Telangana Engineering Seats: ఇంజినీరింగ్.. ఒకప్పుడు విద్యార్థులు, తల్లిదండ్రుల స్వప్నం. సీటు కోసం లక్షల రూపాయలు డొనేషన్లు కూడా చెల్లించేవారు. అయితే ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఇబ్బడి ముబ్బడిగా ఇంజినీరింగ్ కాలేజీలకు అనుమతి ఇచ్చారు. ఫలితంగా ర్యాంకు ఎక్కువ వచ్చినా సీటు వస్తుందన్న నమ్మకం ఏర్పడింది. దీంతో డొనేషన్లు కాస్త తగ్గాయి. తర్వాత వచ్చిన సీఎంలు కూడా కొత్త కాలేజీలకు అనుమతులు ఇస్తూనే ఉన్నారు. దీంతో ఇంజినీరింగ్ కాలేజీలు కూడా పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఇక దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకంతో ఇంజినీరింగ్ విద్య పేద విద్యార్థికి కూడా చేరువైంది. ఫలితంగా వేలాది మంది తమ స్వప్నం సాకారం చేసుకున్నారు. కానీ, పెరుగుతున్న కళాశాలలతోపాటు.. ఇంజినీరింగ్ ప్రమాణాలు తగ్గుతూ వస్తున్నాయి. అదే సమయంలో క్వాలిటీ ఎడ్యుకేషన్ లేని విద్యార్థులకు ఉద్యోగాలు ఇచ్చేందుకు కంపెనీలు వెనుకాడుతున్నాయి. ఫలితంగా ఇంజినీరింగ్‌లో చేరేవారి సంఖ్య తగ్గుతోంది. తాజాగా 2023–24 సంవత్సరానికి నిర్వహించిన కౌన్సెలింగ్‌లో భారీగా సీట్లుల మిగిలిపోవడమే ఇందుకు నిదర్శనం.
కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి..
తెలంగాణలో కొన్నేళ్లుగా ఇంజినీరింగ్ సీట్లు భారీగా మిగిలిపోతున్నాయి. ఈ ఏడాది కూడా భారీగా సీట్లు మిగిలిపోయాయి. స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ తర్వాత మొత్తం 16,296 ఇంజినీరింగ్ సీట్లు మిగిలాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కోర్సుల్లో 5,723 సీట్లు మిగిలాయి. ఇంకా.. ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్‌లో 4,959 సీట్లు, సివిల్, మెకానికల్ బ్రాంచ్ కు సంబంధించి 5,156 సీట్లు మిగిలాయి. ఇతర కోర్సుల్లో మరో 458 సీట్లు మిగిలినట్లు ఎంసెట్ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో 178 కాలేజీలు..
తెలంగాణలో మొత్తం 178 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 85,671 సీట్లు ఉన్నాయి. వీటి భర్తీకి ఎంసెట్ కౌన్సెలింగ్–2023లో అందుబాటులో ఉంచింది ఉన్నత విద్యామండలి. ఇందులో 69,375 సీట్లు భర్తీ అయినట్లు ఎంసెట్ అధికారులు తెలిపారు. మొత్తం 80.97 శాతం సీట్లు భర్తీ అయినట్లు వివరించారు. అయితే.. మిగిలిపోయిన సీట్లలో అత్యధికంగా ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజీల్లోనివే ఉన్నాయి. రాష్ట్రంలోని ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీల్లో 14,511 సీట్లు భర్తీ కాకుండా మిగిలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. ఇంకా.. ప్రైవేట్ యూనివర్సిటీల్లో 289, యూనివర్సిటీ కాలేజీల్లో మరో 1,496 సీట్లు మిగిలిపోయాయని తెలిపారు. అయితే.. ఆయా కాలేజీలు స్పాట్ కౌన్సెలింగ్ ద్వారా ఈ మిగిలిన సీట్లను భర్తీ చేసుకునే అవకాశం ఉంటుంది.
ప్రత్యామ్నాయ కోర్సులవైపు..
ఇంజినీరింగ్ క్రేజ్ తగ్గిపోవడం, కొన్ని కళాశాలల్లోనే క్యాంపస్ ప్లేస్‌మెంట్ ఉండడంతో ఇంజినీరింగ్ స్వప్నం క్రమంగా కరిగిపోతోంది. మరోవైపు ఐటీ సెక్టార్ తరచూ సంక్షోభం ఎదుర్కొంటుండడం కూడా ఇంజినీరింగ్‌లో చేరేందుకు విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. దీంతో త్వరగా ఉపాధి కల్పించే.. దొరికే కోర్సులపై ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీలోనూ సాంకేతిక కోర్సులు అందుబాటులోకి రావడం కూడా ఇంజినీరింగ్‌పై ఆసక్తి తగ్గడానికి కారణమవుతోంది.