Iran Womens: యుక్త వయసుకు వచ్చాక.. ప్రతీ నెల మూడు నుంచి నాలుగు రోజులు రక్తస్రావం అవుతుంది. అలా 60 ఏళ్ళు వచ్చేవరకు వాళ్లు రక్తాన్ని స్రవిస్తూనే ఉండాలి. ఒక వయసుకు వచ్చాక పెళ్లి అవుతుంది. తర్వాత ఆమె గర్భం దాల్చుతుంది. ఇలా ఒకటి కాదు రెండు కాదు లెక్కకు మిక్కిలి సార్లు గర్భం దాల్చాలి. ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పినా వినిపించుకునే ఓర్పు మగవాడికి ఉండదు. ఇన్ని త్యాగాలు చేసినా.. ఆమెకు గుర్తింపు అనేది కల్ల. పైగా ఆమె ధరించే వస్త్రాల నుంచి మొదలుపెడితే దువ్వుకునే జుట్టు వరకు అన్నింటా పురుషుడి పెత్తనమే. దశాబ్దాలుగా ఆమె ఈ నరకాన్ని చవి చూస్తూనే ఉంది. అందుకే తనకు స్వేచ్ఛ, స్వతంత్రం కావాలని పోరాడుతోంది. ఆమె తిరుగుబాటును సహించలేని పాలకుడు అణచివేసేందుకు చేయని ప్రయత్నం అంటూ లేదు. అయినప్పటికీ ఆమె జ్వాల శిఖలాగా రగులుతూనే ఉంది. ఇదంతా చదువుతుంటే రక్తం మరుగుతోందా, రోమాలు నిక్కబొడుస్తున్నాయా, మనం స్వేచ్ఛగా జీవిస్తున్న సమాజంలో ఇలాంటి ప్రపంచం కూడా ఉందా అని ఆవేదన కలుగుతోందా? .. అయితే ఈ ఆర్టికల్ చివరి వరకు చదవండి.. మీకు తెలియని చరిత్ర.. ఆ చరిత్ర వల్ల భంగపడుతున్న అతివలు.. ఎంతో మంది మీకు కనిపిస్తారు.
..
1979 నుంచి..
..
మేము హిజాబ్ ధరించబోమంటూ ఇరాన్ మహిళలు గత కొద్ది రోజులుగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నారు. ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో ఇప్పటివరకు 50 మంది మహిళలు చనిపోయారు. కానీ ఇరాన్ లో హిజాబ్ వివాదం ఈనాటిది కాదు. 1979లో ఇస్లామిక్ ప్రతిఘటన తర్వాత అయతుల్లా ఖోమేనీ ఇస్లామిక్ మహిళల వస్త్రధారణపై కఠిన నిబంధనలు అమలు చేశాడు. దీనిని అప్పట్లో మహిళలు తీవ్రంగా నిరసించారు. అయినప్పటికీ వెనక్కి తగ్గని సర్కారు.. బహిరంగ ప్రదేశాల్లో జుట్టును హిజాబ్ తో కప్పి ఉంచని మహిళలకు 74 కొరడా దెబ్బలను శిక్షగా విధించాలని 1983లో నిర్ణయించింది. 1995లో ఈ శిక్ ను సవరించి హిజాబ్ ధరించని మహిళలకు రెండేళ్లపాటు జైలు శిక్ష విధించేలా మార్పులు చేసింది. ఇలా నాలుగు దశాబ్దాలకు పైగా ఇరాన్ మహిళలు హిజాబ్ కు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. గత ఏడాది 31 ఏళ్ల విదా మొవాహెద్ అనే మహిళ టెహ్రాన్ లోని ఎంఘెలాబ్ లో ఒక కర్రకు హిజాబ్ ను వేలాడదీసి నిరసన తెలిపింది. మొరాలిటీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ ఏడాది జనవరి 30న నర్గీస్ హుస్సేనీ అనే మహిళ కూడా ఇదే తీరుగా నిరసన తెలిపితే మొరాలిటీ పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. పోలీసులు అరెస్టులు చేస్తున్నా నిరసనలు ఆగడం లేదు. దీంతో హిజాబ్ ధరించని మహిళలకు కఠిన శిక్షలు విధించేలా గత నెల 15న ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ ఒక డిక్రీ జారీ చేశారు. ఈ డిక్రీ పై ఆగ్రహావేశాలు పెల్లు బుకుతున్న సమయంలో హిజాబ్ సరిగా ధరించలేదని అమినీ అనే యువతిని మొరాలిటీ పోలీసులు అరెస్టు చేయగా.. ఆమెకు గుండె పోటు రావడంతో కోమాలోకి వెళ్ళింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించింది. ఆమె మరణం తర్వాత ఇరాన్ లో నిరసనలు మరింత పెరిగాయి.
..
పాలనపరమైన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు
..
