Animesh Pradhan UPSC: తొమ్మిదేళ్ల క్రితం అతని తండ్రి మరణించాడు. క్యాన్సర్‌తో పోరాడిన తల్లి సరిగ్గా సివిల్స్ ఇంటర్వ్యూ సమయంలో కాలం చేసింది. అంతటి విషాధ సమయంలోనూ బాధను దిగమింగి.. లక్ష్య సాధన దిశగా ముందుకు సాగాడు ఒడిశాలోని అనుగుల్ జిల్లా తాల్‌చేర్‌కు చెందిన 24 ఏళ్ల అనిమేశ్ ప్రధాన్. తాజాగా యూపీఎస్సీ ప్రకటించిన సివిల్స్ ఫలితాల్లో ఏకంగా దేశంలోనే రెండో స్థానంలో నిలిచాడు. చిన్నప్పటి నుంచి సాగిన కష్టాల ప్రయాణంలో చివరకు గమ్యస్థానం చేరుకున్నాడు. ఎలాంటి కోచింగ్ తీసుకోకుండానే దేశంలోనే 2వ ర్యాంకు సాధించాడు. కేంద్రీయ విద్యాలయంలో పాఠశాల విద్య పూర్తిచేసిన అనిమేశ్ తర్వాత రూర్కెలాలోని ఎన్‌ఐటీ నుంచి కంప్యూటర్ సైన్స్‌లో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. ఢిల్లీలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ రిఫైనరీలో ఉద్యోగం చేస్తున్నాడు.
సివిల్స్‌పై మక్కువ.. మొక్కవోని దీక్ష..
ఇక అనిమేశ్‌కు సివిల్స్ అంటే ఇష్టం. ఎలాగైనా సాధించాలన్న మక్కువతో, మొక్కవోని దీక్షతో ప్రయత్నం చేశాడు. తొలి ప్రయత్నంలోనే దేశంలోనే రెండో ర్యాంక్ సాధించాడు. 2020లో సివిల్స్ ప్రిపరేషన్ ప్రారంభించిన అనిమేశ్ సోషియాలజీని ఆప్షనల్ గా ఎంచుకున్నా. రోజుకు 5– 6 గంటల పాటు చదివేవాడు. పరీక్ష కోసం ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు.
ఇంటర్వ్యూ సమయంలో..
ఇక అనిమేశ్ సివిల్స్ ఇంటర్వ్యూ సమయంలో ఆయన తల్లి మరణించింది. అనిమేశ్ 11వ తరగతి చదువుతున్న సమయంలో.. అంటే 15 ఏళ్ల వయసులో అతని తండ్రి మరణించాడు. అయినా కుంగిపోలేదు. లక్ష్యం వైపు దూసుకుపోయాడు. విషాధకర పరిస్థితిలో బాధను దిగమింగి లక్ష్య సాధన దిశగా అడుగులు వేశాడు. విజయం సాధించాడు.
ఐఏఎస్‌కు తొలి ప్రాధాన్యం..
ఇక సివిల్స్ రెండో ర్యాంకు సాధించిన అనిమేశ్ మాట్లాడుతూ తనకు 2వ ర్యాంకు వచ్చినందుకు సంతోషంగా ఉందని తెలిపారు. ఐఏఎస్‌కు తొలి ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు. ఒడిశా క్యాడర్ రావాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు. తన రాష్ట్ర ప్రజలు ముఖ్యంగా అట్టడుగు వర్గాలు, వెనుకబడిన ప్రాంతాల వారి అభ్యున్నతికి కృషి చేస్తానని తెలిపారు.