మనలో చాలామంది సక్సెస్ సాధించాలని కలలు కంటూ ఉంటారు. ఎవరైతే సక్సెస్ కోసం కలలు కనడంతో పాటు నిరంతరం కృషి చేస్తారో వారికే సక్సెస్ సొంతమవుతుంది. శ్రమ, పట్టుదల ఉంటే లక్ష్యం ఎంత పెద్దదైనా సులభంగా ఆ లక్ష్యాన్ని సాధించడం సాధ్యమవుతుంది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అరవింద్ అనే విద్యార్థి పేద కుటుంబంలో పుట్టినా, చదుకోవడానికి అనేక ఆటంకాలు ఎదురైనా తీవ్రంగా శ్రమించి కన్న కలను సాధించాడు.
పూర్తి వివరాల్లోకి వెళితే యూపీలోని కుషీనగర్ పరిధిలో గల బర్డీ గ్రామంలో భిఖారీ కుమార్ అనే వ్యక్తి పాత సామాన్లు అమ్ముకుంటూ జీవనం సాగించేవాడు. తనలా తన కొడుకు కష్టపడకూడదని భావించి తన కొడుకు చదువుకు అవసరమైనవన్నీ సమకూర్చాడు. కొడుకు అరవింద్ చిన్నప్పటి నుంచి డాక్టర్ కావాలని కలలు కంటూ ఎంతో కష్టపడి చదివి నీట్ పరీక్షలో ర్యాంక్ సాధించాడు.
ఆల్ ఇండియా స్థాయిలో 11,602 ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో 4,392వ ర్యాంకు సాధించి వార్తల్లో నిలిచాడు. అరవింద్ డాక్టర్ కావాలన్న కలను సాకారం చేసుకోవడంతో పాటు గ్రామంలో తండ్రికి మంచిపేరు తెచ్చిపెట్టాడు. కష్టపడితే అసాధ్యాన్నైనా సులువుగా సుసాధ్యం చేసుకోచ్చని.. చదువుకు పేదరికం అడ్డు కాదని నిరూపించాడు. గోరఖ్‌పూర్ ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించిన అరవింద్ తొలి ప్రయత్నంలో ఫెయిల్ అయ్యాడు.
అయితే నిరాశానిస్పృహలకు లోను కాకుండా మరోసారి ప్రయత్నించి సక్సెస్ ను సొంతం చేసుకున్నాడు. పదవ తరగతి, ఇంటర్ లో తక్కువ మార్కులు వచ్చినప్పటికీ డాక్టర్ కావాలనే సంకల్పంతో అరవింద్ ప్రయత్నించాడు. భవిష్యత్తులో ఆర్థోపెడిక్ సర్జన్ కావాలని అనుకుంటున్నానని.. తన గ్రామంలో తానే తొలి డాక్టర్ నని అరవింద్ గర్వంగా చెబుతున్నాడు.