Half Day Schools: ఈ ఏడాది అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ హెచ్చనిస్తోంది. ఎల్‌నినో ప్రభావంతో వేడి పెరుగుతుంది. గతంలో ఎన్నడూ లేనివిధంగా మార్చి మొదటి వారంలోనే భానుడు నిప్పులు చెరుగుతున్నాడు ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 5 డిగ్రీలు అధికంగా నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలల నిర్వహణ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 15 నుంచి పాఠశాలలను ఒంటిపూట నిర్వహించాలని నిర్ణయించింది.
విద్యాశాఖ ఉత్తర్వులు..
మార్చి 15 నుంచి ఏప్రిల్ 23 వరకు పాఠశాలలను ఒంటిపూట నిర్వహించాలని విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ పాఠశాలల్లో ఒంటిపూట బడులు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.
పని వేళలు మార్పు..
ఇక పాఠశాలల పనివేళలను కూడా మార్చింది. ఈమేరకు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పాఠశాలలను నిర్వహించాలని తెలిపింది. మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పెట్టి పంపించాలని సూచించింది.
యథావిధిగా ప్రత్యేక తరగతులు..
పాఠశాలలను ఒంటిపూట నిర్వహించినా పదో తరగతి విద్యార్థులకు మాత్రం ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని తెలిపింది. ఇప్పటికే సిలబస్ పూర్తయి రివిజన్ జరుగుతున్నందున పదో తరగతి విద్యార్థులకు ఉదయం 8 నుంచి 9 గంటల వరకు సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ప్రత్యేక తరగతులు కొనసాగుతాయని వెల్లడించింది. మార్చి 18 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ఉన్నందున ఈ నిర్ణయం తీసుకుంది. ఇక పదో తరగతి పరీక్షలు నిర్వహించే పాఠశాలల్లో మధ్యాహ్నం ఒంటిపూట బడి నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.