TSPSC: తెలంగాణలో నిరుద్యోగులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న గ్రూప్స్ పరీక్షల షెడ్యూల్ వచ్చేసింది. పరీక్షల తేదీలను టీఎస్‌పీఎస్సీ బుధవారం అధికారికంగా ప్రకటించింది.
జూన్ 9న గ్రూప్–1 ప్రిలిమ్స్..
గ్రూప్–1 ప్రిలిమ్స్ పరీక్షను జూన్ 9న నిర్వహించాలని టీఎస్‌పీఎస్సీ నిర్ణయించింది. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇక గ్రూప్ – 2 పరీక్షలు ఆగస్టు 7, 8 తేదీల్లో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. గ్రూప్ – 3 పరీక్షలు నవంబర్ 17, 18 తేదీల్లో నిర్వహిస్తామని టీఎస్‌పీఎస్సీ ప్రకటించిందిజ
గ్రూప్–1కు కొత్త నోటిఫికేషన్..
ఇదిలా ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం గ్రూప్–1కు కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. 563 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఫిబ్రవరి 23 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. మార్చి 14వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. దరఖాస్తుల్లో మార్పులకు మార్చి 23 వరకు అవకాశం ఉంది. ఇక గ్రూప్–2, గ్రూప్ – 3 గతంలో ప్రకటించినవే. అయితే పరీక్షల నిర్వహణలో లోపాలతో ఈ పోస్టుల భర్తీ నిలిచిపోయింది. గ్రూప్–4 పరీక్ష పూర్తవగా, ఇటీవలే ఫలితాలను టీఎస్‌పీఎస్సీ వెల్లడించింది.
మెగా డీఎస్సీ..
మరోవైపు 11,062 పోస్టులతో ప్రభుత్వం డీఎస్సీ నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. మార్చి 4 నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఏప్రిల్ 3 వరకు దరఖాస్తుల స్వీకరణ గడువు ఉంది. గత డీఎస్సీకి దరఖాస్తు చేసుకున్నవారు మళ్లీ దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదని ప్రభుత్వం ప్రకటించింది. పరీక్ష ఫీజు రూ.1000గా నిర్ణయించింది. వీటికి మే 23 నుంచి పది రోజులు పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించింది. పది రోజులు నిర్వహించే పరీక్షకు 11 కేంద్రాలు ఏర్పాటు చేయనుంది.
ఉద్యోగాల భర్తీపై దృష్టి..
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నియామకాలపై దృష్టి పెట్టింది. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే మొత్తం టీఎస్‌పీఎస్‌సీ బోర్డునే ప్రక్షాళన చేసింది. చైర్మన్‌తోపాటు సభ్యులందరినీ మార్చేసింది. ప్రస్తుతం చైర్మన్‌గా తెలంగాణ మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి విధులు నిర్వహిస్తున్నారు. ఆయన సారథ్యంలోనే గ్రూప్స్ పరీక్షలు జరుగనున్నాయి.