Kadambari Jethwani Case: కాదంబరి, సజ్జన్ ఎపిసోడ్ లో జగన్ పేరు ఎందుకు వినిపిస్తోంది? ఓ సెక్షన్ మీడియా పదేపదే దాన్నే ఎందుకు లాగుతోంది?

మహారాష్ట్రలోని ముంబై నగరంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో 2023 డిసెంబర్ 17న ప్రముఖ వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్ పై బాలీవుడ్ నటి కాదంబరి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

Written By: Anabothula Bhaskar, Updated On : August 31, 2024 1:15 pm

Kadambari Jethwani Case

Follow us on

Kadambari Jethwani Case: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో కాదంబరి ఎపిసోడ్ సృష్టిస్తున్న సంచలనం అంతా ఇంతా కాదు. ఈ వ్యవహారం నాటి ప్రభుత్వంలో కీలకంగా పనిచేసిన ముఖ్య అధికారులకు తలనొప్పిగా మారింది. ఈ ఉదంతాన్ని ప్రస్తుత ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించడంతో రోజుకో తీరుగా సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. అయితే ఈ మొత్తం ఎపిసోడ్లో జగన్మోహన్ రెడ్డి పేరును ఒక సెక్షన్ మీడియా పదే పదే ప్రస్తావించడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

మహారాష్ట్రలోని ముంబై నగరంలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ పోలీస్ స్టేషన్లో 2023 డిసెంబర్ 17న ప్రముఖ వ్యాపారవేత్త సజ్జన్ జిందాల్ పై బాలీవుడ్ నటి కాదంబరి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసు నమోదు అయిన తర్వాత అంటే 12 రోజులకు 2023 డిసెంబర్ 29న సజ్జన్ జిందాల్ తాడేపల్లిలో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిశారు. ఆ తర్వాత ఏడాది ఫిబ్రవరి 2న వైసీపీ నేత కుక్కల విద్యాసాగర్ విజయవాడలో ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించారు. ఆ తర్వాత మోసం అనే విషయాన్ని తెరపైకి తీసుకొచ్చి.. కాదంబరిపై ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 3న విజయవాడ పోలీసులు ముంబై వెళ్లి కాదంబరీ, ఆమె కుటుంబ సభ్యులను తీసుకొచ్చారు.. ఆ తర్వాత పోలీసులు చెప్పిన విషయాలన్నింటికీ కాదంబరి కుటుంబ సభ్యులు అంగీకరించారు. తర్వాత ఫిబ్రవరి 14న ఆమెకు బెయిల్ వచ్చింది.. ఫిబ్రవరి 15న కడప స్టీల్ ప్లాంట్ ఏర్పాటు కోసం మూడోసారి జరిగిన భూమి పూజ కార్యక్రమంలో సజ్జన్ జిందాల్ పాల్గొన్నారు.. అయితే ముంబై లో సజ్జన్ పై కేసు నమోదు చేసిన సమయంలో విచారణకు రావాలని కాదంబరికి సమాచారం పంపిస్తే.. ఆమె విచారణకు రాలేదు. దీంతో ముంబై పోలీసులు మార్చి 15న ఆ కేసును ముగించారు.

రక్షించేందుకు..

జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడైన సజ్జన్ జిందాల్ ను ఈ కేసులో కాపాడేందుకు అప్పటి పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందువల్లే వైసిపి నేత కుక్కల విద్యాసాగర్ తో ఫిర్యాదు చేయించారని తెలుస్తోంది. ముంబై ప్రాంతానికి చెందిన నాటికి విజయవాడ సమీపంలో భూమి కొనుగోలు చేయాల్సిన అవసరం ఏముందనే విషయాన్ని అప్పటి పోలీసులు పూర్తిగా విస్మరించారు. కాదంబరి తో పాటు ఆమె తల్లిదండ్రులను కూడా ఆగమేఘాల మీద విజయవాడ తీసుకొచ్చారు. అయితే ఈ వ్యవహారం ప్రస్తుత ప్రభుత్వ హయాంలో వెలుగు చూడటంతో ఒక్కసారిగా సంచలనంగా మారి. అయితే ఇదే సమయంలో వైసీపీ సోషల్ మీడియా, జగన్ ఆధ్వర్యంలో నడుస్తున్న మీడియా ముంబై సినీనటి వ్యక్తిత్వాన్ని హననం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోందని టిడిపి నేతలు ఆరోపిస్తున్నారు.. ప్రభుత్వాలు ఇలా చేస్తే పారిశ్రామికవేత్తలు పారిపోతారనే నిరాధార కథనాలను ప్రచురిస్తున్నారని మండిపడుతున్నారు. “జగన్ సొంత పేపర్ గత ప్రభుత్వంలో జరిగిన ఈ వ్యవహారాన్ని నిజం అని భావిస్తోంది. అది పూర్తిస్థాయిలో వికృత కథనం అని తేలిపోయింది. ఒక సినీ నటి విషయంలో ఇంతటి దారుణానికి పాల్పడాల్సిన అవసరం ఏముందని” తెలుగుదేశం పార్టీ నాయకులు మండిపడుతున్నారు.. కట్టుకథలు అల్లి చివరికి దొరికిపోయారని పేర్కొంటున్నారు.