ప్రముఖ సంస్థలలో ఒకటైన ఇన్ఫోసిస్ కంపెనీ దేశంలో రెండో అతిపెద్ద ఐటీ కంపెనీగా గుర్తింపును సంపాదించుకుంది. ఈ సంస్థ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. కొన్ని రోజుల క్రితం టీసీఎస్ సంస్థ 40,000 మంది ఉద్యోగులను నియమించుకోనున్నామని కీలక ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఇన్ఫోసిస్ కూడా ఏకంగా 35వేల మంది కాలేజ్ గ్రాడ్యుయేట్లను రిక్రూట్ చేసుకోనున్నట్టు వెల్లడించింది.
కంపెనీ నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. డిజిటల్ టాలెంట్ కు రోజురోజుకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కొత్తవాళ్లకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్నామని ఇన్ఫోసిస్ పేర్కొంది. ఇన్ఫోసిస్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రావు ఈ వివరాలను వెల్లడించారు. ఉద్యోగులు ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో వ్యాక్సినేషన్ కార్యక్రమాలను చేపట్టామని ప్రవీణ్ రావు పేర్కొన్నారు.
ఉద్యోగులు తమ నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొన్ని యాక్టివిటీలను కూడా ప్రారంభించామని ప్రవీణ్ రావు అన్నారు. ఉద్యోగులు నైపుణ్యాలను మెరుగుపరచుకోవడానికి కొత్త కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టామని ప్రవీణ్ రావు అన్నారు. 2021 సంవత్సరం జూన్ నెలతో ముగిసిన త్రైమాసికానికి ఇన్ఫోసిస్ కంపెనీ 5,195 కోట్ల రూపాయల లాభాలను గడించడంతో పాటు కంపెనీ ఆదాయం ఏకంగా 27,896 కోట్ల రూపాయలకు పెరిగింది.
ఇన్ఫోసిస్ కంపెనీ 23.7 శాతం వృద్ధి రేటును నమోదు చేయడంతో పాటు 2.6 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ పై ఒప్పందాలను కుదుర్చుకోవడం గమనార్హం. ఇన్ఫోసిస్ ఏకంగా 35వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని తీసుకున్న నిర్ణయంపై నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.