Missing husband spotted in Insta reel: తప్పు చేసిన వాడు ఎప్పటికీ తప్పించుకోలేడు. ద్రోహం చేసినవాడు ఎన్నటికీ దొరికిపోకుండా ఉండలేడు. అపరాధం చేసినవాడు ఎప్పటికీ సత్యవంతుడు కాలేడు. సినిమాల్లో ఇలాంటి డైలాగులు మనకు వినిపిస్తూనే ఉంటాయి. కానీ నిత్య జీవితంలో ఇలా జరుగుతుందా.. తప్పు చేసినవాడు దర్జాగా తిరుగుతుంటే.. ఇక కర్మ సిద్ధాంతం ఎక్కడిది అని చాలామంది అనుకుంటారు. అది కూడా నిజమే. కాకపోతే అది కొన్ని సందర్భాల్లో నిరూపితం అవుతుంది. ఇతడి విషయంలో కూడా నిరూపితమైనది.
అతని పేరు జితేంద్ర. ముద్దుగా బబ్లు అని పిలుచుకుంటారు. అతడి స్వస్థలం ఉత్తర్ ప్రదేశ్. 2018లో శీలు అనే అమ్మాయితో అతనికి వివాహం జరిగింది.. వివాహం జరిగిన తొలి రోజుల్లో అతడు ఆమెతో బాగానే ఉన్నాడు. పెళ్లయిన కొత్తలో నూతన దంపతులు విహారయాత్రలకు వెళ్లేవారు. ఇంట్లో కూడా సరదాగా గడిపేవారు. పెళ్లయిన కొద్ది నెలలకే షీలు నెలతప్పింది. తన కడుపుపండిన సంతోషం ఆమెకు ఎన్నో రోజులు లేదు. భార్య గర్భవతి అయిన తర్వాత కొద్ది రోజులు బాగానే ఉన్న బబ్లు.. ఆ తర్వాత ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు.
అకస్మాత్తుగా భర్త తన వదిలి వెళ్లిపోవడంతో.. శీలు కన్నీటి పర్యంతమైంది. పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయినప్పటికీ అతడి జాడ తెలియ రాకపోయింది. అయితే ఇటీవల బబ్లు ఇన్ స్టా గ్రామ్ లో కనిపించాడు. మరో మహిళతో సన్నిహితంగా ఉన్నాడు. దీంతో శీలు ఆ దృశ్యాన్ని చూసి గుండెలు పగిలే విధంగా రోదించింది. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు చెప్పింది. దీంతో వారు అతని మీద చీటింగ్ కేసు పెట్టారు. ఇంట్లో నుంచి పారిపోయిన తర్వాత బబ్లు పంజాబ్ వెళ్లిపోయాడు. లుధియాన ప్రాంతంలో మరో మహిళను వివాహం చేసుకున్నాడు. ఆమెతో కాపురం కూడా పెట్టాడు. రెండో భార్య ముచ్చటపడడంతో బబ్లు కాదనలేక ఆమెతో ఒక రీల్ చేశాడు. అది కాస్త సోషల్ మీడియాలో పడటం.. శీలు కంటికి చికడంతో బబ్లు గుట్టు రట్టయింది. ఉత్తర ప్రదేశ్ పోలీసులు పంజాబ్ వెళ్లి బబ్లూను పట్టుకువచ్చారు.. అతడిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. ఇదంతా ఏమి తెలియని రెండవ భార్య లుదియానా వచ్చిన పంజాబ్ పోలీసులను దూషించింది. వారు అసలు విషయం చెప్పడంతో కన్నీటి పర్యంతమైంది.