Tollywood Unity: టాలీవుడ్ ఐక్యత రాగం: కలిసుందాం.. కలెక్షన్లు పెంచుకుందాం..

-రాజమౌళి, ప్రభాస్ ఢీ అంటే ఢీ అంటున్నరా ? -అన్న కొడుకు కోసం బాబాయ్ బరి నుంచి తప్పుకున్నాడా.. -పెద్ద సినిమాల రిలీజ్ గ్యాప్ ను 20 ఏళ్ల క్రితమే డిసైడ్ అయ్యిందా ? Tollywood Unity: టాలీవుడ్ ఇండస్ట్రీ వైఖరి మారుతున్నది… ఒకప్పుడు తమ సినిమాలు సంక్రాంతికి విడుదల చేయాలని పందెం కోళ్లలా బరిలో దూకిన టాప్ హీరోలు.. నిర్మాతలు, దర్శకులు తమ పంథాను మార్చుకుంటున్నట్లు కనిపిస్తున్నది..  టాలీవుడ్ కు దసరా, సంక్రాంతి, వేసవి మూడు […]

Written By: NARESH, Updated On : December 23, 2021 4:03 pm
Follow us on

-రాజమౌళి, ప్రభాస్ ఢీ అంటే ఢీ అంటున్నరా ?
-అన్న కొడుకు కోసం బాబాయ్ బరి నుంచి తప్పుకున్నాడా..
-పెద్ద సినిమాల రిలీజ్ గ్యాప్ ను 20 ఏళ్ల క్రితమే డిసైడ్ అయ్యిందా ?

Tollywood Unity

Tollywood Unity: టాలీవుడ్ ఇండస్ట్రీ వైఖరి మారుతున్నది… ఒకప్పుడు తమ సినిమాలు సంక్రాంతికి విడుదల చేయాలని పందెం కోళ్లలా బరిలో దూకిన టాప్ హీరోలు.. నిర్మాతలు, దర్శకులు తమ పంథాను మార్చుకుంటున్నట్లు కనిపిస్తున్నది..  టాలీవుడ్ కు దసరా, సంక్రాంతి, వేసవి మూడు ప్రధాన సీజన్లు.. ఈ సీజన్ లో సినిమాలు విడుదల చేస్తే.. సినిమాకు కలెక్షన్లు కనక వర్షంలా కురుస్తాయని నిర్మాతలు, దర్శకులు, హీరోల నమ్మకం. పైగా సెలవులు కూడా కలిసి వస్తుండడంతో సినిమా ఫలితం ఎలా ఉన్నా నష్టాల్లో కూరుకుపోమనే నమ్మకం ఉండేది. ఆయా సీజన్లలో తమ సినిమా విడుదల కావాలంటే, తమ సినిమానే విడుదల చేయాలనే ధోరణి ఉండేది. ఈ క్రమంలో సినిమా పరిశ్రమ భిన్న వర్గాలు విడిపోయిన సందర్భాలూ ఉన్నాయి.

ఎన్టీఆర్, ఏఎన్ఆర్ నుంచి మొదలు 2019 లో అల్లు అర్జున్ ‘అల వైకుంఠపురంలో’.. మహేశ్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ వరకు పోటీ కనిపించింది. కరోనా తో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఇప్పటికే షూటింగ్ లు పూర్తి చేసుకొని పరిస్థితులు అనుకూలించక సినిమాలు విడుదల చేయలేని పరిస్థితులు ఉండగా, ఫైనాన్షియర్ల ఒత్తిడితో నిర్మాతలు సతమవుతున్నారు. సినిమా విడుదల చేస్తే జనాలు మునుపటిలా వస్తారో రారో అనే అనుమానాలు నెలకొన్నాయి. ఓటీటీకి ఇస్తే కేవలం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితులు కూడా లేవు. దీంతో పెద్ద సినిమాల మధ్య పోటీని నివారిస్తేనే ఇండస్ర్టీ నిలబడుతుందని సినీ వర్గాల్లో ఆలోచన మొదలైంది. పెద్ద హీరోలు, నిర్మాతలు, దర్శకులంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తున్నది.

ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ముందుగానే తన సినిమాను సంక్రాంతి బరి నుంచి వేసవికి షిఫ్ట్ చేశాడు. మెగాస్టార్ చిరంజీవి కూడా తన ఆచార్యను ఫిబ్రవరికి షిఫ్ట్ చేశాడు. అలాగ్ టాప్ హీరో బాలకృష్ణ తన అఖండ సినిమాని డిసెంబర్ చివరి వారం నుంచి మొదటి వారానికి షిఫ్ట్ చేశాడు. అల్లు అర్జున్ కూడా రెండో వారానికి మార్చుకున్నాడు. వరుణ్ తేజ్ ‘గని’ సినిమాను డిసెంబర్ మొదటి వారంలోనే విడుదల కావాల్సి ఉండగా తప్పుకున్నాడు.

