NEET Results : 2024–25 నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) ఫలితాల విడుదలపై సందిగ్ధం నెలకొంటోంది. గతేడాది ప్రశ్నపత్రం లీకేజీతో లక్షల మంది విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. నేషనల్ టెనిస్టంగ్ ఏజెన్సీ తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ ఏడాది పకడ్బందీగా నిర్వహించినా.. కోర్టులు వరుసగా ఫలితాలపై స్టే ఇస్తున్నాయి. ఇటీవల మధ్యప్రదేశ్ కోర్టు స్టే వివ్వగా, తాజాగా మద్రాస్ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఫలితాలను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆదేశిస్తూ, తదుపరి విచారణను జూన్ 2, 2025కి వాయిదా వేసింది. ఈ పరిణామం లక్షలాది విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read : జేఈఈ అడ్వాన్స్‌డ్–2025.. ఐఐటీ సీట్ల సమరానికి సిద్ధం..!
తమిళనాడు, మధ్యప్రదేశ్‌లోని కొన్ని పరీక్షా కేంద్రాల్లో మే 4, 2024న జరిగిన నీట్ పరీక్ష సమయంలో విద్యుత్ అంతరాయం ఏర్పడినట్లు విద్యార్థులు ఆరోపించారు. ఈ సమస్య వల్ల సరైన లైటింగ్, వెంటిలేషన్ లేకపోవడంతో పరీక్ష రాయడం కష్టమైందని పేర్కొన్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో తమ పనితీరు దెబ్బతిందని వారు వాదించారు. ఈ ఫిర్యాదులపై మద్రాస్ హైకోర్టు, మధ్యప్రదేశ్ హైకోర్టు సీరియస్‌గా స్పందించి, ఫలితాల విడుదలను నిలిపివేశాయి.
భారీ ఎత్తున పరీక్షకు హాజరు
నీట్ 2024 పరీక్షను దేశవ్యాప్తంగా మెడికల్ కాలేజీల్లో అండర్‌గ్రాడ్యుయేట్ సీట్ల కోసం NTA మే 4న నిర్వహించింది. ఈ పరీక్షకు 23.3 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, 20.8 లక్షల మంది హాజరయ్యారు. దేశవ్యాప్తంగా 4,750 కేంద్రాల్లో ఈ పరీక్ష జరిగింది, ఇందులో 557 నగరాలు, విదేశాల్లో 14 కేంద్రాలు ఉన్నాయి. ఫలితాలు మే 18, 2025 నాటికి విడుదల కావాల్సి ఉండగా, కోర్టు ఆదేశాలతో వాయిదా పడ్డాయి.
కోర్టు ఆదేశాలతో ఫలితాలకు బ్రేక్..
మద్రాస్ హైకోర్టు జస్టిస్ జీ.జయచంద్రన్ నేతృత్వంలోని బెంచ్, విద్యార్థుల ఫిర్యాదులను పరిశీలించి, NTA ని సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలు, విద్యుత్ అంతరాయం సమస్యలపై వివరణ ఇవ్వాలని సూచించింది. మధ్యప్రదేశ్ హైకోర్టు కూడా ఇదే తరహా ఆదేశాలు జారీ చేసింది. జూన్ 2, 2025న జరిగే విచారణలో ఈ అంశాలపై స్పష్టత రానుంది. అప్పటి వరకు ఫలితాల విడుదలపై స్టే కొనసాగుతుంది.
విద్యార్థులపై ప్రభావం..
ఈ స్టే ఆదేశాలతో 20 లక్షలకు పైగా విద్యార్థులు ఆందోళనలో ఉన్నారు. నీట్ ఫలితాల ఆధారంగా MBBS, BDS, AYUSH కోర్సుల్లో ప్రవేశాలు జరుగుతాయి, దీంతో ఈ ఆలస్యం వారి అడ్మిషన్ షెడ్యూల్‌ను ప్రభావితం చేయవచ్చు. విద్యార్థులు, తల్లిదండ్రులు సోషల్ మీడియా వేదికలపై తమ నిరాశను వ్యక్తం చేస్తున్నారు. కొందరు NTA నిర్వహణలోని లోపాలను ఎత్తి చూపుతూ, పరీక్షా కేంద్రాల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.
నీట్ ఫలితాలపై మద్రాస్, మధ్యప్రదేశ్ హైకోర్టుల స్టే ఆదేశాలు పరీక్షా వ్యవస్థలోని సవాళ్లను బయటపెట్టాయి. విద్యుత్ అంతరాయం వంటి సాంకేతిక సమస్యలు విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం చూపకుండా, NTA సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలి. జూన్ 2 విచారణ తర్వాత ఫలితాల విడుదల తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.