తెలంగాణ రాష్ట్ర పదో తరగతి ఫలితాలు తాజాగా విడుదలైన సంగతి తెలిసిందే. కరోనా సెకండ్ వేవ్ విజృంభణ వల్ల ఈ ఏడాది పరీక్షలు లేకుండానే ఫలితాలు రిలీజ్ కావడం గమనార్హం. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు ఆగష్టు నెలలో ఒరిజినల్ మెమోలు అందనున్నాయని తెలుస్తోంది. విద్యాశాఖ అధికారులు విద్యార్థులు వెబ్ సైట్ లో ఉన్న మెమోలను అప్పటివరకు వినియోగించుకోవచ్చని వెల్లడిస్తున్నారు.
అధికారులు బోగస్ మెమోలు, నకిలీ మెమోలకు ఆస్కారం ఇవ్వకుండా బార్ కోడ్ తో పాటు ఇతర సెక్యూరిటీ ఫీచర్లు ఉన్న మెమోలను విద్యార్థులకు అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థుల పేర్లు, విద్యార్థుల తల్లిదండ్రుల పేర్లు, విద్యార్థుల ఇంటి పేర్లలో కొన్ని రీజన్స్ వల్ల అక్షరదోషాలు, తప్పులు చోటు చేసుకుంటున్నాయని ఆలస్యంగానైనా తప్పులు లేకుండా మెమోలు జారీ చేయాలని నిర్ణయం తీసుకున్నామని అధికారులు చెబుతున్నారు.
ఒకసారి మెమోలను ముద్రించిన తరువాత ఆ మెమోలలో తప్పులు దొర్లితే మళ్లీ ముద్రించి ఇవ్వడం అంత తేలిక కాదని అధికారులు వెల్లడిస్తున్నారు. తప్పులు లేకుండా సవరణలు చేసిన తరువాత మెమోలను అందజేస్తామని అధికారులు తెలుపుతున్నారు. స్కూల్ లాగిన్ ఐడీనుంచి ఎస్సెస్సీ ఒరిజినల్ మెమోలను ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. హెడ్ మాస్టర్ సిగ్నేచర్ చేసిన తరువాత ఈ మెమోలు చెల్లుబాటు అవుతాయి.
అధికారులు తీసుకున్న నిర్ణయాన్ని విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారు. మరోవైపు తెలంగాణలో భారీ సంఖ్యలో విద్యార్థులు పదో తరగతి ఫలితాల్లో 10జీపీఏ సాధించిన సంగతి తెలిసిందే.