ఇక సంక్రాంతి బరిలో మూడు పెద్ద సినిమాలు నువ్వా నేనా అన్నట్లుగా నిలుచున్నాయి. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో తీసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ భారీ బడ్జెట్ తో దాదాపు రెండున్నరేళ్లు చిత్రీకరించారు. ఇక పాన్ ఇండియన్ రెబల్ స్టార్ ప్రభాస్ రాధేశ్యామ్ ను భారీ బడ్జెట్ తో దాదాపు మూడేళ్ల పాటు షూటింగ్ జరుపుకుంది. ఇక పవర్ స్టార్ పవన్ కల్యాణ్, రానా కాంబినేషన్ లో తొలిసారిగా వస్తున్న భీమ్లా నాయక్ కూడా కచ్చితంగా పోటీలో ఉంటుందని అందరూ భావించారు. ఈ సంక్రాంతికి త్రిముఖ పోటీ తప్పదని అంతా అనుకున్నారు. ఆర్ఆర్ఆర్ లో తన అన్న కొడుకు రామ్ చరణ్ హీరోగా ఉండడం, భారీ బడ్జెట్ చిత్ర కావడంతో తప్పనిసరి పరిస్థితుల్లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నిర్మాతను ఒప్పించి తన సినిమాను వాయిదా వేయించాడని సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతున్నది.

సరిగ్గా 20 ఏళ్ల క్రితం చూసుకుంటే ముగ్గురు టాప్ హీరోలు ఇలాగే పోటీ పడ్డారు. బాలకృష్ణ సంక్రాంతి విజేతగా నిలిచాడు. 2001 జనవరి 11న యువరత్న బాలకృష్ణ నరసింహనాయుడు, మెగాస్టార్ చిరంజీవి మృగరాజు ఒకే రోజు విడుదలయ్యాయి. జనవరి 14న విక్టరీ వెంకటేశ్ దేవి పుత్రుడు విడుదలయ్యాయి. కోడి రామకృష్ణ ,
, బీ గోపాల్,  గుణశేఖర్ లాంటి దిగ్గజ దర్శకులు తగ్గేదేలే అన్నట్టుగా అగ్రహీరోలతో సినిమాలు విడుదల చేశారు. విక్టరీ వెంకటేశ్, కోడి రామకృష్ణ కాంబినేషన్లలో అప్పటికే సూపర్ హిట్ చిత్రాలు రావడంతో ఆయా చిత్రాలపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అన్నీ భారీ బడ్జెట్ చిత్రాలే కావడం, పాటలు సూపర్ హిట్లు కావడంతో ఓ రేంజ్లో అంచనాలు వేశారు. చివరకు బాలకృష్ణ నరసింహనాయుడు సినిమా సంక్రాంతి విజేతగా నిలిచింది. దేవీపుత్రుడు యావరేజ్ అనిపించకున్నా కమర్షియల్ గా వర్కౌట్ కాలేదు. ఇక మెగాస్టార్ చిరంజీవి మృగరాజు సినిమా ప్లాఫ్ గా నిలిచింది. కనీసం రెండు వారాలు గ్యాప్ తో విడుదలైతే సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత కలెక్షన్ల పరంగా సేఫ్ జోన్ లో నిలిచే అవకాశాలు ఉండేవని టాలీవుడ్ లో చర్చలు మొదలయ్యాయి. పోటీ కారణంగా నిర్మాతలు నష్టపోతారు.. ఇండస్ర్టీ దెబ్బతింటున్నదని నిర్మాతలు, దర్శకులు, హీరోలు ఒక అభిప్రాయానికి వచ్చారు.

అప్పటి సినీ పెద్దలు దర్శకుడు దాసరి నారాయణ రావు, నిర్మాతలు రామానాయుడు, అల్లు అరవింద్, నటుడు నిర్మాత మురళీమోహన్ తదితరులంతా ముందుకు వచ్చి ఒక ఏకాభిప్రాయానికి వచ్చారు. పెద్ద సినిమాల మధ్య కనీసం రెండు వారలు గ్యాప్ ఉండాలని, తప్పనిసరి పరిస్థితులైతే కనీసం వారమైనా ఉండాలని పలుమార్లు చర్చించారు. ఆ తర్వాత ఇవే నిర్ణయాలు అమలు కావడంతో దాదాపు 15 ఏళ్ల పాటు ఇబ్బందులు ఎదురుకాలేదు. కానీ 2019లో సంక్రాంతికి మాత్రం అల వైకుంఠపురంలో, మహేశ్ బాబు సరిలేరు నీకెవ్వరు మూడు రోజుల తేడాతో విడుదల కావడంతో కలెక్షన్ల పరంగా ఇద్దరికీ కొంత నష్టం కలుగక తప్పలేదు. ఆ సినిమాల తర్వాత కరోనా వ్యాప్తితో ప్రపంచమే తలకిందులైంది. అప్పటికే పూర్తి చేసుకున్న సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో పరిస్థితి నెలకొనగా, విడుదలైన జనాలు వస్తరా అనే అనుమానాలు మొదలయ్యయి. ఈ క్రమంలో కొన్ని సినిమాలు ఓటీటీ బాట పట్టాయి. మరికొన్ని ఎడిటింగ్ ల్యాబ్ లోనే ఉండిపోయాయి.

