Half Day Schools 2024: తెలంగాణలో ఒంటిపూట బడులపై విద్యాశాఖ కీలక అప్‌డేట్ ఇచ్చింది. రోజు రోజుకూ ఎండలు ముదురుతున్నాయి. మార్చి ప్రారంభంలోనే భానుడు భగ్గుమంటున్నాడు. 35 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం హాఫ్ డే స్కూల్స్‌పై కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు ఇబ్బంది కలుగకుండా ఒంటిపూట నిర్వహించాలని ఆదేశించింది.
ఈసారి అధిక వేడి..
మార్చి ప్రారంభం కాకముందే రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 4 నుంచి 7 డిగ్రీల వరకు అదనంగా నమోదవుతున్నాయి. సాధారణం కన్నా ఎక్కువగా వేడి ఉండడంతో పాఠశాలల్లో పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పగటి ఉష్ణోగ్రతలు 32 నుంచి 37 డిగ్రీల సెల్సీయస్ మధ్య నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ వేసవి బాగా వేడిగా ఉంటుందని పేర్కొంది.
15 నుంచి ఒంటిపూట బడులు..
పెరిగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పగలు ఎండలు, వేడి ఎక్కువగా ఉండడంతో హాఫ్ డే స్కూల్స్ నిర్వహించాలని నిర్ణయించింది. మార్చి 15 నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ స్కూళ్లలో ఆఫ్‌డే అమలు చేయాలని విద్యాశాఖ శనివారం ఆదేశించింది.
టైమింగ్స్ ఇలా..
హాఫ్ డే స్కూల్ నేపథ్యంలో పాఠశాలల పనివేళలను కూడా విద్యాశాఖ మార్చింది. ఉదయం 8 గంటలకు పాఠశాలలు ప్రారంభిస్తారు. మధ్యాహ్నం 12:30 గంటల వరకు తరగతులు పూర్తి చేస్తారు. తర్వాత విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించి ఇంటికి పంపిస్తారు. కాగా, ఈనెల 18 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు జరుగనున్నాయి. టెన్త్ పరీక్షలు ఉదయమే ఉన్న నేపథ్యంలో సెంటర్లు ఉన్న పాఠశాలల విద్యార్థులకు మధ్యాహ్నం 12:30 నుంచి హాఫ్‌డే అమలు చేయాలని విద్యాశాఖ సూచించింది.