
తెలంగాణ పోలీస్ శాఖ నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పోలీస్ విభాగానికి చెందిన వివిధ ప్రాంతాల్లోని భరోసా కేంద్రాల్లో ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. సంగారెడ్డి, వికారాబాద్, సూర్యాపేట, వరంగల్ జిల్లాల్లోని కేంద్రాల్లో ఈ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుంది. జూన్ 28వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది. ఆఫ్ లైన్ విధానంలో ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఆయా జిల్లాల ఎస్పీ కార్యాలయాలలో ఆసక్తి ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే ఈ ఉద్యోగాలకు ఎంపికవుతారో వాళ్లు సంవత్సరం పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. ఆ తరువాత పరిస్థితులను బట్టి కాంట్రాక్ట్ పొడిగింపు లేదా రద్దు జరుగుతుందని సమాచారం. వరంగల్ జిల్లాలో 1 లీగల్ సపోర్ట్ ఆఫీసర్ పోస్టు ఖాళీగా ఉండగా ఎల్ఎల్‌బీ/ఎల్ఎల్ఎం పాసై రెండేళ్ల అనుభవం ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
35 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండగా ఉద్యోగాలకు ఎంపికైన వాళ్లకు నెలకు 22,000 రూపాయల వేతనం లభిస్తుంది. వికారాబాద్ జిల్లాలో సపోర్ట్ పర్సన్, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ ఖాళీలు ఉండగా ఎంఏ సైకాలజీ/ఎంఎస్‌డబ్ల్యూ, టాలీ తో డిగ్రీ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది. ఎంఎస్ ఆఫీస్ పై కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలి.
సపోర్ట్ పర్సన్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు 18 వేల రూపాయలు, డేటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ అకౌంటెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి రూ.15 వేలు వేతనం లభిస్తుంది. సూర్యాపేట జిల్లా, సంగారెడ్డి జిల్లాలలో కూడా 7 ఉద్యోగ ఖాళీలు ఉండగా నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చు.