Chinna Jeeyar Swamy: చినజీయర్ స్వామికి కాలం కలిసిరావడం లేదు. హైదరాబాద్ లో సమతామూర్తి విగ్రహాన్ని ఆవిష్కరించినప్పటి నుంచి ఆయన ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉంటున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోడీతో ‘సమతామూర్తి రామానుజం’ దేవాలయాన్ని ప్రారంభింపచేశారు చినజీయర్ స్వామి. కానీ ఈ ఆలయానికి హైదరాబాద్ శివారులో అన్ని సౌకర్యాలు కల్పించిన కేసీఆర్ పేరును శిలాఫలకంపై కూడా పెట్టకపోవడంతో గులాబీ బాస్ అలిగారని.. చినజీయర్ ను దూరం పెట్టారని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.
ఈక్రమంలోనే కేసీఆర్ తో తనకు విభేదాలు ఏమీ లేవని చినజీయర్ స్వామి స్వయంగా వివరణ కూడా ఇచ్చుకున్నారు. అయితే భగవంతుడి సేవకు ఎవరైనా రావచ్చని.. రాజకీయాలు చేయవద్దన్న ఆయన మాటలు టీఆర్ఎస్ వర్గాల్లో పుండుమీద కారం చల్లినట్టైంది.ఆ వివాదం ఇంకా రగులుతూనే ఉందని.. ఇప్పటికే కేసీఆర్,చినజీయర్ స్వామి మాట్లాడుకోవడం లేదని ప్రచారం సాగుతోంది.
కేసీఆర్ తో విభేదాలు సమసిపోకముందే తాజాగా మరో వివాదంలో చినజీయర్ స్వామి ఇరుకున్నారు. అద్వైతం గురించి, జగద్గురు గురించి ఆయన చేసిన వ్యాఖ్య పెద్ద వివాదమే సృష్టించింది. చినజీయర్ స్వామికి పరిపూర్ణనంద స్వామి సహా శృంగేరి ఉభయ రాష్ట్రాల సంచాలకులు ఘాటు కౌంటర్లు ఇవ్వడంతో ఈ వివాదం మరింత ముదిరింది.
-చినజీయర్ స్వామి ఏం మాట్లాడారు?
ప్రపంచంలో ఎందరో గురువులున్నారు. జగద్గురు అనే పేరుతో పిలువబడుతున్నారని.. కానీ ఒక్క గురువే అందరికీ గురువు అని చినజీయర్ అన్నారు. ‘రామానుజాచార్యులు మాత్రమే జగద్గురు అని.. వేంకటేశ్వర స్వామికి కూడా రామానుజాచార్యులు గురువు కాబట్టి ఆయన మాత్రమే జగద్గురువు అని అన్నారు. కొంతమంది జగద్గురు అని పేరు పెట్టుకుంటారని.. వీధికో జగద్గురు ఉంటారని.. ఆ జగద్గురులకు అస్సలు పడదని.. జగత్ లు ఎన్ని ఉంటాయో తెలియదని.. వాళ్ల జగత్ ఏదో.. వీళ్ల జగత్ ఏదో తెలియదని చినజీయర్ అన్నారు. మనుషుల్లో కొందరికి మాత్రమే కొందరు గురువులు అవుతారని.. భగవంతుడు వేంకటేశ్వరస్వామికి గురువైన రామానుజులు వారే జగద్దురు అని అనడం వివాదానికి కారణమైంది.
ఆదిశంకరులు, రామానుజులు, మద్వాచార్యులు జగద్గురులు అని.. వీరిని కాదన్న చినజీయర్ స్వామిని ఖండించాల్సిందేనని స్వామి పరిపూర్ణానంద స్వామి స్పష్టం చేశారు. ముగ్గురిని అందించిన భారతమాత విశ్వగురువు అని అన్నారు. జగద్గురు అంటే వివాదరహిత అంశమని.. కానీ చినజీయర్ స్వామి మాత్రం వారిని విమర్శించడాన్ని ఖండించారు. జగద్గురు వివాదాన్ని రాజేయవద్దని.. అర్థరహితంగా మాట్లాడవద్దని.. వేదికలపై మాట్లాడి ఏదో సాధించాలన్న ప్రయత్నాలు చేయవద్దని.. అందరి మనసులు బాధపడుతున్నాయని చినజీయర్ స్వామికి పరిపూర్ణానంద స్వామి ఎద్దేవా చేశారు.
అద్వైతం పై చినజీయర్ స్వామి వివరణను పరిపూర్ణానంద స్వామి ఖండించారు. అద్వైతం అంటే జగమే మాయ.. బతుకే మాయ అని చినజీయర్ స్వామి అన్నారని.. అధ్వైతం అంటే శ్రీకృష్ణ పరమాత్ముడు మనకు ఏదైతే బోధించాడో.. ‘నాకంటే ఈ శక్తిలో ఏదీ సత్యం కాదని’ అర్థమని.. కనిపించేవన్నీ కూడా మిథ్య అని స్పష్టం చేశారు. కాలానికి ఏ రకమైన భేదం లేదని.. దానికి ధర్మం, నియమం ఉందని.. జగత్ అనేది నీటి మీద పుట్టిన బుడగలాంటిదని.. ఎలా పుట్టిందో అలానే పోతుందని అన్నారు. ఆదిశంకరాచార్యులు లాంటి వారు అద్వైతం గురించి ‘జగమే మాయ.. బతికే మాయ’ అని చెప్పలేదని.. అద్వైతాన్ని చినజీయర్ స్వామి సరిగ్గా అర్థం చేసుకోలేదని పరిపూర్ణానందస్వామి విమర్శించారు.
శృంగారీ పీఠం సంచాలకులు బంగారయ్య శర్మ కూడా చినజీయర్ స్వామి వ్యాఖ్యలను తప్పుపట్టారు. జగద్గురు అంటే చరిత్ర నుంచి వచ్చిందని.. చినజీయర్ స్వామి చెప్పడం వల్లే రాలేదని బంగారయ్య శర్మ విమర్శించారు. జగద్గురు శబ్ధం కృతాయుగం నుంచి మొదలైందని.. దత్తాత్రేయుడు, వశిష్టుడు, శ్రీకృష్ణుడు, ఆదిశంకరాచార్యులకు ‘జగద్గురు’ పేర్లు వచ్చాయని.. కలియుగంలోకి వచ్చిన రామానుజచార్యులకంటే ముందే జగద్గురులు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు. చినజీయర్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు.
Also Read: ఉక్రెయిన్ కు ఊతమిచ్చే దేశాలేవి? రష్యాకు భయపడేనా?
ఇలా జగద్గురుగా కేవలం ‘రామానుజాచార్యుల’ను మాత్రమే చినజీయర్ స్వామి చెప్పడాన్ని పరిపూర్ణానందస్వామి, బంగారయ్య స్వామి సహా వివిధ గురువులు, స్వాములు తప్పుపడుతున్నారు. చరిత్రను వక్రీకరిస్తూ తప్పుదోవ పట్టిస్తూ చినజీయర్ స్వామి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ తో వివాదాన్ని పెట్టుకున్న చినజీయర్ స్వామి.. ఇప్పుడు తోటి స్వాములతోనూ ‘జగద్గురు’ వివాదాన్ని పెట్టుకోవడం హాట్ టాపిక్ గా మారింది.
Also Read: ఉక్రెయిన్ పై యుద్ధంతో రష్యా ఏకాకిగా మిగులుతోందా?
Recommended Video: