Illegal Relations: దారం ఉన్న గాలిపటం ఎలా ఉంటుంది? మన చెయ్యి నియంత్రిస్తుంది కాబట్టి అది సవ్య దిశలో వెళ్తుంది. అదే ఒక్కసారి ఆ గాలిపటానికి దారం తెంపి చూడండి.. స్వేచ్ఛగా విహరిస్తున్నట్టు కనిపిస్తుంది. కానీ ఓ దిశ, దశ అంటూ లేకుండా ఏ కొమ్మకో, రెమ్మకో చిక్కుకుపోతుంది. మనిషి జీవితం కూడా గాలిపటం లాంటిదే. బంధాలు, అనుబంధాలు దారం లాంటివి.. అవి నియంత్రిస్తున్నా కొద్దీ గమనం సవ్య దిశలో ఉంటుంది. లేకుంటే తెగిన గాలిపటంలా జీవితం అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నది. వెనుకటి తరాన్ని ఒక్కసారి పరిశీలించి చూస్తే ఇంట్లో అమ్మానాన్న, కొడుకు, కోడలు, వారి పిల్లలు, పండుగలకు పబ్బాలకి వచ్చిపోయే బంధువులు.. ఒకరకంగా చెప్పాలంటే ఇల్లు ఒక స్వర్గంలా ఉండేది. కానీ ఇప్పుడు ఉద్యోగాలు, ఉపాధి పేరుతో కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయాయి. ఫలితంగా ఎవరికివారు విడిగా ఉంటున్నారు. బంధాలు, అనుబంధాల్లో చిక్కదనం లోపించి రెడీమేడ్ వంటకాల మాదిరిగా తయారయ్యాయి. సాంకేతిక పరిజ్ఞానం మన జీవితాల్లోకి మరింత వేగంగా చొచ్చుకు రావడంతో మనుషులతో మనుషులు మాట్లాడుకోవడం తగ్గింది. సామాజిక మాధ్యమాల్లో గడపడం ఎక్కువైపోయింది. ఈ సమయంలోనే కొత్త కొత్త పరిచయాలు మనుషులను మరో మార్గం వైపు నడిచేలా చేస్తున్నాయి. దీనివల్లే పెడ ధోరణులు మొదలవుతున్నాయి.

_ నిబద్ధత లేకుండా కలిసి ఉంటున్నారు
ఒక మనిషి తప్పులను యధాతంగా అంగీకరించేదే ప్రేమ. ఆ ప్రేమ ఉంటేనే ఎదుటి మనిషితో మనం ప్రయాణం సాగించగలం. కానీ ఎటువంటి ప్రేమ లేకుండా ఎదుటి మనిషితో ఉండటం సాధ్యమేనా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానం చెబుతోంది ఇప్పటి మిలినియల్ తరం. మాట హలో అనడం, తనువు చలో అనడం, ఆ తర్వాత మాటల్లో తేడా వస్తే బాయ్ బాయ్ చెప్పుకోవటం.. ఇప్పుడు ఇదే ట్రెండ్. దీనికి ఈ తరం పెట్టుకున్న పేరు సిచువేషన్ షిప్. తెలుగులో చెప్పాలంటే ఎదుటి వ్యక్తిపై ఎటువంటి నిబద్ధత లేకుండా సంబంధాన్ని కొనసాగించడం. దీనివల్ల సమాజంలో పెడధోరణులు పెరిగిపోయే ప్రమాదం ఉంది. ఈ ఆర్టికల్ మొదట్లో చెప్పుకున్నట్టు ఉమ్మడి కుటుంబాలు అంతరించిపోయి, చిన్న కుటుంబాలు పెరిగిపోవడం.. ఒకరిపై ఒకరికి అజమాయిషి లేకపోవడంతో ఈ తరహా బంధాల వైపు త్వరగా ఆకర్షితులవుతున్నారు. హైదరాబాదులోని ఐటి కంపెనీలో మేనేజర్ గా పని చేస్తున్న ఓ యువకుడికి ఆన్లైన్ లో ఓ యువతి పరిచయమైంది. అది కాస్త ఫోన్ నెంబర్లు ఇచ్చుకునే దాకా వెళ్ళింది. ఇద్దరికీ మాటా మాటా పెరగడంతో ఓకే ఫ్లాట్లో ఉన్నారు. ఎటువంటి ప్రేమ లేకుండానే శారీరక సంబంధం పెట్టుకున్నారు. తర్వాత ఈ బంధంపై మొహం మొత్తిందేమో తర్వాత టాటా చెప్పుకున్నారు. ఇలాంటి తరహా బంధాల వైపు యువత ఆకర్షితులు అయ్యేందుకు ప్రధాన కారణం వారికి కుటుంబం గురించి తెలియకపోవడమే. పైగా చిన్న కుటుంబాల వల్ల పెద్దల అనుభవాల సారం ఈ తరానికి తెలిసే అవకాశం ఉండటం లేదు. దీంతో వారికి అనుబంధాల మీద నమ్మకం ఉండటం లేదు. మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం వారి ఆలోచనలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. అందువల్లే వారు జీవితాన్ని అంత సీరియస్ గా తీసుకోలేకపోతున్నారు. ఏదైనా సరే క్షణాల్లో జరిగిపోవాలని కోరుకుంటున్నారు. దీనివల్ల ఆ సమయం వరకే వారు ఆనందాన్ని అనుభవిస్తున్నారు.
