రనాయుడు నరసన్నపేట ప్రభుత్వ పాఠశాలలో ఫిజిక్స్ ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. తల్లి రాజ్యలక్ష్మి తోటాడలోనే ఉపాధ్యాయురాలుగా పనిచేస్తోంది. వరుణ్ చక్రవర్తి ఇటీవల తెలంగాణ ఎంసెట్లో కూడా సత్తా చాటాడు. అగ్రికల్చర్ విభాగంలో రాష్ట్రస్థాయిలో ఐదవ ర్యాంకు సాధించాడు. ఇక గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది నీట్ యూజీ లో క్వాలిఫై మార్కులు పెరిగాయి. గత ఏడాది 117 మార్కులు క్వాలిఫైయింగ్ కట్ ఆఫ్ గా ఉండగా.. ఈసారి 137 కు పెరిగాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ విషయంలో గత ఏడాది కట్ ఆఫ్ 93 గా ఉండగా.. ఈసారి అది 107 కు చేరుకుంది