Vikarabad: సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం నేపాల్ దేశంలో ప్రేమ పెళ్లికి ఒప్పుకోవడం లేదని తల్లిదండ్రులను కడ తేర్చాడు అక్కడి యువరాజు. అప్పట్లో ఆ సంఘటన ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమించిన అమ్మాయి కోసం కన్న తల్లిదండ్రులను అత్యంత దారుణంగా చంపడంతో యావత్ ప్రపంచం నివ్వెర పోయింది.
ఈ తరహా సంఘటనలకు ఇప్పటివరకు మగవారు మాత్రమే పాల్పడిన ఉదంతాలు చోటు చేసుకున్నాయి. కానీ, చరిత్రలో తొలిసారిగా ఆడపిల్ల ప్రేమ కోసం కన్న తల్లిదండ్రులను అంతం చేసింది. చివరికి పోలీసుల దర్యాప్తులో దొరికిపోయి కటకటాల వెనక్కి వెళ్లిపోయింది. హృదయ విదారకమైన ఈ సంఘటన తెలంగాణ రాష్ట్రంలో వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
వికారాబాద్ జిల్లాలోని బంట్వారం మండలం యాచారం మన గ్రామంలో నక్కలి దశరథం (58), లక్ష్మి (54) దంపతులు. వీరికి నలుగురు సంతానం. అందులో ముగ్గురు కూతుర్లు, ఒక కుమారుడు ఉన్నారు. చిన్న కుమార్తె సురేఖ (25) కు ఇంకా వివాహం కాలేదు. కుమారుడు అశోక్ తన భార్యా పిల్లలతో బంట్వారం లో వస్త్ర దుకాణం నిర్వహిస్తున్నాడు. సురేఖ సంగారెడ్డిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో నర్స్ గా పనిచేస్తోంది..ఈమెకు ఇన్ స్టా గ్రామ్ లో కొండాపూర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు పరిచయం అయ్యాడు. అతడు డ్రైవర్ గా పని చేస్తూ ఉంటాడు. ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇదే విషయాన్ని సురేఖ తల్లిదండ్రులకు చెప్తే. . కులాలు వేరని.. పెళ్లిచూడు కష్టమని చెప్పారు. అంతేకాదు సురేఖకు పెళ్లి చేయాలని సంబంధాలు చూడడం మొదలుపెట్టారు. దీంతో సురేఖ ఎలాగైనా సరే ప్రేమించిన యువకుడిని పెళ్లి చేసుకోవాలని అనుకుంది. తల్లిదండ్రులకు ఎంత చెప్పినా వినిపించుకోకపోవడంతో దుర్మార్గానికి తెగించింది.
నర్స్ గా పనిచేసే సురేఖకు ఇంజక్షన్ల మీద గట్టి అనుభవం ఉంది. అందువల్లే అత్యవసర పరిస్థితుల్లో ఉపయోగించే అనస్తీసియా మందును కొనుగోలు చేసింది. తన పని చేస్తున్న హాస్పిటల్లోనే మూడు సిరంజిలను సేకరించింది. హాస్పిటల్ లో పనిచేస్తున్న సురేఖ ఈనెల 24న సెలవు పెట్టింది. నేరుగా ఇంటికి వచ్చింది. మరుసటి రోజు తల్లిదండ్రులతో తన పెళ్లి ప్రస్తావన తీసుకొస్తే వారు ఏమాత్రం ఒప్పుకోలేదు. పైగా ఆమెను తీవ్రంగా మందలించారు. దీని మనసులో పెట్టుకున్న సురేఖ తన ప్లాన్ అమలు చేయాలని నిర్ణయించుకుంది.
సురేఖ తల్లికి తీవ్రమైన ఒళ్ళు నొప్పులతో బాధపడుతూ ఉంటుంది. ఆ నొప్పి నుంచి ఉపశమనం కలిగించడానికి ఇంజక్షన్ వేస్తానని చెప్పింది. దానికి లక్ష్మీ ఒప్పుకుంది. ఈ క్రమంలో తన వెంట తెచ్చుకున్న మత్తుమందును మోతాదుకు మించి లక్ష్మికి ఇచ్చింది. కొద్దిసేపటికి లక్ష్మి మత్తు లోకి వెళ్లిపోయింది. ఆ తర్వాత దశరధానికి కూడా సురేఖ అదే విధంగా ఇంజక్షన్ ఇచ్చింది. అతను కూడా అదేవిధంగా చనిపోయారు.
వెంటనే సురేఖ తన సోదరుడు అశోక్ కు ఫోన్ చేసింది. అమ్మా నాన్న చనిపోయారు.. త్వరగా రా అంటూ అక్కడికి ఫోన్లో చెప్పింది..”నాన్నకు ముందుగా గుండెపోటు వచ్చింది. ఆయన చనిపోయాడు. ఆయన చనిపోయిన వెంటనే అమ్మ కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అమ్మకు నేను సిపిఆర్ చేశాను. అయినప్పటికీ ఉపయోగం లేకుండా పోయింది. నువ్వు చెప్పినట్టు వినమన్నాడు. మొత్తం నువ్వు చూసుకుంటావని నాన్న అన్నాడని” అశోక్ తో సురేఖ ఏడుస్తూ చెప్పింది..
ఈలోగానే పోలీసులు అక్కడికి వచ్చారు. అక్కడ వారికి రెండు సిరంజిలు కనిపించాయి. వాటి గురించి అడిగితే చాలా రోజుల క్రిందటివని నామా పలికే ప్రయత్నం చేసింది. ఇదే క్రమంలో ఆమె హ్యాండ్ బ్యాగ్ లో మరో సిరంజిని పోలీసులు గుర్తించారు. దీంతో వాటి లేబుల్, అందులో ఉన్న మందు ఆధారంగా పోలీసులు వివరాలు సేకరించారు. ఆమె దగ్గర ఉన్న మిగతా సిరంజిలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా..ప్రేమ పెళ్లికి ఒప్పుకోకపోవడం వల్ల ఇలా చేశానని ఆమె చెప్పడం గమనార్హం.