తమకు వ్యతిరేకంగా సినిమాలో ఎలాంటి సన్నివేశం కనిపించినా.. డైలాగ్ వినిపించినా.. మనోభావాలను గాయపరుచుకునే బ్యాచ్ ఈ మధ్య దేశవ్యాప్తంగా తయారైంది. పలానా సినిమాలో తమ కులాన్ని కించపరిచారనో.. తమ మతానికి తప్పుడు అర్థాలు తీశారనో.. ప్రాంతాన్ని, భాషను, యాసను హబ్బో.. ఇలా ఎన్ని కారణాలు ముందుకు వస్తాయో చెప్పలేని పరిస్థితి. మాట్లాడితే.. మనోభావాలను విరిచేసుకొని, బట్టలు చించేసుకొని రోడ్డున పడిపోవడం చాలా ఎక్కువైపోయింది. అయితే.. ఇదంతా పక్కా ప్రణాళిక ప్రకారం జరుగుతోందన్నది చాలా మంది మేధావులు చేస్తున్న విమర్శ.
ఇలా ఆందోళనలతో బెదిరించడం ద్వారా.. థియేటర్లపై దాడులు చేయడం, సినిమా ప్రదర్శనలను అడ్డుకోవడం, షూటింగులను నిలిపేయడం వంటి చర్యల ద్వారా.. భవిష్యత్ లో ఆయా వర్గాలకు సంబంధించి ఎలాంటి విమర్శలూ చేయకూడదనే సంకేతాలు ఇస్తున్నారన్నమాట. దీంతో.. సినిమా తీయాలంటేనే మేకర్స్ ఒకటికి వందసార్లు ఆలోచించుకోవాలని పరోక్షంగా చెబుతున్నారన్నమాట. ఫలితంగా.. ఎందుకొచ్చిన తంటా అని నిర్మాతలు, దర్శకులు వెనకడగు వేస్తారనేది వారి నమ్మకం.
ఇప్పటి వరకూ సాగుతున్న ఈ తరహా బెదిరింపులు సరిపోవని అనుకుందో ఏమోగానీ.. కేంద్ర ప్రభుత్వమే నేరుగా రంగంలోకి దిగింది. ఇప్పటి వరకూ సినిమాలకు సెన్సార్ బోర్డు సినిమాలను చూసి, వివాదాస్పద అంశాలు ఏమైనా ఉంటే కత్తిరింపులు వేసి, సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ వస్తోంది. అంటే.. ఆ సినిమాను ఇక చట్ట ప్రకారం ఎవ్వరూ అడ్డుకోవడానికి వీళ్లేదని అర్థం. అలా అడ్డుకుంటే కేసులు కూడా పెట్టొచ్చు. అయినప్పటికీ.. మూక దాడులు యథేచ్చగా సాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా కేంద్రం పూర్తి అధికారాలు తన చేతుల్లోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తోంది.
ఇందుకోసం సెన్సార్ బోర్డు చట్టంలో పలు సవరణలు చేసేందుకు సిద్ధమైంది. ఇందులో అతి ప్రధానమైనది ‘‘రివిజన్ ఆఫ్ సర్టిఫికేషన్.’’ దీని ఉద్దేశం సూటిగా చెప్పాలంటే.. ఒక సినిమా విడుదలను కేంద్ర ప్రభుత్వం ఏ కారణం చేతనైనా విడుదల కాకుండా అడ్డుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం అంటే.. అక్కడ ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్లే కదా. సో.. ఆ పార్టీకి నచ్చని విధంగా సినిమా తీస్తే.. వారి భావాలకు భిన్నంగా సినిమా తెరకెక్కితే.. వెంటనే కత్తిరించి పారేస్తారన్నమాట. ఈ చట్టం అమల్లోకి వస్తే.. కేంద్రం నిర్ణయాన్ని ఆపడం ఎవరికీ సాధ్యం కాదు.
ఇప్పటికే.. సోషల్ మీడియాను, మీడియాను నియంత్రించేందుకు కేంద్రం ఎన్నో ప్రయత్నాలు చేస్తోందని, తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం కాకుండా చూస్తోందనే ఆరోపణలు దేశవ్యాప్తంగా ఉన్నాయి. ఇక, ఇప్పుడు సినిమాలను సైతం పూర్తి స్థాయిలో కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తోందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ… వేలాది మంది సినీ ప్రముఖులు సంతకాలు చేసిమరీ తమ నిరసన తెలిపారు. మరి, కేంద్రం పునరాలోచిస్తుందా? బలం ఉంది కాబట్టి.. ముందుకే సాగుతుందా? అన్నది చూడాల్సి ఉంది.