Hydra: హైదరాబాద్ లో ఆక్రమణలు లేకుండా.. అక్రమాలు లేకుండా.. చెరువులను, కుంటలను, నాలా లను పరిరక్షించడానికి తెలంగాణ ప్రభుత్వం హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకువచ్చింది. హైడ్రా అనేక పనులు చేపడుతూ నిత్యం వార్తల్లోనే నిలుస్తోంది. హైడ్రా వల్ల లబ్ధి పొందిన వారు జేజేలు పలుకుతుంటే.. హైదరాబాద్ లో ఇబ్బంది పడిన వారు విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ అనుకూల మీడియా హైడ్రాకు జేజేలు పలుకుతుంటే.. ప్రతిపక్ష పార్టీ అనుకూల మీడియా హైడ్రా వేస్తున్న ప్రతి అడుగును విమర్శిస్తోంది.
హైడ్రా పేరు చెప్పి..
హైడ్రా చేస్తున్న మంచి పనుల వల్ల అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.. మంచి వెనుక చెడు ఉన్నట్టు.. హైడ్రా పేరు చెప్పుకొని కొంతమంది వసూళ్లకు పాల్పడుతున్నారు. హైడ్రా పేరుతో బెదిరింపులు కూడా చేస్తున్నారు. ఇలాంటి ఓ బృందం పన్నాగం బయటపడింది. ఒక మహిళకు మాయమాటలు చెప్పి.. ఏకంగా 50 లక్షల వరకు వసూలు చేసిన వారి దుర్మార్గం వెలుగులోకి వచ్చింది.. దీనిపై హైడ్రాకు ఫిర్యాదు అందడంతో.. హైడ్రా ఏసిపి పహడి షరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఏం జరిగిందంటే
హైదరాబాద్ , తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని మంఖాల్ గ్రామంలో వర్టిక్స్ అనే కంపెనీ లేఅవుట్ వేసింది. ఈ కంపెనీ సూరం చెరువును ఆక్రమించి.. కొత్త కుంటలో మట్టి పోసి.. డ్రైనేజీ నిర్మించాలని ఇటీవల హైడ్రాకు ఫిర్యాదు వచ్చింది. హైడ్రా విచారణ చేపట్టి.. ఆ కంపెనీపై రెండు కేసులు నమోదు చేసింది.. ఇదే క్రమంలో చైతన్య రెడ్డి అనే మహిళ రంగంలోకి దిగి.. వర్టెక్స్ కంపెనీ తమ భూమిని ఆక్రమించి రోడ్డు నిర్మించిందని హైడ్రాకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుల నేపథ్యంలో హైడ్రా అధికారులు విచారణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన ఓ డిజిటల్ ఛానల్ ప్రతినిధులు, ఓ లాయర్ తమ చాకచక్యాన్ని ప్రదర్శించారు. చైతన్య రెడ్డిని ఆశ్రయించి న్యాయం చేస్తామని ఆమె దగ్గర నుంచి 50 లక్షలు వసూలు చేశారు. తమకు హైడ్రా అధికారులు తెలుసని.. అన్నీ మేము చూసుకుంటామని చెప్పడంతో నమ్మి 50 లక్షలు ఇచ్చింది. అయితే ఆ తర్వాత తన సమస్య పరిష్కారం కాకపోవడంతో చైతన్య రెడ్డి హైడ్రా అధికారులను ఆశ్రయించింది. హైడ్రా అధికారులు పహడి షరీఫ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.