ఇక ఇలాగైతే కుదరదు అని నిర్మాతలు, హీరోలు, దర్శకులు మళ్లీ ఒక అవగాహనకు వచ్చారు. సినీ పరిశ్రమను కాపాడుకోవాలంటే పోటీ లేకుండా చూసుకోవాలనే నిర్ణయించుకున్నారు.  జనవరి 12న విడుదలకావాల్సిన ‘భీమ్లానాయక్‌’ సంక్రాంతి బరి నుంచి తప్పుకొని ఫిబ్రవరి 25కు షిఫ్ట్ అయ్యంది. ఫిబ్రవరిలో విడుదలకావాల్సిన ‘ఎఫ్‌-3’ చిత్రం ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకురాబోతున్నది. పెద్ద సినిమాల మధ్య పోటీని నివారించేందుకు ప్రొడ్యూసర్స్‌ గిల్డ్‌ ఆయా చిత్ర నిర్మాతలతో జరిపిన చర్చలు ఫలించాయి. నిర్మాతలందరి అంగీకారంతోనే ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అగ్ర నిర్మాత దిల్‌రాజు ప్రకటించారు. మూడు రోజుల క్రితం హైదరాబాద్లో పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘తెలుగు చిత్రసీమలోని యాక్టివ్‌ ప్రొడ్యూసర్స్‌కు సమస్యలు ఎదురైనప్పుడు వాటి పరిష్కారం కోసమే అందరం సమిష్టిగా గిల్డ్‌ను ఏర్పాటుచేశాం. ఇప్పటివరకు మాకు ఎదురైన సమస్యల్లో తొంభైశాతం వరకు పరిష్కరించాం. కరోనా వల్ల గత రెండేళ్లుగా సినిమా నిర్మాణం, విడుదల విషయంలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా సంక్రాంతికి విడుదలయ్యే సినిమాల పరంగా కొంత పోటీ నెలకొంది. పండుగకు ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘భీమ్లానాయక్‌’, ‘రాధేశ్యామ్‌’ చిత్రాలను విడుదలచేయబోతున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. మూడు పెద్ద సినిమాలకు సరిపడా స్క్రీన్స్‌ మన తెలుగు రాష్ర్టాల్లో లేవు. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’, ‘రాధేశ్యామ్‌’ సినిమాల షూటింగ్‌లు మొదలై మూడేళ్లు అవుతోంది. పాన్‌ ఇండియన్‌ స్థాయిలో ఈ చిత్రాలు విడుదలవుతున్నాయి. వీటికి థియేటర్ల కొరత ఉండకూడదని ‘భీమ్లానాయక్‌’ నిర్మాతను కలిసి వాయిదా వేసుకోవాల్సిందిగా కోరాం. హీరో పవన్‌కల్యాణ్‌తో పాటు నిర్మాత రాధాకృష్ణ మా సమస్యల పట్ల సానుకూలంగా స్పందించారు. వారి అంగీకారంతోనే ‘భీమ్లానాయక్‌’ చిత్రాన్ని ఫిబ్రవరి 25కు వాయిదా వేస్తున్నాం. అదే రోజు విడుదల కావాల్సిన ‘ఎఫ్‌-3’ ని ఏప్రిల్‌ 29న ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాం. హీరోల అభిమానులు ఆందోళన చెందకుండా మా సమస్యలను అర్థం చేసుకుంటారని భావిస్తున్నాం’అని తెలిపారు.

‘ఇండస్ట్రీ పరిస్థితిని, కష్టాలను పెద్ద మనసుతో అర్థంచేసుకొని ‘భీమ్లానాయక్‌’ను వాయిదావేయడానికి అంగీకరించిన హీరో పవన్‌కల్యాణ్‌, నిర్మాత రాధాకృష్ణలకు కృతజ్ఞతలు చెబుతున్నాం. ఇండస్ట్రీలో నిర్మాతలు కలిసికట్టుగా ఉండటం చాలా ముఖ్యం. సమస్యలు వచ్చినప్పుడు ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్లినప్పుడే అందరికి లాభదాయకంగా ఉంటుంది’ అని దామోదరప్రసాద్‌ పేర్కొన్నారు.

భీమ్లానాయక్.. అయితే తప్పుకున్నారా..? తప్పించారా..? అనేది ఇక్కడ గమనించాలి.. ఆర్.ఆర్.ఆర్ కి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది.. అయితే ఈ సినిమాకి సీజన్ లతో పనిలేదు.. కానీ మొదటి ప్రకటించిన తేదీ అక్టోబర్ 13. సంక్రాంతి బరిలో మొదట నిలిచిన సినిమా భీమ్లానాయక్.. తర్వాత ప్రకటించిన రాథేశ్యామ్, బంగార్రాజు బరిలో నిలిచాయి.. కానీ ఈ రేస్ లో భీమ్లానాయక్ ని తప్పించడంలో కీలక పాత్ర పోషించారు నిర్మాత దిల్ రాజు.. రిలీజ్ డేట్స్ ప్రకటించిన తర్వాత రాయబారాలు నడిపారు. ఆర్. ఆర్.ఆర్. కి భీమ్లానాయక్ కి దిల్ రాజు నైజాం డిస్ట్రిబ్యూటర్ అవడంతో బాల్ దిల్ రాజు కోర్ట్ లో పడింది. భీమ్లానాయక్ వాయిదాతో ఫ్యాన్స్ అందరూ పూర్తిగా నిరాశ చెందారు.

Also Read: సత్తాచాటుతున్న టాలీవుడ్.. ఆందోళనలో బాలీవుడ్..!

క్షమించండి: భీమ్లానాయక్‌ నిర్మాత

నా చేతిలో ఏమీ లేదు.. క్షమించండి. నా హీరో పవన్‌కల్యాణ్‌ గారి మాటను గౌరవించాను అని అంటున్నారు నిర్మాత సూర్యదేవర నాగవంశీ. పవన్‌కల్యాణ్‌, రానా హీరోలుగా సాగర్‌.కె.చంద్ర దర్శకత్వంలో నాగవంశీ నిర్మించిన భీమ్లా నాయక్‌ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల కావాల్సి ఉంది. అయితే సంక్రాంతి బరిలో భారీ చిత్రాలు పోటీ పడుతుండడంతో ఆరోగ్యకరమైన వాతావరణం కోసం పవన్‌కల్యాణ్‌, నిర్మాణ సంస్థ తమ సినిమా విడుదలను ఫిబ్రవరి 25కు వాయిదా వేశారు. ఈ మేరకు రాజమౌళి కూడా అభినందిస్తూ ట్వీట్‌ చేశారు. అయితే నిర్మాత నాగవంశీ భీమ్లానాయక్‌ విడుదల వాయిదా కారణంగా అభిమానులను క్షమాపణ కోరుతూ ఓ ట్వీట్‌ చేశారు.  మా హీరో పవన్‌కల్యాణ్‌గారి మాటలకు గౌరవించి సినిమాను వాయిదా వేశాం. ఎందుకంటే కల్యాణ్‌గారు ఇండస్ట్రీ మంచి కోసం ఆలోచించే వ్యక్తి. ఫిబ్రవరి 25న శివరాత్రికి ప్రేక్షకుల అందరినీ అలరిస్తాం అని ఆయన ట్వీట్‌ చేశారు.

జక్కన్న, ప్రభాస్ అండర్ స్టాండింగ్

బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మలిచిన రాజమౌళితోనే యంగ్ రెబల్ స్టార్ తలపడుతున్నాడంటూ చర్చలు సాగుతున్నాయి. తమ మధ్య ఎలాంటి పోటీ లేదని, అండర్ స్టాండింగ్ తోనే తమ సినిమాలు రిలీజ్ చేసుకుంటున్నమని వారిద్దరూ తమ సన్నిహితుల మధ్య చెప్పుకుంటున్నట్లు తెలిసింది. ఈ సీజన్లో బాలీవుడ్ లో పెద్ద సినిమాలు లేకపోవడం వీరిద్దరికీ కలిసి వచ్చిన అంశం. మరో డేట్ కి ఈ రెండు సినిమాల్లో ఏ ఒక్క దానిని వాయిదా వేసినా కలెక్షన్ల పరంగా ఇబ్బందులు తప్పవు. అందుకే ఈ ఇద్దరూ ఒక అవగాహనకు వచ్చాకే రిలీజ్ డేట్ లో కన్ఫాం చేసుకున్నారని తెలుస్తున్నది.

-శెనార్తి… 

Also Read: తగ్గేదే లే అంటున్న అల్లు ఫ్యామిలి… పోటీకి సై అంటున్న తండ్రి, కొడుకు