JEE Mains Final Key: జేఈఈ మెయిన్స్ – 2024 (సెసన్–2) పరీక్షల ఫైనల్ ఆన్సర్ కీ విడుదలైంది. ఈ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సోమవారం అందుబాటులోకి తీసుకొచ్చింది. షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 25న మెయిన్స్ ఫలితాలు వెల్లడించాల్సి ఉంది. అయితే షెడ్యూల్ కన్నా ముందే ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఫలితాలు వెల్లడైన తర్వాత అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ ఎంటర్ చేసి విద్యార్థులు తమ స్కోర్ కార్డు పొందవచ్చు.
ఏప్రిల్‌లో పరీక్షలు..
ఇదిలా ఉండగా జేఈఈ మెయిన్స్ సెషన్–2 పరీక్షలు ఏప్రిల్ 4 నుంచి 12 వరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించింది. దేశ వ్యాప్తంగా 12.57 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. రెండు సెషన్లకు హాజరైన విద్యార్థులు సాధించిన మెరుగైన స్కోర్‌ను పరిగణనలోకి తీసుకుని మెరిట్ లిస్టును ఎన్‌టీఏ విడుదల చేయనుంది.
27 నుంచి అడ్వాన్స్‌డ్‌కు దరఖాస్తులు..
జేఈఈ మెయిన్‌లో కటాఫ్ మార్కులు పొంది ఉత్తీర్ణత సాధించిన 2.50 లక్షల మందికి జేఈఈ మెయిన్స్ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. ఈ పరీక్షకు ఏప్రిల్ 27 నుంచి మే 7 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే 17 నుంచి 26వ తేదీ వరకు అడ్మిట్ కార్డులను అందుబాటులో ఉంచుతారు. మే 26న ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పేపర్–1 పరీక్ష, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకు పేపర్–2 పరీక్షలు జరుగుతాయి. వీటి ఫలితాలను జూన్ 9న ప్రకటిస్తారు.