ప్రస్తుతం ఇరాన్ అధిక ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ ఆంక్షలతో తీవ్రంగా సతమతమవుతోంది. అగ్నికి ఆజ్యం తోడైనట్టు నీటి సంక్షోభం, స్థానిక సమస్యలు ఆ దేశాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ప్రజల్లో అసంతృప్తి జ్వాలలు చెలరేగుతున్నాయి. ఈ పరిస్థితిలో తన పదవిని కాపాడుకోవాలంటే మత చాందసవాదుల అండ రైసికి కావాలని, అందుకే మహిళలపై మొరాలిటీ పోలీసులను ప్రయోగిస్తూ వారి కరుణాకటాక్షల కోసం ప్రయత్నిస్తున్నాడని విశ్లేషకులు అంటున్నారు. హసన్ రౌహాని ఇరాన్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ఒక సర్వే నిర్వహించారు. అందులో సగం మందికి పైగా హిజాబ్ ధారణ వ్యక్తిగత అంశంగా మాత్రమే ఉండాలి తప్ప, బలవంతంగా రుద్దకూడదు అని తేల్చి చెప్పారు. మూడేళ్ల పాటు నిర్వహించిన ఈ సర్వే వివరాలను రౌహాణీ ప్రభుత్వమే ప్రచురించింది. 2006లో ఇదే తరహా సర్వే చేపడితే మహిళలు ఏం ధరించాలో చెప్పే హక్కు ప్రభుత్వానికి లేదని 34 శాతం మంది అభిప్రాయపడ్డారు. 2014 నాటికి వారి సంఖ్య 49 శాతానికి చేరడం గమనార్హం. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు హిజాబ్ ను శరీరాన్ని పూర్తిగా కప్పుకునే తరహా వస్త్రధారణగా అభివర్ణించాయి. దీనిని తిరోగమనంగా భావిస్తూ పలు దేశాలు ఆ వస్త్ర ధారణ పై నిషేధం విధించాయి. ఫ్రాన్స్, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్, బల్గేరియా, బెల్జీయం, ఆస్ట్రియా దేశాలు హిజాబ్ ను నిషేధించాయి. కొన్ని ముస్లిం దేశాల్లో కూడా ముఖాన్ని పూర్తిగా కప్పేసే ముసుగులపై నిషేధం ఉంది. మహా నిషేధం అల్జీరియా, బోస్నియా, హెర్జేగోవ్నీయా, కజకిస్తాన్, సిరియా, తజకిస్తాన్, ట్యూనిషియా దేశాల్లో ఉంది. ఆఫ్రికాలో కామెరున్, చాద్, కాంగో బుర్ఖా పై నిషేధం విధించాయి. ఉగ్రవాదులు బుర్ఖాలు ధరించి హింసాత్మక ఘటనలకు పాల్పడుతుండడంతో ఆ దేశాలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. సౌదీ అరేబియా నిబంధనల ప్రకారం మహిళలు గౌరవప్రదమైన దుస్తులు ధరించాలి. ఆసియాలోని చైనా, శ్రీలంక దేశాలు భద్రత కారణాల రిత్యా బుర్ఖా పై నిషేధం విధించాయి. ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ అంటే దేశంలో మాత్రం బుర్ఖా, హిజాబ్ తప్పనిసరి. అమెరికా, కెనడా, బ్రిటన్ దేశాలు మాత్రం తటస్థ వైఖరి అవలంబిస్తున్నాయి. ఇటీవల మొరాలిటీ పోలీసుల చేతిలో అరెస్టయి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన అమీనా వార్తను ప్రపంచానికి తెలియజెప్పిన హమేది శర్గ్ అనే పత్రికలో పనిచేస్తున్న మహిళా జర్నలిస్టు నిలూఫర్ హమేదిని పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఆమె తరపు న్యాయవాది మహమ్మద్ అలీ కం ఫిరోజి సోషల్ మీడియాలో వెల్లడించారు. అరెస్టుకు ముందు హమేది ఇంటిపై పోలీసులు దాడి చేశారు. ఆమెను అరెస్టు చేసి, వస్తువులను లాక్కున్నారు. హమేది ట్విట్టర్ ఖాతాను కూడా సస్పెండ్ చేశారు. అంతకుముందు పోలీసులు యాల్దా మొయిరి అనే ఫోటో జర్నలిస్టును కూడా అరెస్టు చేశారు. వీరు చేసిన తప్పల్లా ప్రభుత్వం చేస్తున్న దాష్టీకాన్ని ప్రపంచానికి చెప్పడమే. మహిళ వల్ల జగతి వర్ధిల్లుతుంది అనే సామెత పుట్టిన ఈ ప్రపంచంలో ఆ స్త్రీ కే కనీస హక్కులు లేకుండా చేయడం దారుణం. ఆ హక్కుల కోసం ఆమె పోరాడాల్సి రావడం మరింత దారుణం.