_ పాశ్చాత్య సంస్కృతి చొచ్చుకు వస్తోంది
అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఇటువంటి సంస్కృతి ఎక్కువగా ఉంటుంది. దురదృష్టవశాత్తు మనదేశంలో కూడా ఇటువంటి సంస్కృతి విస్తరించడం బాధాకరం. ఎక్కడిదాకో ఎందుకు హైదరాబాదులోని ఉస్మానియా యూనివర్సిటీ పక్కనే ఉన్న ఇఫ్లూ లో చదివేందుకు విదేశాల నుంచి యువతీ యువకులు వస్తుంటారు. వారు ఒకటే గదిలో కలిసి ఉంటారు. ఒకరకంగా చెప్పాలంటే పెళ్లి తప్ప మిగతా అన్ని బంధాలు ఏర్పరచుకుంటారు. తర్వాత మాటల్లో ఏదైనా తేడా వస్తే వెంటనే కటీఫ్ చెప్పుకుంటారు. ఇలాంటి అనుబంధాలను చూస్తూ ఇక్కడి వాళ్ళు కూడా వాటి వైపు ఆకర్షితులవుతున్నారు. అందుకే ఈ తరంలో యువతకు పెళ్ళి చేయాలనే నిర్ణయాన్ని తల్లిదండ్రులు వాళ్ళ ఇష్టానికే వదిలేస్తున్నారు. ఒకప్పుడు పెళ్లిచూపుల సమయంలో మీరేం చదువుకున్నారు, ఏం చేస్తుంటారు, మీ కుటుంబ నేపథ్యం ఏంటి అనే ప్రశ్నలు వేసేవారు. కానీ ఇప్పుడు వాటి స్థానంలో మీరు గతంలో ఎవరితోనైనా రిలేషన్ షిప్ లో ఉన్నారా అనే ప్రశ్న ఎదురవుతుంది. దీనిని బట్టి పరిస్థితి ఎంత తీవ్రంగా మారిందో అర్థం చేసుకోవచ్చు. చివరగా చెప్పొచ్చేది ఏంటంటే ప్రపంచంలో అన్ని దేశాల కంటే భారతీయ సంస్కృతి చాలా గొప్పది. భారతదేశాన్ని వసుదైక కుటుంబం అని కూడా పిలుస్తుంటారు. మన కుటుంబం మూలాలు అంత బలంగా ఉన్నాయి కాబట్టే ఆ నానుడి పుట్టింది. దురదృష్టవశాత్తు సాంకేతిక పరిజ్ఞానం వల్ల మనిషి ఆలోచన విధానం మారి నిబద్ధతలేని బంధాలు పుట్టుకొస్తున్నాయి. దీనివల్ల కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం అవుతున్నది. దీని నివారణకు చేసేది ఏమీ ఉండదు. చేయాల్సిందల్లా ఒక్కటే, మార్చుకోవాల్సిందల్లా ఒక్కటే.. అదే మనిషి ఆలోచన విధానం. ఎంత ఎత్తు ఎదిగినా, ఎన్ని కోట్లు సంపాదించినా మన కాళ్లు భూమ్మీదనే ఉండాలి. అప్పుడే మనం సంఘజీవులం అవుతాం. ఏర్పరచగలుగుతాం. లేకుంటే మనుషులకు, జంతువులకు పెద్దగా తేడా ఉండదు. ఇంకా పచ్చిగా చెప్పాలంటే తెగిన గాలిపటం అవుతాం. తెగిన గాలిపటం గమనం ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.