Warangal Crime News: నిన్నటిదాకా భర్తలను భార్యలు ఏదో ఒక రూపంలో హత్య చేస్తే.. ఇప్పుడు భార్యలను భర్తలు అంతం చేస్తున్నారు. అత్యంత నీచాతి నీచమైన దారుణాలకు పాల్పడుతూ.. సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేస్తున్నారు. అటువంటి సంఘటనే ఇది. కాకపోతే ఈ దారుణంలో ఓ భర్త అత్యంత క్రూరంగా వ్యవహరించాడు. తన అవసరం కోసం భార్య జీవితాన్ని బలి పెట్టాడు.
క్లాస్మేట్ తో ప్రేమ..
అతని పేరు గణేష్. వీడి సొంత ప్రాంతం మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బాల్య తండా. ఇతడికి సూర్యాపేట జిల్లా దర్శన పల్లి గ్రామానికి చెందిన గౌతమితో ఈ ఏడాది మే 18న పెళ్లి జరిగింది. వివాహ సమయంలోనే గణేష్ కు కట్న కానుకలు లాంఛనాలు ఇచ్చారు. అతని కోరుకున్నట్టుగానే అత్యంత ఘనంగా పెళ్లి చేశారు. గణేష్ పెళ్లి కంటే ముందే తన క్లాస్మేట్ తో ప్రేమ వ్యవహారం కొనసాగిస్తున్నాడు. పెళ్ళికి ముందు సొంత గ్రామంలో ఉన్న గణేష్.. ఆ తర్వాత తన నివాసాన్ని వరంగల్ మార్చాడు. అత్తగారు ఇచ్చిన కట్నం డబ్బులతో ఆటో కొనుగోలు చేశాడు. వరంగల్ లో ఆటో తోలుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తన క్లాస్మేట్ తో ప్రేమ వ్యవహారం సాగిస్తున్న గణేష్.. ఎలాగైనా సరే ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు.
కంత్రి బుద్ధి
క్లాస్మేట్ తో పెళ్లికి భార్య అడ్డుగా ఉండడంతో.. కన్నింగ్ ప్లాన్ వేశాడు. ఆదివారం ఇంట్లో పడుకున్న తన భార్యను తల మీద దిండు పెట్టి శ్వాస ఆడకుండా చేశాడు. ఆ తర్వాత ఆమెను హత మార్చాడు. అనంతరం తన భార్యకు శ్వాస ఆడటం లేదని నాటకం ఆడాడు. 108 కి ఫోన్ చేసి.. ఆమెది సాధారణ మరణం అన్నట్టుగా బొంకులు బొంకాడు. ఆ తర్వాత అతని నాటకం తేలిపోతున్న తరుణంలో పారిపోయాడు. అయితే మృతురాలి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం తెలిసింది. తన భార్యను హత్య చేశానని గణేష్ ఒప్పుకున్నాడు. ఆమెది సాధారణ మరణం అని నమ్మించడానికి నాటకం ఆడానని చెప్పాడు. ఆమెను చంపడానికి క్లాస్మేట్ తో ప్రేమే కారణమని వెల్లడించాడు. అయితే వివాహం జరిగిన నాలుగు నెలలకే గౌతమి చనిపోవడంతో ఆమె తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్నారు.