IIT: ఐఐటీ చేసిన కొలువు గ్యారంటీ కాదు.. 38 శాతం మంది ఖాళీ! నమ్మలేని నిజాలివీ

ఐటీ ఢిల్లీలో గడిచిన ఐదేళ్లలో 22 శాతం మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ దక్కలేదు. ఈ ఏడాది ఈ శాతం 40కి పెరిగింది. 2022 నుంచి 2024 వరకు పాత తొమ్మిది ఐఐటీల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 1.2 రెట్లు పెరగ్గా.. ఉద్యోగాలు సాధించనివారి సంఖ్య 2.1 రెట్లు పెరిగింది.

Written By: Raj Shekar, Updated On : May 24, 2024 8:12 am

IIT

Follow us on

IIT: మన దేశంలో ఐఐటీకు యమ క్రేజీ ఉంది. ఈ ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో చదివితే మంచి కంపెనీల్లో ఉద్యోగాలు, రూ.లక్షల్లో వేతన ప్యాకేజీలు ఉంటాయని చాలా మంది భావిస్తారు. కానీ, ప్రస్తుతం నిరుద్యోగం పెరగడంతో ఐఐటీ చదివినా ఉద్యోగం వస్తుందన్న గ్యారంటీ లేదు. దేశంలోని ఐఐటీల్లో చదువుకుంటున్న విద్యార్థుల్లో ఈ ఏడాది 38 శాతం మందికి క్యాంపస్ ప్లేస్‌మెట్‌ దక్కకపోవడమే ఇందుకు నిదర్శనం.

8 వేల మందికి నో ఛాన్స్‌..
ఈ ఏడాది దేశంలోని 23 ఐఐటీల్లో నిర్వహించిన క్యాంపస్‌ ప్లేస్‌మెంట్‌లలో దాదాపు 8 వేల మంది(38 శాతం) ఐఐటీయన్లకు ఉద్యోగం రాలేదు. మొత్తం 21,500 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్‌ కోసం నమోదు చేసుకున్నారు. వీరిలో 13,400 మంది మాత్రమే ఉద్యోగం సాధించారు. మిగతా వారు (38శాతం) ఇంకా కొలువుల కోసం అన్వేషిస్తున్నారు. రెండేళ్ల క్రితం నాటితో పోలిస్తే ఏడాది ప్లేస్‌మెంట్‌ దక్కనివారు రెట్టింపయ్యారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. పాత తొమ్మిది ఐఐటీల్లో ఈ ఏడాది 16,400 మంది విద్యార్థులు ప్లేస్‌మెంట్‌ కోసం నమోదు చేసుకోగా.. వారిలో 6,050 (37%) మందికి ఇంకా ఉద్యోగాలు దక్కలేదు. కొత్తగా ఏర‍్పడిన 14 ఐఐటీల్లో ఈ పరిస్థితి మరింత దారుణంగా ఉంది. 5,100 మంది ప్లేస్‌మెంట్‌ కోసం నమోదు చేసుకోగా.. 2,040 మందికి కొలువులు రాలేదు. గతేడాది కాన్పూర్ ఐఐటీ, ఖరగ్‌పూర్‌ ఐఐటీల్లో 33 శాతం మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ దక్కలేదు.

ఐదేళ్లలో 22 శాతం మందికి దక్కని ప్లేస్‌మెంట్‌..
ఐటీ ఢిల్లీలో గడిచిన ఐదేళ్లలో 22 శాతం మంది విద్యార్థులకు ప్లేస్‌మెంట్‌ దక్కలేదు. ఈ ఏడాది ఈ శాతం 40కి పెరిగింది. 2022 నుంచి 2024 వరకు పాత తొమ్మిది ఐఐటీల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 1.2 రెట్లు పెరగ్గా.. ఉద్యోగాలు సాధించనివారి సంఖ్య 2.1 రెట్లు పెరిగింది. కొత్త ఐఐటీల్లో నమోదు చేసుకున్న విద్యార్థుల సంఖ్య 1.3 రెట్లు పెరిగింది. ప్లేస్‌మెంట్‌ దక్కని విద్యార్థుల సంఖ్య 3.8 రెట్లు పెరిగింది. ఈ సంక్షోభం విద్యార్థుల మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోంది.