-ప్రీ రిలీజ్, ఆడియో రిలీజ్ ఫంక్షన్లకు వెళ్తున్న అభిమానులకు కానుకగా లాఠీ దెబ్బలు
-సినిమా హైప్ పెంచేందుకు వేదికల కెపాసిటీకి మించి ఎంట్రీ పాస్ ల జారీ
-గందరగోళం మధ్య ముగుస్తున్న ఈవెంట్లు..
సినిమా హీరోల కోసం అభిమానులు ఆగమవుతున్నారు. ఆడియో రిలీజ్ ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు వెళ్తున్న అభిమానులు బలవుతున్నారు. ఆయా ఫంక్షన్లలో ఈవెంట్ నిర్వాహకులు సరైన ఏర్పాట్లు చేయపోవడంతో అభిమానులు అవస్థలు పడుతున్నారు. వేదిక కెపాసిటీకి మించి పాస్ లు ఇస్తున్నారు. కనీసం కూర్చోవడానికి కుర్చీలు కూడా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. వేదికలో నిల్చుంటున్న అభిమానులపై పోలీసులు లాఠీ చార్జి చేస్తుండడంతో ఈవెంట్ కాస్త గందళరగోళంగా మారుతున్నది. తమ అభిమాన హీరోల కోసం వేలాది రూపాయలు ఖర్చు పెట్టుకొని వస్తున్న అభిమానులకు లాఠీ దెబ్బలు తప్పడం లేదు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న తతంగాన్ని అటు హీరోలు, ఇటు నిర్మాతలు, ఈవెంట్ నిర్మాతలు పట్టించుకోవడం లేదు. ఈవెంట్ గందరగోళ పరిస్థితిని తమ సినిమాకు హైప్ తెచ్చే పబ్లిసిటీగా వాడుకుంటున్నారు. అభిమానులు ఏమైపోతే మాకేంటి అనే విధంగా హీరోలూ వ్యవహరిస్తున్నారు. కానీ స్టేజీ మీద మాత్రం అభిమానులే మా దేవుళ్లు అంటూ సినిమాల్లో కంటే ఎక్కువగా బయటే నటిస్తున్నారు. నిన్న జరిగిన రాధేశ్యామ్, మొన్నటి అల్లు అర్జున్ పుష్ప సినిమా ఈవెంట్లే ఇందుకు ఉదాహరణ. కెపాసిటీకి మించి ఎంట్రీ పాస్ లు జారీ చేస్తుండడంతో గందరగోళ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అభిమానులు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లపై ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రజలూ అవస్థలు పడుతున్నారు.
ఇద్దరు టాప్ హీరోలు కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమా ఆడియో ఫంక్షన్ కోసం ఓ అభిమాని ఎంట్రీ పాస్ కోసం మరో వ్యక్తిని పెన్ తో గొంతు పై కోశాడు. ఈ ఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. ఇలాంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి. గతంలో పెద్ద హీరోల సినిమాలకు సంబంధించి ఏ ఫంక్షన్ చేసినా ఎంచుకున్న వేదిక కెపాసిటీ మేరకు అభిమానులకు ఆహ్వానాలు పంపించే వారు. దీంతో ప్రశాంతంగా ఈవెంట్లు ముగిసేవి. సినిమాకు హైప్ తెచ్చేందుకు పబ్లిసిటీ స్టంట్ ను ఎంచుకున్నారు. గుడ్ ఆర్ బ్యాడ్ ఏదైనా సరే తమ సినిమా గురించి జనాల్లోకి వెళ్లేలా చూసుకుంటున్నారు. ఇదేమీ గమనించని అభిమానులు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు.
విక్టరీ వెంకటేష్, సూపర్ స్టార్ మహేశ్ బాబు కాంబినేషన్ లో వచ్చిన సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ఆడియో రిలీజ్ గందరగోళంగానే మారింది. ఇద్దరు టాప్ హీరోలు నటిస్తున్న చిత్రం కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో వచ్చారు. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేయకపోవడంతో తమ చేతిలో ఎంట్రీ పాస్ లు ఉన్నా కూడా అభిమానులు వేదిక లోపలికి వెళ్లకుండా బయటే ఉండిపోయారు. ఎంట్రీ పాస్ లు ఎందుకు ఇచ్చారంటూ అభిమానుల మండిపడ్డారు. అలాగే పవర్ స్టార్ పవన్ కల్యాణ్ , విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో వచ్చిన గోపాల గోపాల సినిమా ఆడియో రిలీజ్ ఈవెంట్ కూడా ఇలాగే జరిగింది. ఈ చిత్రంలోనూ ఇద్దరు టాప్ హీరోలు కలిసి నటించిన చిత్రం కావడంతో అభిమానులు పెద్ద సంఖ్యలో వేదిక వద్దకు చేరుకున్నారు. నిర్ణీత సమయానికి ముందే అభిమానులతో వేదిక నిండిపోయింది. చేతిలో ఎంట్రీ పాస్ లు ఉన్నా కూడా వందలాది మందిని లోపలికి అనుమతించలేదు. అభిమానులను లోపలికి వెళ్లకుండా పోలీసులు లాఠీలకు పని చెప్పి చెదరగొట్టారు. ఇదే ఫంక్షన్ కు వచ్చిన ఓ అభిమాని ఎంట్రీ పాస్ కోసం మరో వ్యక్తి తో గొడవపడ్డాడు. అతని నుంచి ఎంట్రీ పాస్ లాక్కునేందుకు పెన్ తో గొంతు పై కోశాడు. దీంతో ఒక్కసారిగా అక్కడ గందరళగోళం నెలకొంది. ఇలా పెద్ద హీరోల సినిమాల ఈవెంట్లు గందరగోళంగానే ఉంటున్నాయి.
