TS DSC Notification 2024: అధికారంలోకి వచ్చిన ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఆమేరకు నోటిఫికేషన్లు ఇస్తోంది. ఇటీవలే గతేడాది ఇచ్చిన గ్రూప్–1 నోటిఫికేషన్‌ను రద్దు చేసింది. మరుసటి రోజే అదనపు పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది. పరీక్ష నిర్వహణ తేదీని కూడా నోటిఫికేషన్‌లోనే పేర్కొంది. ఇక తాజాగా గత ఆగస్టులో బీఆర్‌ఎస్ ప్రభుత్వం జారీ చేసిన డీఎస్సీ నోటిఫికేషన్‌ను కూడా ఫిబ్రవరి 28న రద్దు చేసింది. ఫిబ్రవరి 29న 11,062 పోస్టులతో కొత్త నోటిఫికేషన్ ఇచ్చింది.
ఏ పోస్టులు ఎన్నంటే..
కొత్తగా 11,062 పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వగా ఇందులో అత్యధికం ఎస్జీటీ పోస్టులే ఉన్నాయి. ఇందులో 6,508 ఎస్జీటీ పోస్టులు ఉండగా, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,629 ఉన్నాయి. భాషా పండిత పోస్టులు 727 పోస్టుల ఉన్నట్లు నోటిఫికేషన్‌లో విద్యాశాఖ ప్రకటించింది. స్కూల్ అసిస్టెంట్‌లో ప్రత్యేక పోస్టులు 220, ఎస్జీటీలో ప్రత్యేక పోస్టులు 796 ఉన్నాయి.
మార్చి 4 నుంచి దరకాస్తుల స్వీకరణ..
పాత పోస్టుల 5086, కొత్త పోస్టులు 5,973 పోస్టులు కలిపి కొత్త నోటిఫికేషన్ ఇచ్చారు. డీఎస్సీకి మార్చి 4 నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. పరీక్ష జూన్ లేదా జూలైలో నిర్వహించే అవకాశం ఉంది. గతంలో దరఖాస్తు చేసుకున్నవారు అవసరం లేదని తెలిపింది. గతంలో 1,77,502 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4 లక్షల మంది టెట్ ఉత్తీర్ణత పొందారు.