-డార్లింగ్ ఈవెంట్లన్నీ ప్లాఫే..
ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన రెబల్ స్టార్ ప్రభాస్ ఈవెంట్లన్నీ ప్లాఫ్ గానే మిగులుతున్నాయి. రెబల్ సినిమా నుంచి ఇదే పరిస్థితి ఎదురవుతున్నది. లారెన్స్ దర్శకత్వంలో తమ సొంత నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్ లో రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రభాస్ తో తీసిన రెబల్ సినిమాకు ఇదే పరిస్థితి ఎదురైంది. అప్పటికే కాంచన సిరీస్ తో ఫామ్ లో ఉన్న లారెన్స్, డార్లింగ్, మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాల హిట్లతో ప్రభాస్ కాంబినేషన్ సినిమా కావడం, కృష్ణంరాజు కూడా ఒక ముఖ్య పాత్ర పోషించడంలో రెబల్ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కాగా అప్పటికే ఆ సినిమా చిత్రీకరణ పూర్తి కావడానికి రెండేళ్లు కావడంతో మరింత హైప్ క్రియేట్ చేయడానికి ఆడియో ఫంక్షన్ భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. అభిమానులకు ఆహ్వానాలు పంపడంతో వేలాదిగా తరలివచ్చారు. దీంతో వేదిక కెపాసిటీ మించి అభిమానులు రావడంతో వారిని చెదరగొట్టేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. ఆ సినిమా ప్లాఫ్ కావడంతో వెంటనే మరో సినిమా రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేశాడు ప్రభాస్. తన మిత్రులు తీసిన యూవీ క్రియేషన్స్ బ్యానర్ లో మిర్చి సినిమా తీశాడు. అభిమానుల్లో జోష్ నింపడానికి ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. నానక్ రామ్ గూడలోని ఓ స్టూడియోలో ఫంక్షన్ ఏర్పాటు చేసి అభిమాలను పిలిపించారు. వేదిక కెపాసిటీకి మంచి అభిమానులు వచ్చారు. ఫంక్షన్ ప్రారంభమై గంట కూడా కాకముందే పోలీసులు అభిమానులపై లాఠీ ప్రయోగించారు. దీంతో ఫంక్షన్ అర్ధాంతంగార ముగిసే పరిస్థితులు కనిపించడంతో హీరో కృష్ణంరాజు స్వయంగా స్టేజీ పైకి వచ్చి అభిమానులను ఏమీ అనవద్దని పోలీసులకు చెప్పాల్సి వచ్చింది. అభిమానులు శాంతించాలని ఆయన కోరడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.
టాలీవుడ్ టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి, ప్రభాస్, రానా కాంబినేషన్ లో వచ్చిన బాహుబలి సినిమాల ఈవెంట్లకు కూడా ఇదే పరిస్థితి. ఇద్దరు పెద్ద హీరోలు నటించడం, రాజమౌళి దర్శకుడు కావడంతో అభిమానులు వేలాదిగా తరలివచ్చారు. దీంతో ఈ సినిమాలకు కూడా అభిమానుల వీపు విమానం మోత మోగింది. బాహుబలి సిరీస్ విజయం తర్వాత ప్రభాస్ ఇమేజ్ ఒక్కసారిగి పెరిగింది. వాటి తర్వాత వచ్చిన సాహో సినిమా పై కూడా భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేస్తే ఇదే పరిస్థితి. మళ్లీ అభిమానులే బలయ్యారు.
రెండేళ్ల తర్వాత వస్తున్న ప్రభాస్ సినిమా రాధే శ్యామ్ పాన్ ఇండియా స్థాయిలో నిర్మించడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకు తగ్గట్టుగా ఈవెంట్ ప్లాన్ చేసినా మళ్లీ దెబ్బ పడింది అభిమానులకే. రామోజీ ఫిలిం సిటీ లో భారీ అభిమానులతోనే టీజర్ రిలీజ్ అంటూ ప్రచారం చేశారు. 40 వేల మందికి అనుమతి అని ప్రకటించి, అంతకు రెట్టింపు సంఖ్యలో ఎంట్రీ పాస్ లు ఇచ్చారు. కనీసం కూర్చోవడానికి కుర్చీల్లేక అభిమానులు హోర్డింగ్ లపై కూర్చున్నారు. ఈ క్రమంలో పోలీసులు లాఠీ చార్జి చేయగా అభిమానులు అక్కడి నుంచి పరుగులు తీశారు. దీంతో హోర్డింగ్ లు విరిగిపడ్డాయి. వాటిపై కూర్చున్న ముగ్గురికి గాయాలయ్యాయి. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈవెంట్ కూడా గందరగోళం మధ్యనే ముగిసింది. ఓ ఇద్దరు అభిమానుల పేర్లు చెప్పి హీరో కృష్ణంరాజే ట్రైలర్ రిలీజ్ చేసి వెళ్లిపోయారు. ఇలా డార్లింగ్ ఈవెంట్లన్నీ ప్లాఫ్ గా మిగిలిపోతున్నాయి. ఇక నైనా పర్ఫెక్ట్ ప్లానింగ్ తో ఈవెంట్లు చేసుకోవాలని, సినిమా హైప్ పెంచేందుకు తమను బలి చేయవద్దంటూ అభిమానులు కోరుతున్నారు.
-శెనార్తి…